నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

తాగునీటి వసతి కల్పించండి 

యాదాద్రి, వెలుగు : ఆర్​అండ్​ఆర్​కాలనీలో త్వరగా తాగునీటి వసతి కల్పించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. బస్వాపురం రిజర్వాయర్​ నిర్మాణంతో మునిగిపోతున్న ఆర్ అండ్ ఆర్​కాలనీలో రూ.32 లక్షలతో తాగునీటి వసతి కల్పించే పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలో అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ ఇంజనీర్ కరుణాకరన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత 

సూర్యాపేట, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని పీసీసీ సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి అన్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి ఎంపికైన కబడ్డీ క్రీడాకారులకు టీ షర్ట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరని, చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.  

'చిందు' కళను అవమానించడం తగదు

యాదాద్రి, వెలుగు : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చిందు కళాకారులను అవమానించడం తగదని ఎస్సీ ఉపకులాల కన్వీనర్ పిల్లుట్ల భిక్షపతి అన్నారు. ఆదివారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ జనపదానికి మూలమైన చిందు యక్షగాన కళాకారుల వేషధారణను ప్రస్తావిస్తూ పూటకో వేషమంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యే అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులను కించపరిచే విధంగా మాట్లాడిన తీరును అందరూ ఖండించాలన్నారు. శాసనసభ రికార్డుల నుంచి ఆయన వ్యాఖ్యలను తొలగించాలని స్పీకర్​ను కలిసి కోరుతామని తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన మాటలను వెనక్కి తీసుకోవాలన్నారు.  

కంపెనీ అభివృద్ధి లో కార్మికులదే కీలక పాత్ర 

మఠంపల్లి, వెలుగు : నాగార్జున సిమెంట్ కంపెనీ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని ఆ కంపెనీ ఎండీ గౌతమ్ అన్నారు. ఆదివారం మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద ఉన్న కంపెనీ 41వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా 30 ఏండ్ల నుంచి కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు బహుమతులు అందజేశారు.
అదుపుతప్పి కారు బోల్తా

హుజూర్ నగర్, వెలుగు : అదుపుతప్పి కారు బోల్తా కొట్టిన ఘటన హుజూర్ నగర్ మండలం వేపాల సింగారం వద్ద ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మేళ్లచెరువు నుంచి హుజూర్ నగర్ వైపు వస్తున్న ఓ కారు బైకును తప్పించబోయి అదుపుతప్పి పల్టీకొడుతూ పొలంలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. 

నల్లబెల్లం పట్టివేత 

తుంగతుర్తి, వెలుగు :  అక్రమంగా వాహనంలో తరలిస్తున్న 30 వేల కిలోల నల్లబెల్లాన్ని టాస్క్​ఫోర్స్, ఎక్సైజ్​ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం తుంగతుర్తి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ఎక్సైజ్ సీఐ రజిత మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సంతోష్, సూర్యాపేట జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మానాయక్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు తిరుమలగిరి మండలం వెలిశాల ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు.

 ఈ తనిఖీల్లో లారీలో తరలిస్తున్న 30 వేల కిలోల కిలోల నల్లబెల్లం, 100 కిలోల పటిక, 20 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు. లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రధాన నిందితులు వినీత్, షైక్ ఫరూఖ్​ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.


ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి 

నాంపల్లి, వెలుగు : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన నాంపల్లి మండలం కేతపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మల్లేపల్లి మండలం కొత్తబావి గ్రామానికి చెందిన పిల్లి రామలింగం(28) దామెర గ్రామానికివెళ్లి తిరిగి బైక్ పై ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో కేతపల్లి గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్.. బైక్​ను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలై రామలింగం అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్ కు ఒకే లైట్ ఉండడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.