- వ్యతిరేకత నుంచి పార్టీని విజయతీరాలకు చేర్చిన నాయబ్ సింగ్ సైని
- మళ్లీ హర్యానా సీఎం ఆయనే!
- ఎన్నికలకు 200 రోజులముందే ముఖ్యమంత్రిగా చాన్స్
- తన పాలనతో మెప్పించిన సైనీ
- అన్నివర్గాల సంక్షేమం కోసం స్కీమ్స్..
- ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను తిప్పికొట్టిన లీడర్‌గా గుర్తింపు
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన బీజేపీ..ఇప్పుడు సీఎం ఎవరనే విషయంపై కసరత్తు ప్రారంభించింది. రేసులో పలువురు ఉన్నప్పటికీ..ప్రస్తుత సీఎం నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోనే హ్యాట్రిక్గవర్నమెంట్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలస్తున్నది. కాషాయ పార్టీ అధిష్టానం సైనీ వైపే మొగ్గుచూపినట్టు సమాచారం. రాష్ట్రంలో మళ్లీ విజయం సాధిస్తే సైనీ టాప్ పోస్ట్‌లోనే ఉంటారని ఎన్నికలకు ముందే బీజేపీ అధినాయకత్వం వెల్లడించింది. అయితే, కులకోణంలో సీఎం పదవిలో మార్పు చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. సైనీ ఓబీసీ వర్గానికి చెందిన నేత. హర్యానాలో జాట్వర్గానికి చెందిన నాయకులే టాప్ పోస్ట్‌లో ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎంగా సైనీనే కొనసాగించి.. జాటేతర ఓబీసీ లీడర్ సైనీని సీఎం చేయడం వల్లే తాము హ్యాట్రిక్విజయం సాధించామంటూ ఆయా వర్గాలకు మెసేజ్ పంపాలని బీజేపీ అధిష్టానం చూస్తున్నది. కాగా, హర్యానాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటడంపై సీఎం సైనీ సంతోషం వ్యక్తంచేశారు. కౌంటింగ్ ముగిసిన వెంటనే మీడియాతో మాట్లాడారు. ఇది రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత విజయమని చెప్పారు. ‘‘ మోదీ విధానాలపై విశ్వాసం ఉంచిన 2.8 కోట్ల మందికి కృతజ్ఞతలు. మోదీ ఆశీర్వాదంతోనే హ్యాట్రిక్ విజయం సాధించాం” అని పేర్కొన్నారు.
అనూహ్యంగా సీఎం సీటులోకి..
సైనీని అసెంబ్లీ ఎన్నికలకు 200 రోజుల ముందే సీఎంగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. అప్పటివరకూ సీఎంగా కొనసాగిన మనోహర్‌లాల్ ఖట్టర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించి, సైనీకి బాధ్యతలు అప్పగించింది. ఖట్టర్ మద్దతుతో ఉండడంతోనే సైనీని ఆ సీట్లో కూర్చోబెట్టారు. సైనీ తన పదవీకాలంలో వ్యాపారులు, యువత, వెనుకబడిన వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా పలు పథకాలను తీసుకొచ్చి, విజయవంతంగా అమలు చేశారని, ఖట్టర్ పాలనలో సర్కారుపై ఏర్పడ్డ అధికార వ్యతిరేకతను తన సంక్షేమ పాలనతో తిప్పికొట్టారని రాష్ట్ర బీజేపీ నాయకత్వం వెల్లడించింది. అగ్నివీర్ స్కీమ్ పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎదుర్కొనేలా.. అగ్నివీర్లకు ఉపాధి, ఆంత్రప్రెన్యూర్‌షిప్ అవకాశాల కోసం ‘అగ్నివీర్ పాలసీ–2024’ ను సైనీ తీసుకొచ్చారని చెప్పారు.