నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

స్వర్ణతాపడం కోసం రూ.లక్ష విరాళం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం హైదరాబాద్ కు చెందిన అగ్గనూరు శివరామకృష్ణగౌడ్– స్వప్న దంపతులు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. దాతలు విరాళానికి సంబంధించిన చెక్కును శనివారం ఆలయ ఈవో భాస్కర్ రావుకు అందజేశారు. మిర్యాలగూడకు చెందిన సైదిరెడ్డి నిత్యాన్నదానం కోసం 2 వేల కిలోల బియ్యాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చారు. అనంతరం దాతలు గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి అర్చకులు స్వాగతం పలికి స్వామివారి లడ్డూ ప్రసాదం 
అందజేశారు.

ఏపీజీవీబీ ఇక తెలంగాణ గ్రామీణ బ్యాంకు

చిట్యాల, వెలుగు : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఇక తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారనుందని ఏపీజీవీబీ చిట్యాల శాఖ మేనేజర్ అల్లాడ సుజిత తెలిపారు. శనివారం చిట్యాల బ్యాంకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు 2025 జనవరి 1 నుంచి ఏపీజీవీబీ తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారనున్నదని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలోని 493 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖలు, 9 రీజినల్ ఆఫీసులు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం కానున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో బ్యాంకు సేవలు నిలిచిపోతాయని, ఖాతాదారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. 

నేడు ఆర్యవైశ్య సంఘం కొత్త కమిటీ ప్రమాణస్వీకారం 

నల్గొండ అర్బన్, వెలుగు : ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నల్గొండలోని బండారు గార్డెన్స్ లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తేలుకుంట్ల చంద్రశేఖర్, లక్ష్మిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. శనివారం నల్గొండలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్యఅతిథులుగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ హాజరుకానున్నట్లు తెలిపారు.   

ఖైదీలకు ఉచిత న్యాయ సాయం అందిస్తాం

సూర్యాపేట, వెలుగు : సొంతంగా అడ్వకేట్​ను నియమించుకోలేని ఖైదీలకు ఉచిత న్యాయ సాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి శ్రీవాణి తెలిపారు. శనివారం సూర్యాపేట సబ్ జైలును జడ్జి తనిఖీ చేసి ఖైదీలతో మాట్లాడారు. ఒక వ్యక్తి జైలు జీవితం గడపడంతో అతడి కుటుంబాన్ని కూడా సమాజం చిన్నచూపు చూస్తుందన్నారు. ఒక వ్యక్తి నేరం చేశాడా.. లేదా..? అనేది న్యాయస్థానంలో రుజువు కాకపోయినప్పటికీ అతడి మనస్సాక్షికి తప్పకుండా తెలుస్తుందన్నారు.  

సెమీ క్రిస్మస్ వేడుకలు

సూర్యాపేట, వెలుగు : కల్లెక్టరేట్​లో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆద్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అడిషనల్ కలెక్టర్ రాంబాబు పాల్గొని కేక్ కట్ చేసి ఉద్యోగులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.  

మహాసభలను సక్సెస్ ​చేయాలి

చండూరు, వెలుగు : ఈనెల 28 నుంచి 30 వరకు నల్గొండలో జరిగే టీఎస్ యూటీఎఫ్ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ రామలింగయ్య పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని బోడంగపర్తి జిల్లా పరిషత్ స్కూల్​లో ఎంఈవో సుధాకర్ రెడ్డి, పుల్లెంలలో హెచ్​ఎం సరస్వతి, సంఘం నాయకులతో కలిసి మహాసభలకు సంబంధిత వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.