ఖమ్మం జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

మణుగూరు, వెలుగు: బైకును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఈ ఘటన అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామం వద్ద శనివారం జరిగింది. సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండల కేంద్రానికి చెందిన అలవాల సాయిరాం (25), ఇద్దరు చిన్నారులను తీసుకొని బైక్ పై అశ్వాపురం మండలం చింతిరియాల గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వస్తున్నాడు. అతడిని సీతారాంపురం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్డంతో అక్కడికక్కడే చనిపోయాడు. చిన్నారులు తపస్వి, మోక్షజ్ఞకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు108 అంబులెన్స్​ లో భద్రాచలం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

మున్సిపల్ వార్డు ఆఫీసర్ సూసైడ్

సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి మున్సిపాలిటీలోని 1వ వార్డు ఆఫీసర్ తోట గణేశ్ ​వ్యక్తిగత కారణాలతో ఇటీవల గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. వేంసూరు మండలానికి చెందిన గణేశ్​కు తల్లిదండ్రులు మృతిచెందగా అతడు ఒక్కడే సత్తుపల్లిలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గతనెల 30న గడ్డి మందు తాగగా హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. గణేశ్​ మృతి పట్ల ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రగమయి, మున్సిపల్ పాలకవర్గం, అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు: దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం–-ఆర్లగూడెం రహదారిలో శనివారం  సీఐ అశోక్, ఎస్సై గణేశ్​ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. కాగా ఓ కారులో వస్తున్న కొందరు యువకులు పోలీసులను చూసి కారు దిగి పారిపోయారు. కారులో పరిశీలించగా 40 కిలోల గంజాయి పట్టుబడింది. దీంతో పోలీసులు కారును, గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

పేకాటస్థావరంపై దాడులు

సత్తుపల్లి, వెలుగు : పేకాటస్థావరంపై సత్తుపల్లి పోలీసులు దాడి చేశారు.  సీఐ కిరణ్​ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామ శివారులో కొందరు పేకాట ఆడుతున్నట్లు పక్కా ఇన్ఫర్మేషన్​ రావడంతో సీఐ కిరణ్, ఎస్సై కవిత సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి రైడ్ చేశారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోగా, మరికొందరు పారిపోయారు. పట్టుబడినవారి నుంచి రూ.3.80 లక్షల నగదు, 8సెల్ ఫోన్లు,6 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకొని వారిపై శనివారం కేసు నమోదు చేశారు.

ప్రజలు కమ్యూనిజం వైపు చూస్తున్నరు..

ఇల్లెందు, వెలుగు : ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కమ్యూనిజం వైపు చూస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బి.వెంకట్ తెలిపారు. శనివారం ఇల్లెందులో సీపీఎం జిల్లా 3వ మహాసభలు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో కమ్యూనిస్టు సిద్ధాంతాలే శరణ్యమన్నారు. కేంద్రంలోని బీజేపీ ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఆదివాసి, దళిత సమస్యలపై ఉద్యమించాలని కోరారు.