నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

కోదాడ, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవల సంఖ్య పెంచేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్​వో  డాక్టర్ కోట చలం సూచించారు. శుక్రవారం అనంతగిరి, త్రిపురవరం పీహెచ్​సీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్​వో మాట్లాడుతూ  వైద్యాధికారులు , సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు.

పీహెచ్ సీల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని సూచించారు. నడిగూడెం పీహెచ్​సీ,  కమ్యూనిటీ హెల్త్ సెంటర్​ను తనిఖీ చేశారు. వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అంబేద్కర్ ను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరు 

హుజూర్ నగర్, వెలుగు : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను విమర్శిస్తే దేశ ప్రజలు ఊరుకోరని మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు దగ్గుపాటి బాబూరావు అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమిత్ షాకు కేంద్రమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. తక్షణమే పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  

ఎమ్మెల్యే శంకర్​ను సస్పెండ్​ చేయాలి

యాదాద్రి, వెలుగు : షాద్​నగర్ ఎమ్మెల్యే శంకర్​ను సస్పెండ్ ​చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత డిమాండ్​ చేశారు. ఈ రేస్​లో ఎలాంటి అవినీతి జరగకున్నా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్​పై కేసు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. దీనిపై చర్చ జరగాలని బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో డిమాండ్​ చేస్తుంటే.. షాద్​నగర్​ ఎమ్మెల్యే చెప్పు విసరడం మంచి పరిణామం కాదన్నారు. ఆయన పదవీకాలం మొత్తం అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్​ను ఆమె కోరారు. ఈ సందర్భంగా గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. 

ప్రభుత్వ భూములను రక్షించాం 

మిర్యాలగూడ, వెలుగు : అద్దంకి –నార్కెట్ పల్లి హైవేపై చింతపల్లి జంక్షన్ పక్కన్నే ఉన్న సుమారు రూ.14.50  కోట్ల విలువైన 3.30 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించామని తహసీల్దార్ మిర్యాలగూడ హరిబాబు తెలిపారు. శుక్రవారం తహసీల్దార్​ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వే నంబర్ 626లోని భూమి ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కోట్ల విలువ ఉందని, భవిష్యత్​లో ప్రభుత్వ అవసరాలకు ఈ భూమి వినియోగించే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఫోకస్ పెట్టామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.  

యాక్సిడెంట్​లో స్టూడెంట్ మృతి 

నల్గొండ అర్బన్, వెలుగు : ఆగి ఉన్న టీవీఎస్ ఎక్సెల్ ను లారీ ఢీకొట్టడంతో స్టూడెంట్ మృతి చెందిన ఘటన నల్గొండలో  జరిగింది. టూ టౌన్ ఎస్ఐ నాగరాజు వివరాల ప్రకారం.. కట్టంగూరు మండలం నరసింహపురం గ్రామానికి చెందిన చిట్టిమల్ల గణేశ్(18) నల్గొండలోని నీలగిరి డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం గడియారం సెంటర్లో రోడ్డు పక్కన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై గణేశ్​ఆగివున్నాడు.

ఆ సమయంలో లారీ వచ్చి బలంగా టీవీఎస్​వాహనాన్ని ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ తెలిపారు.