దేశంలోని యువతలో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ సర్వే వెల్లడించింది. క్యాన్సర్ చికిత్స గురించి తెలుసుకోవడానికి తమ హెల్ప్ లైన్ నంబర్ 93555 20202కు మార్చి 1 నుంచి మే 15 మధ్య 1,368 కాల్స్ వచ్చాయని, వారిలో 40 ఏండ్లలోపు వారు 20 శాతం ఉన్నారని సర్వే తెలిపింది. 40 ఏండ్లలోపు వారిలో 60 శాతం మంది పురుషులు అని పేర్కొంది.
హెల్ప్ లైన్ నంబర్ తో దేశవ్యాప్తంగా క్యాన్సర్ బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, అదొక సపోర్ట్ సిస్టమ్ గా ఉపయోగపడుతున్నదని క్యాన్సర్ ముక్త్ భారత్ క్యాంపెయిన్ హెడ్, సీనియర్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. హెల్ప్ లైన్ కు రోజూ వందల కాల్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు. ఫోన్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది తల, మెడ క్యాన్సర్ బాధితులు ఉన్నారని వెల్లడించారు.
అయితే, రోజువారి జీవన విధానంలో మార్పులు చేసుకోవడం, టీకాలు తీసుకోవడం వంటి చర్యలతో ఆ క్యాన్సర్ ను నివారించవచ్చన్నారు. అలాగే ప్రభావవంతమైన స్ర్కీనింగ్ స్ట్రాటజీస్ తో బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చన్నారు. అయితే, సరైన స్ర్కీనింగ్ తీసుకోకపోవడం వల్ల దేశంలోని మూడింట రెండు వంతుల క్యాన్సర్ కేసులను ఆలస్యంగా గుర్తించారని తెలిపారు.
‘‘దేశంలో డయాగ్నోస్ చేసిన క్యాన్సర్ కేసుల్లో 27 శాతం మొదటి, రెండో దశలో ఉన్నాయి. 63 శాతం కేసులు మూడు, నాలుగో దశలో ఉన్నాయి. తమ చికిత్స సరైనదా కాదా, అప్ టు డేట్ ఉందా అని తెలుసుకోవడానికి చాలా మంది బాధితులు రెండో అభిప్రాయం కోసం కాల్ చేశారు. అలాగే ప్రతి వారం కొత్త మందులను అప్రూవ్ చేస్తున్న నేపథ్యంలో తమ చికిత్సకు ఆ మందులు దొరుకుతున్నాయా లేదా అని మరికొంత మంది హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేశారు” అని డాక్టర్ ఆశిష్ గుప్తా వివరించారు.
తమ క్యాన్సర్ ఏ దశలో ఉందని చాలా మంది బాధితులు అడిగారని, అలాగే కుటుంబ సభ్యులకు క్యాన్సర్ రాకుండా నివారించడానికి ఏం చేయాలో అడిగారని ఆయన తెలిపారు. తమ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసిన వారిలో 67 శాతం మంది ప్రైవేటు హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా.. 33 శాతం మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.