ఎండాకాలం... ఎక్కువగా దాహం వేస్తోంది. ఎన్ని నీళ్లు తాగాలి? ఎప్పుడు తాగాలి? అన్న చర్చ ఇటీవల ఎక్కువైంది. నీళ్లు తాగితే చాలు ఎలాంటి రోగాలు రావు అన్నదాకా వెళ్లింది ఈ చర్చ. నీళ్లు తాగడం అన్నది వాళ్ల వాళ్ల శరీరం, ఉండే వాతావరణం, చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది పుస్తకాలు చదివి, యూట్యూబ్ లో వీడియోలు చూసి అన్ని తాగాలి.
ఇన్ని తాగాలి అని చెప్తుంటారు. అసలు ఎన్ని నీళ్లు తాగాలి అన్నవిషయంపై నిర్ధారణ ఏమీ లేదు. పరిశుభ్రమైన నీళ్లు దాహం వేసినప్పుడు తాగితే చాలు. అలాగే ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక గ్లాసు మంచినీళ్లు తాగితే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.
దీనిపై అధ్యయనం చేశారు. ఎక్కువ నీళ్లు తాగితే 'హైపో నైట్రోమియా' అనే సమస్య వస్తుందట. రక్తంలో ఉండే సోడియం శాతం పడిపోతుందని అన్నారు. నీళ్లు ఎక్కువ తాగితే వికారం వల్ల వాంతులు అవ్వొచ్చని చెప్పారు. దాంతో ఒక్కోసారి ఎక్కువ నీళ్లు తాగితే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దాహం వేసినా, నీళ్లు సరిపోయినా మెదడు సంకేతాలు ఇస్తుంది. ఎవరైనా దాని స్పందన ప్రకారం నీళ్లు తాగితే సరిపోతుంది.