నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

‘డబుల్’ ఇండ్లను దివ్యాంగులకు కేటాయించాలి

హుజూర్ నగర్, వెలుగు : పట్టణ శివారులోని రామస్వామిగుట్ట వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన దివ్యాంగులకు కేటాయించాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ఆకుల రాము కోరారు. ఈ మేరకు సోమవారం హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాసును కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో సంఘం నాయకులు మన్యం వీరాంజనేయులు, ఖాదర్, లక్ష్మణరావు, పుల్లయ్య, రామకృష్ణ, రూపారాణి, ఆదిలక్ష్మి, నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

హుజూర్ నగర్, వెలుగు : హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హుజూర్ నగర్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 55 ఏండ్లు నిండిన ప్రతి కార్మికుడికి రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకులు ధనమూర్తి, వెంకటేశ్వర్లు, వీరస్వామి, సురేశ్, వెంకటనారాయణ, శంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఈ-సేవ కేంద్రం ప్రారంభం 

హుజూర్ నగర్, వెలుగు : హుజూర్ నగర్ కోర్టు ప్రాంగణంలో ఈ–సేవా కేంద్రాన్ని వర్చువల్ గా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ప్రారంభించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాములు రామిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 30 కోర్టుల్లో ఈ–సేవా కేంద్రాలను వర్చువల్ గా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారని తెలిపారు. ఈ కేంద్రాలతో ప్రజలకు త్వరగా న్యాయ సహాయం అందుతుందని పేర్కొన్నారు. 

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య 

గరిడేపల్లి, వెలుగు : అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గరిడేపల్లిలో సోమవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలో నర్సాయిగూడెం గ్రామానికి చెందిన నన్నెపంగు వెంకన్న(46) గరిడేపల్లిలోని భారత్ పెట్రోల్ బంక్ లో ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. వెంకన్న గ్రామంలో ఇటీవల అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. అనంతరం అప్పులు తీర్చలేక జీవితం మీద విరక్తి చెంది గరిడేపల్లిలో సమీపంలో పురుగులమందు తాగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడు. 

స్థానికులు గమనించి వెంటనే అతడిని 108లో హుజూర్​నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా సోమవారం చికిత్స పొందుతూ వెంకన్న మృతి చెందాడు. మృతుడి భార్య కళమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి 

కట్టంగూర్ (నకిరేకల్ ), వెలుగు : కారుఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన కట్టంగూర్ మండలం ఐటిపాముల గ్రామంలోని జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన గోపసి భిక్షం(59)ఈనెల 22న ఐటీపాములలో జరిగిన తన బంధువుల ఫంక్షన్​కు వెళ్లాడు. సోమవారం తిరిగి తమ స్వగ్రామానికి వెళ్లేందుకు ఆటో కోసం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వెళ్లే కారు వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

బెల్టు షాప్ పై దాడులు 

మర్రిగూడ, వెలుగు : మండలంలోని సరంపేట గ్రామానికి చెందిన అల్లంపల్లి నరసింహ ఇంట్లో మద్యాన్ని అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ మునగాల కృష్ణారెడ్డి తన సిబ్బందితో సోమవారం దాడులు నిర్వహించారు. 2. 25 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.