ఖమ్మం జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

సాదా బైనామా ఉన్నా ఇందిరమ్మ ఇండ్లకు సహకరించాలి.

పాల్వంచ, వెలుగు: రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకున్నా సాదా బైనామా స్టాంపులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సహకరించాలని మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు కోరారు. పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాతను శనివారం ఆయన కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అన్ని అర్హతలు ఉన్నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకపోవటం మూలంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. సర్వే బృందాలను సాదా బైనామా డాక్యుమెంట్లను కూడా నమోదు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

అప్పుల బాధతో వ్యక్తి సూసైడ్

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెంలో అప్పుల బాధతో ఓ తాపీ మేస్త్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రామవరంలోని మేషన్ కాలనీకి చెందిన భూక్య రవి(35) తాపీ మేస్త్రి. పనులు దొరకట్లేదని ఇటీవల పాల వ్యాపారం మొదలు పెట్టాడు. అందులోనూ నష్టం రావడం, ఇతర ఖర్చుల కోసం అప్పులు చేశాడు.  ఈ క్రమంలో అప్పుల బాధలు భరించలేక శనివారం చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు.

బాలిక ఆత్మహత్యాయత్నం

ఆళ్ళపల్లి, వెలుగు: ఆళ్ళపల్లి మండలంలో పాతూరుకు చెందిన 14 ఏండ్ల బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నీళ్లలో పురుగు మందు కలిపి తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలిక ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

జనవరి 3న టీజేఎస్ ప్లీనరీ

కారేపల్లి, వెలుగు: రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీయించిందని, సీఎం రేవంత్ రెడ్డి నేతృతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నదని టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్‌రావు అన్నారు. శనివారం కారేపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 3న పాల్వంచలో టీజేఎస్ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం కార్యక్రమానికి హాజరుకానున్నట్లు వెల్లడించారు.

గ్యాస్ సిలిండర్లు సీజ్ 

అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట గుర్రాల చెరువు రోడ్డులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేశారని ఫిర్యాదు రావడంతో.. శనివారం సివిల్ సప్లై అధికారులు తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా 26 గ్యాస్ సిలిండర్ లతోపాటు మరో మూడు ఖాళీ సిలిండర్లను సీజ్ చేశారు.

నాటు సారా స్వాధీనం

మణుగూరు, వెలుగు: అశ్వాపురం మండలంలోని పిచ్చుకల తండాలో నాటు సారా స్థావరంపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, రెండు లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. తయారీదారుడు బాదావత్ కోటేశ్వరావును అరెస్టు చేశారు. అలాగే పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ లో నాటు సారా రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 లీటర్ల సారా, రెండు బైక్​లు స్వాధీనం చేసుకున్నట్లు మణుగూరు ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి తెలిపారు.

ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు మరో అవకాశం

కూసుమంచి, వెలుగు: ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల కోసం విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు కూసుమంచి హైస్కూల్ హెచ్ఎం వీరాస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కారణాలతో టెన్త్, ఇంటర్మీడియట్ మధ్యలో​ఆపేసిన వారు మళ్లీ చదువుకోవడానికి ఇదో మంచి అవకాశమన్నారు. డిసెంబర్ 30 వరకు అడ్మిషన్​ పొందవచ్చని వివరించారు. పదో తరగతి కోసం అభ్యర్థులు టీసీ, బర్త్, క్యాస్ట్, ఆధార్ సర్టిఫికెట్లు, పాస్ పోర్టు సైజ్ ఫొటోతో, ఇంటర్ చదువుకునేవారు టెన్త్​ మెమోతోపాటు మిగిలిన సర్టిఫికెట్ల తీసుకొని కూసుమంచి పాఠశాలకు రావాలని సూచించారు.