నల్గోండ జిల్లాలో ఫటా ఫట్ వార్తాలు ఇవే.. డోంట్ మిస్

వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి 

నల్గొండ అర్బన్, వెలుగు : డిసెంబర్ 31 వేడుకలను జిల్లా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.  వేడుకలు నిర్వహించుకునే వారు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. మద్యం దుకాణాలు, వైన్ షాప్స్ రాత్రి 12 గంటల వరకు, బార్స్, రెస్టారెంట్స్ రాత్రి ఒంటి గంట వరకు ఓపెన్​ఉంటాయని తెలిపారు. 31 రాత్రి 10 గంటల నుంచి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని, మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మాదకద్రవ్యాలు సేవించే వారి పై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. 

పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి

సూర్యాపేట, వెలుగు : పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్ పిలుపునిచ్చారు. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేటలో గ్రీన్ వాక్  నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు, కరపత్రాలను పంపిణీ చేస్తూ గ్రీన్​వాక్​పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లు వాడొద్దన్నారు. 

ప్రతిఒక్కరూ తమ ఇంటి ముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడంతోపాటు మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యుడు కిరణ్ కుమార్, నాయకులు బొలిశెట్టి మధు, మారం పవిత్ర, వందనపు శ్రీదేవి, దేవరశెట్టి నాగరాజు, అనంతల సువర్ణ, యామా రజిని, దారం శ్రీనివాస్, గెల్లి అంజన్ ప్రసాద్, కక్కిరేణి రవిచంద్ర, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శివపార్వతుల కల్యాణం

మేళ్లచెరువు, వెలుగు : మేళ్లచెరువు శివాలయంలో ఆదివారం శివపార్వతుల మాస కల్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రాతఃకాలార్చనలు, అభిషేకం అనంతరం శివపార్వతులను శోభాయమానంగా అలంకరించారు. గణపతి పూజ, కన్యాదానం, జీలకర బెల్లం, తలంబ్రాల కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెనివేషన్ కమిటీ చైర్మన్ శంభిరెడ్డి, సభ్యుడు ఓరుగంటి నరసింహారావు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

చిట్యాల, వెలుగు : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేశ్​ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగేశ్​మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలన్నారు. మున్సిపల్ సిబ్బందిని పర్మినెంట్ చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.