కొలంబో: శ్రీలంక కొత్త ప్రధాన మంత్రిగా నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ) పార్టీ నేత హరిణి అమరసూర్య నియమితులయ్యారు. సిరిమావో బండారునాయకే (1994–2000) తర్వాత శ్రీలంక ప్రధాని పదవి చేపట్టిన మహిళగా ఆమె నిలిచారు. హక్కుల కార్యకర్త, యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన హరిణి చేత కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మంగళవారం ప్రమాణం చేయించారు.
అయితే, త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నందున ఆమె కేర్ టేకర్ ప్రధానిగా ఉండనున్నారు. కాగా, శ్రీలంక పార్లమెంట్ ను రద్దు చేస్తున్నట్టు మంగళవారం రాత్రి అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే గెజిట్ పై సంతకం చేశారు. పార్లమెంట్ ఎన్నికలను నవంబర్ 14న నిర్వహించనున్నట్టు ఆయన గెజిట్ లో ప్రకటించారు.