ఆధ్యాత్మికం : గుడిలో హారతి, తీర్థం, గంట, శఠగోపం భక్తికే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.. అదెలాగో తెలుసుకుందామా..!

చాలామంది గుడికి వెళ్తారు. దేవుడిని దర్శించుకుంటారు. అక్కడ జరిగే అనేక కార్యక్రమాలలో పాల్గొంటారు. గంట కొడతారు... కర్పూరం వెలిగించి ...హారతి ఇస్తే తీసుకుంటారు. పూజారి శఠగోపం పెడితే తీసుకుంటారు. తీర్థం తాగుతారు. వీటన్నింటి వెనుక భక్తికి, ముక్తికి సంబంధించిన అంశాలే కాదు, ఆరోగ్యానికి చెందిన అనేక రహస్యాలూ ఉన్నాయి. అవేంటే... చూద్దాం

కర్పూరం

ఇంట్లో పూజలు చేసినా, గుడికి వెళ్లినా తప్పనిస రిగా పూజా సమయంలో కర్పూరం వెలిగిస్తారు. మరి కర్పూరం ఎందుకు వెలిగిస్తారు? అనేదాని వెనక శాస్త్రీయమైన కారణాలున్నాయంటున్నారు భక్తులు.   కర్పూరం వెలిగించినప్పుడుదాని నుంచి వచ్చే పొగ పీలుస్తారు. ఆ పొగ ఆస్తమా, హిస్టీరియా. కీళ్ల నొప్పుల్లాంటి అనారోగ్యాలను తగ్గిస్తుందట. అంతేకాదు కర్పూరం పొగ సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. 

ఇక ఆధ్యాత్మిక పరంగా కూడా అర్ధం చేసుకోవచ్చు. కర్పూరం మనిషిలో ఉండే అహానికి గుర్తు. కర్పూరం ఎలా కాలి బూడిదై పోతుందో దేవుని ముందు మనిషిలోని అహం కూడా అలాగే తగలబడి పోయి, నిజమైన మనిషి మిగలాలని కర్పూరాన్ని వెలిగిస్తారు. పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది కర్పూరం నుంచి వచ్చే వాసన. దాంతో మానసిక ప్రశాంతత కలుగుతుం ది. కర్పూరానికి రెండు గుణాలున్నాయి. పూర్తిగా కాలిపోతుంది. మంచి సువాసనను ఇస్తుంది. మనిషి బతికున్నంతకాలం ఇలా మంచి వాసన లతో ఇతరుల మేలు కోరుకుంటూ జీవించాలి. చనిపోయిన తర్వాత పూర్తిగా ఈ లోకాన్ని వదిలి వెళ్తాడనే సూచన కూడా ఉంది

తీర్థం

దేవాలయాల్లో తీర్థం ఇస్తుంటారు. ఈ తీర్ధం ఎందుకు ఇస్తారు? వాటిలో ఏం ఉంటాయో..!? చాలామందికి తెలీదు. దేవుడికి  అభిషేకం చేసేందుకు వాడిని నీళ్లు అవి. తులసి ఆకులు. పచ్చకర్పూరం, కేసరి, గంధం, నీళ్లు కలిపి చేస్తారు. తులసి, కర్పూరం శరీరంలోని నాడీవ్యవస్థ బాగా పనిచేయడానికి సహాయపడతాయి. అలాగే ఈ తీర్థాన్ని రాగి పాత్రలో ఉంచుతారు కాబట్టి.... రాగికి వేడిని గ్రహించి, లవణాలను కరిగించే స్వభావం ఉంటుంది. అందువల్ల ఆ నీళ్లకు అనేక రోగాలను తగ్గించే శక్తి ఉంటుంది.

Also Read :- లోక‌మంతా ప‌చ్చ‌గా ఉండేలా వ‌ర్షం ప‌డాలి.. !

 తీర్థాన్ని భక్తులకు మూడుసార్లు ఇస్తారు. మొదటి సారి తీసుకునే తీర్థం శరీర మానసిక శుద్ధికి...రెండో సారి తీర్థం న్యాయం, ధర్మం ప్రకారం నడుచుకోడానికి.....మూడోసారి ఆ భగవంతుడిని చేరుకునే పరమపదం కోసమని పెద్దలు అంటారు. చేతిని చెవి ఆకారంలో ఉంచి తీర్థం తీసుకోవాలని చెప్తారు. కొందరు తీర్థం తాగిన తర్వాత తలకు రుద్దుకుంటారు. పాపాలు తొ లగడానికి ఇచ్చే తీర్థాన్ని తలకు పూసుకోవడం మంచిదికాదని చెప్తారు.

గంట‌

దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా గంట ఉంటుంది. దేవుడికి కర్పూరంతో హారతి ఇస్తూ గంటకొడతారు. గంటలు ఇత్తడితో చేసి ఉంటాయి. కంచుతో చేసిన గంట కొట్టినప్పుడు దాని నుంచి ఓంకార శబ్దం వస్తుందని నమ్ముతారు. భక్తులు. ఆ శబ్దం మనిషిలోని, పరిసరాల్లోని దుష్టశక్తులను తరిమివేస్తుందని చెప్తారు.. గంటను శుభానికి చిహ్నంగా భావిస్తారు. గంటలో ఉండే నాలుక మీద సరస్వతీదేవి కొలువై ఉంటుందని అంటారు. గుడిలోకి వెళ్లినా, ఇతర ఆలోచనలతో దైవం మీద మనసును నిమగ్నం చేయలేక పోవచ్చు.

అందుకే హారతి ఇచ్చే సమయంలో శరీరాన్ని, మనసును రెండింటినీ భగవంతుని మీద లగ్నం చేయమని సూచించడానికి గంట కొడతారని మరికొందరు చెప్తారు. కొందరు గంట మోగించిన తర్వాత దైవ దర్శనం చేసు కుంటారు. అది కూడా మనసు భౌతికమైన ఆలోచనల నుంచి భగవంతుని మీదకు మళ్ల దానికి ఉపయోగపడుతుంది

శఠగోపం

గుడిలో పూజారి తలమీద శఠగోపం పెడతాడు. ఎందుకు పెడతాడు.? దానిపై ఏమి ఉంది? అని ఎప్పుడైనా ఆలోచించా రా... దాని పై దేవుడి పాదాలు ఉంటాయి. అంటే భగవంతుడి పాదాలు తలకు తగలడం వల్ల అనుగ్రహం కలుగుతుందని చెప్తారు. అందుకే అది గుండ్రని ఆకారంలో తలకు పట్టేలా తయారు చేసి ఉంటుంది. నిజానికి శఠత్వం అంటే మూర్ఖత్వం అనే అర్ధం ఉంది. మనిషిలో ఉన్న మూర్ఖత్వాన్ని శఠగోపం పోగొడుతుందని భక్తులు నమ్ముతారు. 

శఠగోపాన్ని పంచలోహాలతో తయారు చేస్తారు. దాన్ని తల మీద ఉంచిన ప్పుడు శరీరంలో ఉన్న అధిక వేడి బయటకు వెళ్తుంది. దాంతో ఆందోళన, కోపం,
ఆవేశం తగ్గుతాయి. అంతేకాదు, మనిషిలో ఉన్న కామం, క్రోధం, మోహం, మదం, మాత్పర్యం... దూరం కావాలని శఠగోపం తీసుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తారు. ఆ సమయంలో మనసులో మాత్రమే దేవునికి తనలోని కోరికను విన్నవించుకోవాలని అంటారు.

-వెలుగు,లైఫ్‌-