మార్కెట్ లోకి మక్కలు.. తగ్గుతున్న ధరలు

  • జిల్లాలో 47 వేల ఎకరాల్లో సాగు 
  • ప్రారంభంలో రూ.2900కు కొన్న ప్రైవేటు వ్యాపారులు 
  • పంట ఉత్పత్తులు వస్తున్న క్రమంలో ధర పతనం
  • పది రోజుల వ్యవధిలో  రూ.600 తగ్గుదల
  • ప్రభుత్వ మద్దతు ధర కేవలం రూ.2,225 

కోతల ప్రారంభంలో  వచ్చిన మక్కలను రూ.2900 ధరకు కొనుగోలు  చేసిన వ్యాపారులు ప్రస్తుతం మర్కెట్​లోకి ఎక్కువగా వస్తుండడంతో రూ.2300 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.2,225 మాత్రమే, బహిరంగ మార్కెట్​లో ఎక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో లాభాలు ఎక్కువ వస్తాయని రైతులు ఆశించారు. పది రోజుల వ్యవధిలో ధర తగ్గుముఖం పట్టడంతో రైతులకు బెంగ పట్టుకుంది. వ్యాపారులు సిండికేట్​ అయ్యి ధరలు తగ్గిస్తున్నారని లబోదిబోమంటున్నారు. 

కామారెడ్డి, వెలుగు: జిల్లాలోని గాంధారి, సదాశివనగర్​, తాడ్వాయి, భిక్కనూరు, కామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి,  రాజంపేట, రామారెడ్డి బిచ్​కుంద, పిట్లం మండలాల్లో మక్క 47 వేల ఎకరాల్లో సాగైంది.   మక్క పంట మార్కెట్లోకి రాగానే రేట్లు తగ్గాయి. పంట కోతకు ముందు ఉన్న ధర, తమ చేతికి వచ్చి తర్వాత ఉండడటంలేని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కామారెడ్డి జిల్లాలో పది రోజుల వ్యవధిలోనే  మక్కల ధర  క్వింటాల్​కు  రూ.600 తగ్గింది. ఇదే పరిస్థితి మిగతా జిల్లాలో కూడా ఉన్నట్లు తెలిసింది.

  కొద్ది రోజుల క్రితం  మార్కెట్లో రూ.2900కు పైగా పలికింది. ప్రస్తుతం వ్యాపారులు రూ.2,300 మాత్రమే చెల్లిస్తున్నారు.  కాగా మద్దతు ధర క్వింటాల్​కు రూ.2,225 ఉంది.  మద్దతు ధర కంటే  మార్కెట్లో  ఎక్కువగా వస్తుందని ఆశించిన రైతులకు నిరాశ ఎదురైంది.   ప్రస్తుతం మక్కలు వస్తుండగా,  వారంలో మరిన్ని ఉత్పత్తులు వస్తాయి. పంట ఉత్పత్తులు భారీగా మార్కెట్లోకి వస్తున్న క్రమంలో వ్యాపారులు ఉద్దేశపూర్వకగా రేట్లను తగ్గిస్తున్నారని  రైతులు చర్చించుకుంటున్నారు.   

పలు జిల్లాలలో మక్క పంటను ప్రధానంగా సాగు చేస్తారు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల,  మహబూబాబాద్, సిద్దిపేట తదితర జిల్లాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతుంది.  ప్రతికూల పరిస్థితులు, అడవి పందుల బెడద కారణంగా కొన్ని చోట్ల సాగు  తగ్గించారు.  మక్కలు ఎక్కువగా  కోళ్లదాణా, ఇతర ఆహార ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు.  రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యాపారులు నిల్వ చేసి, పంట ఉత్పత్తులను రైతులు  పూర్తిగా అమ్మిన తర్వాత ధరలు​ పెంచుతున్నారు. 

సిండికేట్​గా మారి

ప్రతీ సీజన్​లో పంట ఉత్పత్తులు రైతుల చేతికి వచ్చేటప్పుడు వ్యాపారులు సిండిరేట్​గా మారి రేట్లు  తగ్గిస్తున్నారు.   ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో క్వింటాల్​కు రూ.2,300 కొంటున్నారు.  పంట సాగు విస్తీర్ణం తక్కువగా ఉన్నా ధర​ తగ్గిస్తుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.  హమాలి, ట్రాన్స్ పోర్ట్ చార్జీలు తామే భరిస్తామంటూ రైతులను మభ్యపెట్టి ధర తగ్గిస్తున్నారు. 

ధర ఎక్కువగా ఉంటే రైతులకు లాభం

ఇప్పుడు మార్కెట్లో మక్కలు క్వింటాల్​కు రూ.2,300  కొంటున్నారు.  మొన్నటి దాక రూ.2,900 ఉండేది.   పంట కోసి  అమ్మే టైంలో  ధర​ తగ్గుతోంది.  మార్కెట్లో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగినట్లు  రైతులు పండించే పంటల ధరలు కూడా పెరిగితే మాకు కొంత లాభం వస్తుంది.  సాగుకు పెట్టే ఖర్చులు బాగా పెరిగాయి.  -  మహేందర్​రెడ్డి, రామేశ్వర్​పల్లి, భిక్కనూరు మండలం

తక్కువ ధరకు కొంటున్నారు

నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మక్క పంట సాగుచేశా.  విత్తనం వేసిన తర్వాత వానలు పడకపోవడంతో ఎకరం పంట పోయింది.  ఇంకో ఎకరం పంటను పందులు ధ్వంసం చేశాయి.  రెండు ఎకరాల్లో మాత్రమే మక్కలు చేతికి వచ్చాయి.   పది రోజుల కిందట క్వింటాల్​కు రూ.2,900 ధరకు కొంటామన్నారు.   అరబోసిన తర్వాత రూ.2,300 కొంటామంటున్నారు.  అప్పుడున్న ధర ఇప్పడు లేదని చెబుతున్నారు. – పిట్ల నారాయణ, నర్సన్నపల్లి, కామారెడ్డి మండలం