వెంటాడుతున్న  ఫార్మా  అనర్థాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణాలో విపరీతంగా పెరుగుతున్న  పారిశ్రామిక కాలుష్యం స్థానిక వనరులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రపూరిత పరిణామంగా చూసింది ఆనాటి రాజకీయ దృక్పథం. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినాక ఈ జాడ్యం పోతుందని, ఫార్మా కాలుష్య భూతానికి పరిష్కారం లభిస్తుంది అని అంతా భావించారు.  ఇక్కడి  ఆకాంక్షలకు,  వనరులకు,  పరిస్థితులకు అనుగుణమైన పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన జరుగుతుంది అని ప్రజలు ఆశించారు. 

ఈ ఆశలకు విరుద్ధంగా ప్రత్యేక  తెలంగాణ పాలకులు వ్యవహరిస్తున్నారు. 2017 నాటికి అదనంగా 169 ఫార్మా కంపెనీలకు అనుమతి లభించటం,  ప్రస్తుతం ఉన్న కంపెనీలు ‘ఉత్పత్తి సామర్థ్య’ విస్తరణకు దరఖాస్తు చేయటం, అనుమతులు పొందటం, ఫార్మా సిటీ ప్రాంతానికి రూపకల్పన జరగడంతో తెలంగాణా ప్రజల ఆకాంక్షల మీద, ఆశల మీద ‘నీళ్ళు’ పోసినట్లే.  అత్యంత  భయంకరమైన కాలుష్యం ఎదుర్కొంటున్న గ్రామాలకు తోడు, ఇంకా అనేక తెలంగాణ గ్రామాలను కూడా ఈ ఫార్మా కంపెనీల అభివృద్ధి వల్ల ఏర్పడే ‘ఖర్మ’కాండలో విధిలేని పరిస్థితిలలోకి  నూకుతున్నారు.  2023లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కూడా ఇదే దారిన నడవడం శోచనీయం.

తెలంగాణ సహజ వనరులు కలుషితం అవ్వడం వలన  గ్రామీణ జీవనం తీవ్ర అనారోగ్యంపాలయ్యే పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు సృష్టిస్తున్నాయి. తెలంగాణాలో పారిశ్రామిక విధానం మూస ధోరణిలో,  విస్తృత  సంప్రదింపులు లేకుండా,  వనరుల మదింపు లేకుండా, అనుభవాలను పరిగణనలోకి తీసుకోకుండా పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరచడం,  వారికి సబ్సిడీలు ఇస్తూ వారి ప్రయోజనాలకు అనుగుణంగా తయారు చేయడం శోచనీయం.   సహజ  వనరులను  ధ్వంసం చేస్తున్న  పారిశ్రామిక అభివృద్ధి  తెలంగాణా ప్రజలను గోస పెడుతున్నది.  

అయినా, అధికార పార్టీలకు, రాజకీయవేత్తలకు, అధికారులకు పట్టింపు లేదు. ప్రోత్సాహకాలు, రాయితీలు, ఇంకా ఇతర  ‘బుజ్జగింపు’లతో  కూడిన  ప్రస్తుత తెలంగాణా  పారిశ్రామిక విధానం ‘రెడ్’  కేటగిరి  పరిశ్రమల ఏర్పాటుకు  రెడ్ కార్పెట్ పరుస్తున్నది.  విపరీతంగా సహజ వనరులను వాడుకుంటూ,  అత్యంత ప్రమాదకర కాలుష్యం చేసే పరిశ్రమలను ‘రెడ్’ కేటగిరి  పరిశ్రమలుగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పరిగణిస్తున్నది. 

భూగర్భ జలాలలో ఫార్మా రసాయనాలు 

తెలంగాణాలో  చేపట్టిన పారిశ్రామిక అనుమతులలో  సంస్కరణలు  కాలుష్య  నియంత్రణను, పరిశ్రమల  ఏర్పాటులో ఉండాల్సిన  జాగరూకతను గాలిలోకి  వదిలేశాయి.  సంస్కరణలు పాలనా నియంత్రణను వదిలేసి పారిశ్రామిక కాలుష్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ,  ప్రజలకు పర్యావరణానికి కీడు చేస్తున్నవి.

 గ్రామీణ జీవనోపాధులు మాయం అవుతున్నాయి.  ఒకప్పుడు, సెప్టెంబర్ 2007 నాటికి, హైదరాబాద్, -రంగారెడ్డి జిల్లాలలో  ఉన్న 1,177 కాలుష్య కారక పరిశ్రమలలో  దాదాపు 50 శాతం రెడ్  కేటగిరి,  అంటే అత్యంత  కాలుష్య కారక పరిశ్రమలుగా ఉన్నాయి.  అప్పటి  రాష్ట్రవ్యాప్త  కాలుష్య కారక పరిశ్రమలలో, దాదాపు 31 శాతం అత్యంత కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయి.  ప్రస్తుత పరిస్థితి  అధ్వానంగా ఉంది.   తెలంగాణా  అనేక విషయాలలో  ఇప్పటికే  అంతర్జాతీయ పటంలో ఉంది.

