పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి : సీహెచ్ రాములు
సూర్యాపేట, వెలుగు : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ రాములు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్, జీపీఎఫ్ రుణాలు, పార్ట్ ఫైనల్స్, పెన్షనర్ల రిటైర్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు.
నూతన పీఆర్సీ కమిటీ రిపోర్టును తెప్పించుకొని 2023 జూలై నుంచి అమలు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ యాకయ్య పాల్గొన్నారు.
41 రోజులపాటు అన్నదానం
నల్గొండ అర్బన్, వెలుగు : నవంబర్ 16 నుంచి ఈనెల 26 వరకు మండలంలో అయ్యప్ప మాలధారణ భక్తులకు నిత్యఅన్నదానం చేసి పెద్ద మనసును చాటుకున్నాడు ఓ భక్తుడు. నల్గొండ పట్టణంలోని 41వ వార్డు పద్మావతి కాలనీలో సేమ్ డే డ్రై క్లినిక్ చెందిన నారాయణదాసు వెంకన్న 41 రోజుల నుంచి అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులకు అన్నదానం చేశారు. గురువారం అయ్యప్ప మండప పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ మూడేండ్ల నుంచి అయ్యప్ప భక్తులకు 50 మందికి తగ్గకుండా ప్రతిరోజూ అన్నదానం చేసినట్లు తెలిపారు.
అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కోటిరెడ్డి
హుజూర్ నగర్, వెలుగు : హుజూర్ నగర్ లోని రెండో జిల్లా సెషన్స్ కోర్టుకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా న్యాయవాది బొబ్బ కోటిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. గురువారం కోటిరెడ్డి అడిషనల్పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మంత్రి ఉత్తమ్ కు ధన్యవాదాలు తెలిపారు. నిజాయితీగా పనిచేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు.
నిజాయితీ చాటుకున్న కండక్టర్
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సీహెచ్ రమేశ్ తన నిజాయితీని చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన ఉపేంద్ర అనే మహిళ గురువారం యాదగిరిగుట్ట డిపోకు చెందిన బస్సులో ఘట్కేసర్ నుంచి సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ కు బయల్దేరింది. జూబ్లీ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత రూ.1.50 లక్షలు ఉన్న తన బ్యాగును ఆమె బస్సులో మర్చిపోయి దిగి వెళ్లిపోయింది.
దీనిని గమనించిన సదరు కండక్టర్ రమేశ్ ఆ బ్యాగును యాదగిరిగుట్ట బస్ డిపోలో అధికారులకు అందజేశారు. బ్యాగులోని సెల్ నంబర్ ఆధారంగా సదరు మహిళకు ఫోన్ చేసి యాదగిరిగుట్టకు రప్పించి ఆర్టీసీ అధికారులు బ్యాగును అప్పగించారు. ఆ బ్యాగులో రూ.1.50 లక్షల నగదుతోపాటు రెండు జతల వెండి పట్టగొలుసులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు ఉన్నాయి.
కారును ఢీకొట్టిన బైక్, ఒకరు మృతి
దేవరకొండ(చింతపల్లి), వెలుగు : ఆగి ఉన్న కారును బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన చింతపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ యాదయ్య వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం గొల్లపల్లికి చెందిన తోటపల్లి రాములు.. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలోని ఓ ఫంక్షన్‌హాల్ లో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. తన స్వగ్రామమైన గొల్లపల్లిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు హాజరుకావడానికి గురువారం మంచాల నుంచి అతడు బయల్దేరాడు.
చింతపల్లి మండలం వింజమూరు గ్రామ శివారులోని హరిహర క్షేత్రం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును రాములు తన బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయమై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బామ్మర్ది వెలిజర్ల ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
యువతి అదృశ్యం
హుజూర్ నగర్, వెలుగు : యువతి అదృశ్యమైన ఘటన హుజూర్‌నగర్‌లో వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ ముత్తయ్య వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ కు చెందిన కర్నే స్పందన పీజీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నది. ఈనెల 24న తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి స్పందన కనిపించలేదు. చుట్టుపక్కల, బంధుమిత్రుల వద్ద వెతికినా అమ్మాయి ఆచూకీ లభించలేదు. దీంతో తల్లి కర్నే నాగమణి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.