నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే..డోంట్ మిస్

విహారయాత్రకు ఇమాంపేట కేజీవీబీ విద్యార్థులు, స్టాఫ్ 

సూర్యాపేట,వెలుగు : రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్​ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట మండలం ఇమాంపేట కేజీవిబీ విద్యార్థులు, ఉపాధ్యాయులు విజ్ఞాన, విహారయాత్రకు బయలుదేరారు. రామప్ప టెంపుల్, లక్కవరం, భద్రకాళీ ఆలయం, వేయి స్తంభాల గుడి ని  సందర్శిస్తారు. నాలుగు బస్సులను రాష్ట్ర టూరిజం శాఖ ఏర్పాటు చేసింది. యాత్రకు సహకరించిన పటేల్ రమేశ్​రెడ్డికి విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

పిల్లాయిపల్లి కాల్వ పనులకు రూ.86.22 కోట్లకు అనుమతి

యాదాద్రి, వెలుగు : మధ్యలోనే నిలిచిపోయిన పిల్లాయి పల్లి సాగు నీటి కాల్వల పనుల కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. నిధులు కొరతతో పనులు నిలిచిపోగా.. పూర్తి చేయాలంటే రూ.95.60 కోట్లు అవసరమని ఇరిగేషన్​ ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం పరిశీలించిన అనంతరం రూ. 86.22 కోట్లకు అనుమతులు జారీ చేసింది.

పేద విద్యార్థులకు ఆర్థికసాయం 

మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని 55 మంది పేద విద్యార్థులకు ఏహెచ్ఆర్ ఫౌండేషన్ బుధవారం ఆర్థిక సాయం అందించింది. అరుణోదయ, కేరళ స్కూల్స్ లోని 55 మంది పేద విద్యార్థుల ఫీజుల కింద రూ. 4. 20 లక్షల చెక్కును పేరెంట్స్ కు అందించింది. గత13 ఏండ్లుగా అందిస్తున్నామని, భవిష్యత్ లో కూడా కొనసాగిస్తామని ఫౌండేషన్  వ్యవస్థాపకులు అన్నపురెడ్డి అప్పిరెడ్డి, వెంకట్, కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.

రాగి జావ గిన్నె మీదపడి తీవ్రంగా గాయపడిన విద్యార్థి

  • మరో ముగ్గురికి స్వల్ప గాయాలు
  • సర్వేల్ గురుకులలో ఘటన  

చౌటుప్పల్ వెలుగు : రాగి జావను పొయ్యి మీద నుంచి దింపుతుండగా గిన్నె జారి మీద పడడంతో స్వరేల్ గురుకుల స్కూల్ లో నలుగురికి గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ బాలుర గురుకుల పాఠశాలలో సోమవారం ఉదయం విద్యార్థులకు టిఫిన్ గా రాగి జావను తయారు చేశారు. వంట చేసే సిబ్బంది తక్కువగా రావడంతో 8వ తరగతి విద్యార్థులు శామ్యూల్,మదన్, వంట మనిషి బోయ ఇందిరమ్మ, కాంట్రాక్టర్ కొడుకు అరవింద్ కలిసి రాగి జావను పొయ్యి మీద నుంచి దింపుతున్నారు.  

గిన్నె జారి శామ్యూల్ పై పడడంతో పాటు  మరో ముగ్గురిపై పడింది.  దీంతో శామ్యూల్ కు తీవ్రంగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి.  శామ్యూల్ కు హాస్టల్ లోనే ప్రథమ చికిత్స చేయించి అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించి పంపించారు. అతని తల్లిదండ్రులు హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో  చేర్పించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ తీరును తప్పుబడుతూ..బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

చారిత్రక కళా సంపదను పరిరక్షించాలి

హాలియా, వెలుగు : చారిత్రక కళా సంపదను పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.  బుధవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో బస్టాండ్ సమీపంలోని  శ్రీదేవి భూదేవి సమేత ఏలేశ్వర మాధవస్వామి ఆలయంలో కాకతీయుల కాలంనాటి శిల్పాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని వాటిని భద్ర పరిచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.  ఏలేశ్వర స్వామి ఆలయం వెనక 700 ఏండ్ల నాటి నంది, ఆలయ ద్వార శాఖలు, విడిభాగాలతో కూడిన కళా సంపద  పరిరక్షిస్తే భక్తులు, పర్యాటకులు తెలుసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.