1992లోనే   పెరుగుతున్న  పారిశ్రామిక  కాలుష్యం వల్ల  ఎప్పుడో   ప్రపంచ పటానికి ఎక్కింది.  ఇక్కడి  ఫార్మా వ్యర్థజలాల వల్ల సూక్ష్మ జీవులు మందులకు నిరోధక శక్తి అభివృద్ధి చేసుకున్నాయని, మందులకు లొంగని విధంగా పరివర్తనం చెందినాయని పరిశోధనలు చెబుతున్నాయి.  భూగర్భ జలాలలో ఫార్మా రసాయనాలు పేరుకుపోతున్నాయని అంతర్జాతీయ అధ్యయనాలు ఏనాటి నుంచో  వెల్లడిస్తున్నాయి.

ప్రమాదకర రసాయనాలతో అనారోగ్యం

 పటాన్ చెరు, పోలేపల్లి,  దోతిగుడెం,  జిన్నారం, జీడిమెట్ల,  చౌటుప్పల్,  కొత్తూర్ వంటి  ప్రాంతాలలో ఫార్మా కంపెనీలు తమ ఫాక్టరీల ద్వారా  కాలుష్యాన్ని  వెదజల్లుతున్న  విషయం మనకు అనుభవమే.  అనేక గ్రామాల ప్రజలు మందుల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ నీరు, గాలి,  అత్యంత  ప్రమాదకర ఘన వ్యర్థాల  కాలుష్యంతో  సతమతమవుతున్నారు. దాదాపు 30 ఏండ్ల నుంచి  పటాన్ చెరు ప్రాంతంలో ప్రజలు ఎన్ని పోరాటాలు చేసినా,  రాష్ట్ర  కాలుష్య నియంత్రణ  బోర్డు తీసుకున్న చర్యలు నిరర్థకం.  ఫలితం శూన్యం.

 గత  పదేండ్లలో  ఏర్పాటు చేసిన  పరిశ్రమలు కూడా  విపరీతంగా  గ్రామ వనరులను కలుషితం చేస్తున్నా,  ప్రజలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా, ఫలితం కానరావడం లేదు.  ఆయా ప్రాంతాలలో స్థానికులు రకరకాల కాలుష్యాలతో, అత్యంత ప్రమాదకర రసాయన చర్యల బారిన పడి అనారోగ్యం పాలవుతూనే ఉన్నారు. అనారోగ్యంతో,  వైద్యానికి ఖర్చులతో, ఉన్న ఆస్తులు కరిగిపోయి బికారులవుతున్నారు. పరిశ్రమ వేసే పవర్ బోర్ల తోటి  స్థానిక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. 

ప్రజావ్యతిరేకతకు కారణం ఫార్మా కాలుష్యం

ఫార్మా పరిశ్రమలు ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా సబ్సిడీలు పొందుతూ, ప్రజల మీద పడుతున్న దుష్ప్రభావం గురించి పట్టించుకోవడం లేదు. అధికారులు, ఎన్నికైన ప్రతినిధులు ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచన చేయకుండా, కాలుష్య కారక పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు.  పర్యావరణ  వనరుల  కాలుష్యం వలన స్థానిక జీవనోపాధులు దెబ్బతింటున్నాయి.  ఉన్న  వ్యవసాయం కుంటుపడుతున్నది.

యువత ఉన్న ఉపాధి కోల్పోతున్నారు. అటు పరిశ్రమలలో ఉద్యోగాలు రాక, తమ బతుకు తాము జీవించే పరిస్థితి లేక, పారిశ్రామిక ప్రాంతాలలో గ్రామీణ ప్రజల నిత్య నరకం అనుభవిస్తున్నారు. వివిధ  గ్రామాలు ఎదుర్కుంటున్న అనారోగ్యకర పరిస్థితులను చూసి కొత్త ఫార్మా  ప్రతిపాదనలను రైతులు, ఇతరులు వ్యతిరేకిస్తున్నా  భూసేకరణ చేస్తున్నది ప్రభుత్వం. అధికార పార్టీ మారినాక కూడా ఇదే అదే దమననీతి కొనసాగుతున్నది.  

