హరితహారం..లోపాలమయం

తెలంగాణాలో అటవీ విస్తీర్ణం 24% నుంచి 33%కి పెంచాలనే ఉద్దేశ్యంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్​ 2015  జులైలో తెలంగాణా హరితహారం ప్రాజెక్టు ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా హరితహారం లక్ష్యం 230 కోట్లు చెట్లను పెంచాలని సంకల్పం ప్రకటించారు. అసలు ప్రపంచంలోనే ఇంత భారీ చెట్లు నాటే కార్యక్రమం లేదు అని కూడా ప్రజలకు సమాచారం ఇచ్చారు. 

 గత 10 ఏండ్లలో తెలంగాణ హరితహారం వలన ఫలితాలు వచ్చాయని అంటున్నారు.  మానవ చరిత్రలో మూడవ అతిపెద్ద అడవుల పెంపకం కార్యక్రమంగా ప్రచారం చేశారు.   మొదలుపెట్టిన తరువాత 8 ఏండ్లలో రూ.8,511 కోట్లకు పైగా వ్యయంతో 243 కోట్ల మొక్కలు నాటినామని  నివేదికలు ఇచ్చారు.  హరితహారం ద్వారా రాష్ట్రంలోని 9.65 లక్షల ఎకరాల అటవీ ప్రాంతాల పునరుద్ధరణ సాధ్యమయ్యింది అన్నారు. 

632 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది అన్నారు.  హైదరాబాద్​లో 48.66 చదరపు కి.మీల పరిధిలో పచ్చదనం పెరిగింది అన్నారు. అయితే, ఇవన్నీ రుజువు చేసిన ఫలితాలు కావు. చెట్లు, పచ్చదనం పెరిగి ఉండవచ్చు కాని ఎంత శాతం అని కూడా అనుమానాలు ఉన్నాయి.  అక్కడక్కడ మొక్కలు నాటడం తప్పితే అది అడవుల విస్తీర్ణం పెంచే కార్యక్రమంగా ఎన్నడూ లేదు.

భా రీ వర్షాలు పడుతున్న క్రమంలో 30 జులై  2024న కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రధాన కారణాలు వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన, పర్యావరణ రక్షణ చేపట్టకపోవడం అని భావిస్తున్నారు.  భారీ చెట్ల స్థానంలో పీలగా ఉండే రబ్బర్ చెట్లు, టీ ప్లాంటేషన్ వల్ల వాలు ఉన్న కొండ ప్రాంతాలలో  నిర్మాణాలు, రోడ్ల పనులు, నిత్యం తిరిగే వాహనాల వల్ల వచ్చే ప్రకంపనలు మట్టిని వదులు చేస్తాయి.

 2010 నాటికి వయనాడ్ జిల్లాలో 75 శాతం ఉన్న అటవీ విస్తీర్ణం చాలా వేగంగా తగ్గిపోయింది. 2001 నుంచి 2023 వరకు వయనాడ్ 38,200 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లను కోల్పోయింది. 1950 – 2018 మధ్య వయనాడ్ అడవుల్లో 62% కనుమరుగు అయ్యి తోటల (ప్లాంటేషన్) విస్తీర్ణం సుమారు 1,800% పెరిగిందని  ఒక అధ్యయనం వెల్లడించింది. 2021 స్ప్రింగర్ అధ్యయనం ప్రకారం.. కేరళలో మొత్తం కొండచరియల ప్రమాదాలలో 59%  అడవిని తొలిచి వాటిస్థానంలో వచ్చిన తోటల ప్రాంతాలలో సంభవించాయి.. 

అడవుల విస్తీర్ణం తగ్గడంతోనే  వైపరీత్యాలు

అడవుల నరికివేత, అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల జరిగే అనేక విపత్పరిణామాలలో ఒకటి కొండ చరియలు జారి విరిగిపడడం. ఇదివరకు నిపుణులు హెచ్చరించినా కూడా భారతదేశంలో అడవుల విస్తీర్ణం, చెట్ల నరికివేత నిరాటంకంగా సాగుతున్నది.  దీనికి ప్రధాన కారణం అభివృద్ధి పేరు మీద ప్రకృతి పట్ల జరిగే అరాచకాలకు అడ్డు, అదుపు అంతులేకుండా కొనసాగడం. 

ఆశ్చర్యం ఏమిటంటే చెట్లను, ప్రకృతిని పూజించే ఈ దేశంలో చెట్లను పెంచండి అని సందేశం ఇచ్చే వ్యక్తులకు, రాజకీయ నాయకులకు కొదవ లేదు. ప్రతి సంవత్సరం వానాకాలంలో దేశమంతటా మొక్కలు నాటే కార్యక్రమాలు జరుగుతుంటాయి. నాయకులు, అధికారులు, ముఖ్యమంత్రులు, మంత్రులు అది ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి హాజరవుతుంటారు. ఆనక ఆఫీసుకుపోయి పచ్చదనానికి విఘాతం కల్గించే ప్రాజెక్టులకు, రోడ్ల వెడల్పు వగైరా ఫైళ్ళ మీద సంతకాలు పెడతారు. ఆశ్చర్యం ఏమిటంటే వారు ఇది వేరు అది వేరు అని భావించటం. 

