లక్నోలో విషాద ఘటన జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగి ఆఫీసులోనే తన డెస్క్లో కుర్చీలో నుంచి కిందపడి కుప్పకూలి చనిపోయింది. ఈ ఘటనతో బ్యాంకులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. లక్నోలోని గోమతి నగర్ ప్రాంతంలోని విభూతిఖండ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సాదఫ్ ఫాతిమా (45) అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్గా జాబ్ చేస్తుంది. రోజూలానే మంగళవారం కూడా ఉద్యోగ నిమిత్తం బ్యాంకుకు వెళ్లింది. ఏం జరిగిందో తెలియదు.. తను కూర్చున్న చైర్ నుంచి కిందపడిపోయింది. బ్యాంకు సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఆమెపై పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, ఈ కారణంగానే పని ఒత్తిడి వల్ల టెన్షన్ పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చని సహోద్యోగులు చెప్పారు.
ALSO READ | దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా.. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ఫాతిమా అనుమానాస్పద మృతిపై విభూతిఖండ్ అసిస్టెంట్ కమిషనర్ రాధారమణ్ సింగ్ మాట్లాడుతూ.. ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టానికి పంపించామని తెలిపారు. పోస్ట్మార్టం అనంతరం ఆమె మృతికి కారణం ఏంటనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందించారు. ఈ ఘటన దిగ్ర్భ్రాంతికి గురిచేసిందని.. దేశంలోని అన్ని కంపెనీలు ఈ విషయంపై ఆలోచన చేయాలని సూచించారు.
लखनऊ में काम के दबाव और तनाव के कारण एचडीएफ़सी की एक महिलाकर्मी की ऑफिस में ही, कुर्सी से गिरकर, मृत्यु का समाचार बेहद चिंतनीय है।
— Akhilesh Yadav (@yadavakhilesh) September 24, 2024
ऐसे समाचार देश में वर्तमान अर्थव्यवस्था के दबाव के प्रतीक हैं। इस संदर्भ में सभी कंपनियों और सरकारी विभागों तक को गंभीरता से सोचना होगा। ये देश के… pic.twitter.com/Xj49E01MSs
‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ (EY) కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్న అన్నా సెబాస్టియన్ పెరియాలి పని ఒత్తిడి కారణంగా చనిపోయిందని ఆమె తల్లి చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఫాతిమా కూడా పని ఒత్తిడి కారణంగానే చనిపోయిందని వార్తలు వస్తుండటంతో ఉద్యోగుల గుండెల్లో గుబులు రేగుతోంది. పని ఒత్తిడి పతాక స్థాయికి చేరితే ప్రాణం పోతుందేమోనన్న భయం మొదలైంది. డెడ్లైన్స్ దగ్గర పడుతున్నప్పుడు, పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయినప్పుడు మానసిక ప్రశాంతత దూరమయ్యే అవకాశం ఉంది. హార్ట్ బీట్ స్పీడ్ పెరుగుతుంది. కొంతసేపటికి లేదా కొన్ని గంటలకు హృదయ స్పందన మాములు స్థితికి వచ్చినప్పటికీ ఇలా హార్ట్ బీట్ తరచుగా పెరుగుతుండటం, తగ్గుతుండటం వల్ల కొందరిలో క్లాట్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఫలితంగా గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.