కొడంగల్, డప్పూర్ తదితర  ప్రాంతాలలో  ప్రజా వ్యతిరేకతకు కారణం  ఫార్మా కాలుష్యం. 2016లో  వచ్చిన ఫార్మా సిటీ  ప్రతిపాదనను అన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. ఫార్మా  క్లస్టర్లను కూడా వ్యతిరేకిస్తున్నారు. ఫార్మా వద్దు మొర్రో అని 30 ఏండ్ల నుంచి, 2024లో  కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మొత్తుకుంటుంటే ప్రజాభిప్రాయమే పరమావధిగా పని చేయాల్సిన తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం.  ఇటీవల ఒక ఫార్మా పరిశ్రమ యజమానికి రాజ్యసభలో సభ్యత్వం ఇవ్వడం అప్పటి అధికార పార్టీ ప్రజా వ్యతిరేక ఆలోచనలకూ నిదర్శనం. 

ప్రభుత్వం ప్రజలతో సంప్రదింపులు నిర్వహించాలి

ప్రస్తుతం ఉన్న ఫార్మా పరిశ్రమల వల్ల పర్యావరణానికి, సహజ వనరులకు, ప్రజలకు భారీగా నష్టం జరిగింది.  ఫార్మా సిటీ వల్ల, ఫార్మా విలేజ్​ల వల్ల కష్టనష్టాలు మరింత  పెరుగుతాయి. తెలంగాణాలో పరిశ్రమల అభివృద్ధి విషయంలో  ప్రభుత్వం ప్రజలతో  సంప్రదింపుల ప్రక్రియ విధిగా నిర్వహించాలి.  తెలంగాణాలో  కొత్తగా  ఫార్మా  పరిశ్రమల  ఏర్పాటు  ఆలోచన  పూర్తిగా  ప్రభుత్వం విరమించుకోవాలి.  అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణాలో ఫార్మా  పరిశ్రమల  ఏర్పాటు,  విస్తరణ,  కాలుష్యం వంటి  అంశాల మీద  నియంత్రణకు నడుం బిగించాలి.  

ఫార్మా కాలుష్యం  తగ్గించమని ముక్తకంఠంతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి.  తెలంగాణా ప్రభుత్వం ఫార్మా కాలుష్యం మీద పూర్తి స్థాయి సమీక్ష చెయ్యాలి.  శాసనసభలో చర్చించాలి. ఫార్మా పరిశ్రమ బాధితులను ఆదుకునేందుకు ప్రాథమికంగా రూ.1,500 కోట్ల నిధి ఏర్పాటు చేసి, ఆయా కుటుంబాల ఆరోగ్యం, జీవనోపాధుల పెంపుదలకు, స్థానిక సహజ వనరుల పరిరక్షణకు  వినియోగించాలి.  తెలంగాణా పారిశ్రామిక విధానంపై  సమీక్ష చేయాలి. ముసాయిదా ప్రతి ప్రజల ముందు పెట్టాలి. పారిశ్రామిక  కాలుష్య  నివారణ  చర్యలు  చేపట్టాలి. 

సమగ్ర నష్ట పరిహార ప్యాకేజీ  ప్రకటించాలి

వ్యవసాయం, గ్రామాలను,  ప్రజలను కాలుష్యం నుంచి సత్వరం  కాపాడాలి. భూగర్భ జలాలను కలుషితం చేస్తున్న పరిశ్రమలను యుద్ధ ప్రాతిపదికన గుర్తించి, క్రిమినల్ చర్యలు చేపట్టాలి. పారిశ్రామిక కాలుష్యం అరికట్టడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చెయ్యాలి.  నష్టపోయిన ప్రజలకు, రైతులకు సంపూర్ణ పరిహారం అందజెయ్యాలి. సమగ్ర నష్ట పరిహార ప్యాకేజీ  ప్రకటించాలి.  రాష్ట్ర ప్రభుత్వం అనుమతులలో పారదర్శకత పెంచాలి.  

ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి చెయ్యాలి.  పర్యావరణ అనుకూల, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణా రాష్ట్ర పారిశ్రామిక విధానం రూపకల్పన జరగాలి.  వ్యవసాయ  భూమి ఎట్టి పరిస్థితులలో పారిశ్రామిక, పట్టణీకరణ అవసరాలకు మార్చరాదు.  

కాలుష్య నియంత్రణలో పేరుకుపోయిన అవినీతి నిర్మూలించాలి.  పరిశ్రమలు ఉన్న పంచాయతీలకు  స్థానిక  ప్రకృతి  వనరులను  కాపాడుకోవడానికి  అధికారాలు పెంచాలి.  తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డులో  సాంకేతిక సామర్థ్యం పెంచాలి.  తెలంగాణా  సుస్థిర  అభివృద్ధి  నమూనా తయారు చేసి  ప్రజలతో సంప్రదింపుల ద్వారా ఆమోదించాలి. 

- డా. దొంతి నర్సింహారెడ్డి-