తెలంగాణలో వేల కోట్ల పథకానికి ప్లానింగ్​ డాక్యుమెంట్​ లేదు

తెలంగాణలో హరితహారం మొదట్లో చెట్లు పెంచాలని లక్ష్యంతో మొదలై  క్రమంగా పచ్చదనం పెరిగింది అనే దశకు చేరింది. చెట్లు నాటడం, పెంచడం, రక్షించడం వగైరావివిధ దశల మీద నిరంతర నిఘా కానీ,  పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక ప్రధాన లోపం. 230 కోట్ల చెట్లు లక్ష్యం పెట్టుకుని దానికి తగ్గ నర్సరీల ప్రణాళిక చేయలేదు. తీరా లక్ష్యం ఒత్తిడి పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి 3 ఏండ్ల మొక్కలను దిగుమతి చేసుకోవడంతో ఉన్న నిధులు ఇక్కడనే ఖర్చు అయిపోయాయి. 

 వేల కోట్లు ఖర్చుపెట్టిన హరితహారం పథకానికి ఒక్క ప్రణాళికా డాక్యుమెంట్ లేదు. 230 కోట్ల చెట్లను నాటడానికి, పెంచడానికి అవసరమైన వనరులు, ప్రాథమిక అంచనాలు కూడా తయారుచేయలేదు. అన్ని కోట్ల చెట్లకు కావాల్సిన భూమి, నీరు, మొక్కలు, మానవ వనరులు, వగైరా అంశాల మీద రాష్ట్ర స్థాయి ప్రణాళిక చేయలేదు. హరితహారం పథకంపై శాసనసభలో ఏనాడూ చర్చించలేదు.

ఇతర అవసరాలకు అటవీ భూములు

 అటవీ భూములు ఇతర అవసరాలకు మళ్లింపు గత 10 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నది. కేవలం 2017 లోనే 14,747 ఎకరాల అటవీ భూమి దాదాపు 42 ప్రాజెక్టులకు మళ్ళించారు. పార్లమెంట్‌‌‌‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 2015-–18 మధ్య 20,314.12  అటవీ భూమి మళ్లిస్తే, అందులో 5,137.38 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపుతో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. 

ఇందులో ఎన్ని కోట్ల చెట్లు పోయినవో లెక్కలేదు. ఒక వైపు అటవీ భూమి బదలాయింపు ద్వారా భూమి వినియోగంలో మార్పు, ఇంకొకవైపు మొక్కలు నాటే కార్యక్రమం.  మొదటిది సఫల కార్యక్రమం. రెండవది విఫల కార్యక్రమం. ఒకవైపు అటవీ విస్తీర్ణం అని అధికార నివేదికలు, ఇంకొకవైపు కవ్వాల్ లాంటి రిజర్వ్ అడవిలో అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. 

హరితహారం.. వివిధ  రాష్ట్ర ప్రాజెక్టులకు తీసుకుంటున్న అటవీ భూముల నుంచి దృష్టి మరల్చడానికి,  పరిహారానికి, ప్రజలను మోసం చేయటానికి తప్పితే చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం, చెట్ల సంఖ్య పెంచడం కాదు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది.  ప్రభుత్వం మారింది.  హరితహారం పేరు వన మహోత్సవంగా మారింది. ఈ ప్రభుత్వం ఏమేరకు అడవులను పెంచే కార్యక్రమం చేస్తుందో వేచి చూడాలి.

హరితహారంపై అధ్యయనం అవసరం

తెలంగాణ హరితహారం దేశంలోనే అతిపెద్ద ప్లాంటేషన్ (తోటలు) డ్రైవ్ అని, చైనా,  బ్రెజిల్ తర్వాత ప్రపంచంలో మూడవది అని, లక్ష్యం పెట్టుకున్న 230 కోట్ల కంటే  తొమ్మిది కోట్లు ఎక్కువ నాటారని 2022లోనే  పత్రికల కథనాలు వచ్చాయి. 2024నాటికి ఆ సంఖ్యలో చెట్లు లేవు, అటవీ విస్తీర్ణం పెరగలేదు. నిధులు అయిపోయినాయి. ఈ అతి పెద్ద కార్యక్రమం అనుకున్న ఫలితాలు ఎందుకు ఇవ్వలేకపోయింది?మొత్తం హరితహారం పథకం మీద అధ్యయనం అవసరం ఉన్నది. ఇప్పటివరకు గమనించిన  విషయాల బట్టి మనకు అనేక కారణాలు కనపడతాయి. 

హరితహారంలో అంకెల తాపత్రయం

230 కోట్ల మొక్కలు నాటడమనే హరితహారం  ప్రణాళికను ఒక దీర్ఘకాలిక ఆలోచన లేకుండా ప్రకటించ డం వల్ల ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. అంకెల లక్ష్యాలు అందుకోవడానికి పడిన తాపత్రయం చెట్లు పెట్టడానికి ఉపయోగించలేదు. హరితహారం మొదలుపెట్టిన తరువాత ఏనాడూ చేస్తున్న పనుల మీద పారదర్శకంగా సమీక్ష చేయలేదు. లక్ష్యం అందుకోవాలని ఎక్కడపడితే అక్కడ చెట్లు నాటినా ఫలితాలు రాలేదు. 

ప్రజల భాగస్వామ్యంతో లక్ష్యం ప్రకటించి ఉంటే ప్రజలు కూడా పాల్గొనేవారు. లక్ష్య సాధనకు అవసరమైన నిధులు లేవు. దరిమిలా చాలాచోట్ల ఇవి మొక్కుబడి కార్యక్రమంగా మారింది.  అసలు తెలంగాణలో చాలా ప్రాంతాలలో మట్టి పొర తగ్గిపోయింది. మట్టి పొర పలుచన ఉన్న ప్రాంతాలలో తగిన పచ్చదనం పెంచే ఆలోచన చేయలేదు. నేరుగా చెట్ల కోసం మొక్కలు పెంచడం బహుశా అన్ని ప్రాంతాలలో ఉపయుక్తం కాదు. ఒకప్పటి కంచె మైదానాలలో చెట్లు నాటడం అంత సులువు కాదు.

- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​