నిజామాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు 

విద్యార్థులు రెగ్యులర్​గా కళాశాలకు వచ్చేలా చూడాలి

బీర్కూర్, వెలుగు : బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో శుక్రవారం పేరెంట్స్​మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్​మోహన్​ మాట్లాడారు. మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు.  సమావేశంలో విద్యార్థుల ప్రగతి తదితర అంశాలపై చర్చించామన్నారు. విద్యార్థులు రెగ్యులర్​గా కళాశాలకు వచ్చేలా తల్లిదండ్రులు చూడాలన్నారు.   సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం..యువకుడి మృతి

బోధన్, వెలుగు : బోధన్ పట్టణంలోని గౌడ్స్​కాలనీకి చెందిన పంజాల శంకర్​గౌడ్, -నళినీ దంపతుల కుమారుడు నీరజ్ గౌడ్(23) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. ఈనెల 16న స్నేహితుని పుట్టిన రోజు వేడుకకు హాజరై కారులో తిరిగి వస్తున్నాడు. మంచు ఎక్కువగా ఉండడంతో  రోడ్డు కనిపించకపోవడంతో జరిగిన ప్రమాదంలో మృతిచెందినట్లు చెప్పారు.

శంకర్ గౌడ్​కు ఇద్దరు కుమారులు ఉన్నారు.  ప్రమాదంలో  మృతి చెందింది నీరజ్​ గౌడ్​ పెద్దకుమారుడు.   ఎంఎస్​ చేయడానికి 2023లో అమెరికా వెళ్లాడని, మూడు నెలల్లో ఎంఎస్​ పూర్తిచేసి ఇండియా వచ్చేవాడన్నారు. నీరజ్​గౌడ్ మృతదేహం కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.  మృతదేహాన్ని త్వరగా ఇండియా రప్పించాలని తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. 

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

కామారెడ్డి, వెలుగు : ఈ విద్యా సంవత్సరంలో టెన్త్​ స్టూడెంట్లు వంద శాతం ఉత్తీర్ణత  సాధించాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​ అన్నారు.  శుక్రవారం గాంధారి మండలం పొతంగల్​ కలాన్​ హైస్కూల్​, హెల్త్ సెంటర్​, అంగన్వాడీ సెంటర్​ను సందర్శించారు.  ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరు తెన్నును పరిశీలించి పలు సూచనలు చేశారు. 10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్​ మాట్లాడారు.  ప్రతీ విద్యార్థి 10 జీపీఏ సాధించేలా  తీర్చి దిద్దాలని ఉపాధ్యాలకు సూచించారు.  

పేరెంట్స్​ కమిటీ మీటింగ్​ ఏర్పాటు చేయాలని,   పాఠ్యాంశాలతో పాటు జనరల్ నాలెడ్జి పై అవగాహన పెంచాలన్నారు.  అంగన్వాడీ సెంటర్​లో పిల్లలతో పాటలు పాడించారు.  ఆయన వెంట ఆర్డీవో ప్రభాకర్, డీఈవో రాజు,  డీఎంహెచ్​వో చంద్రశేఖర్​,   డీఆర్​డీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.    

లారీ ఢీకొని వృద్ధుడి మృతి

సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి జిల్లా సదాశివనగర్​మండలంలోని కుప్రియాల్​స్టేజి వద్ద టీవీఎస్ ను లారీ ఢీ కోట్టడంతో వృద్ధుడు మృతి చెందినట్లు సదాశివనగర్​ ఎస్​ఐ రంజిత్​ తెలిపారు. ఎస్​ఐ తెలిపిన వివరాల ప్రకారం సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన కుప్రియాల చిన్న బాబాయ్య(68) అనే వ్యక్తి టీవీఎస్​ఎక్స్​ల్​ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో నిజామాబాద్​నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఏఎన్​ఎంల ధర్నా

కామారెడ్డిటౌన్, వెలుగు : వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న  తమను రెగ్యులరైజ్​ చేయాలని డిమాండ్​ చేస్తూ శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట  ఏఏన్​ఎంలు ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఏఎన్​ఎం లక్ష్మి మాట్లాడుతూ కొన్నేళ్లుగా  కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నామని,  ప్రభుత్వం తమ సేవలను గుర్తించి రెగ్యులరైజ్​చేయాలన్నారు.  రేణుక, సవిత, లక్ష్మి,  తదితరులు పాల్గొన్నారు.