హనుమత్​ జయంతి 2024: ఆంజనేయస్వామి అన్ని లోకాలకు ఆదర్శం.. ఎలాగంటే...

ప్రస్తుత ప్రపంచంలో ఉన్న  స్థితిగతులలో మానవాళికి ఏకైక ఆదర్శం హనుమంతుడు. ధర్మసేవ చేయాలనుకొనేవారు హనుమంతుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి.  ధర్మం అనేది ఒకరు చెప్పటం, వేరొకరు నేర్చుకోవటం వలన వచ్చేది కాదు. ధర్మం ఆచరించడం మానవాళికి చాలా ముఖ్యమైనది. అలా ఆచరించటానికి ఒక మంచి ఆదర్శం కావాలి. అలాంటి స్వామే ఆంజనేయస్వామి..పురాణాల ప్రకారం ఆ స్వామిని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలో హనుమత్​ జయంతి సందర్భంగా తెలుసుకుందాం. . . . .

ధర్మరక్షణ కోసం రాముడు అవతరిస్తే ..అతనిరూపంలో ధర్మసేవకోసం హనుమంతుడు అవతరించాడు. అలా ఆంజనేయుడు చేసినది ధర్మసేవే...  ఆంజనేయుడు చిరంజీవి... ప్రస్తుతం కలియుగంలో హనుమంతుడిని ఆవాహన చేసుకుంటేనే ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం.. 

కలియుగంలో విదేశీయుల  వలన ధర్మం సంకట పరిస్థితి ఏర్పడింది .  ఈసయమంలో ధర్మాన్ని  రక్షించేందుకు ఛత్రపతి శివాజీ  హిందూసామ్రాజ్య పట్టభిషిక్తుడయినవాడు.  అతడి గురువయిన రామదాసే ఆ విజయానికి కారణం. రామదాసును ఆంజనేయుడి అవతారంగానే చెబుతారు.  హనుమంతుడినే సమాజంముందు ఆదర్శంగా నిల్పి వ్యాయామం, సాముగరిడీలు, యుధ్ధతంత్రాలూ, ఆయుధ ప్రయోగాలూ  శివాజీకి నేర్పించి   విజయాన్ని సాధించాడు. అలా కలియుగంలో ధర్మవిజయం హనుమదనుగ్రహంవల్లనే కొంతకాలం  వరకు ఉందని చరిత్ర చెప్తోంది.

త్రేతాయుగంలో రావణాదులను వధించి ధర్మాన్ని రక్షించటంకోసం శ్రీరాముడు అవతరించాడు. ఆ ధర్మకార్యం హనుమంతుడి సహకారంవల్లనే జరిగింది. ధర్మకార్యం కోసం మాత్రమే హనుమంతుడు రాముడితో ఉన్నాడు. రామసేవకుడయితే రాముడు పుట్టిననాటినుండీ ఆతనిసేవలో ఉండాలి. అలాకాక రాముడి ధర్మకార్యం ఆరంభమయినప్పటినుండి మాత్రమే హనుమంతుడు రాముడితో ఉన్నాడు. అందుకే రాముడికీ, ఆంజనేయుడికీ  కిష్కింధ కాండ దాకా పరిచయం  జరగలేదు. అలాగే ధర్మకార్యం పూర్తికాగానే హనుమంతుడు గంధమాదన పర్వతంపై తపోనిష్టుడై భక్తుల ననుగ్రహిస్తూ ఉన్నాడు తప్ప రామునితో రాజభోగాలలో గడపలేదు. అలా ధర్మంకోసం ఆ రామునకు  సహాయపడి త్రిలోకాలకు ఆదర్శంగా నిలిచాడు. అదే రామాంజనేయ యుద్ధగాధ.

 ధర్మంకంటె ఎవ్వరూ ఎక్కువ కారనే  ఆదర్శం హనుమంతుడిలో కనపడుతుంది. ధర్మకార్యంలో  అవసరం ఉన్నప్పుడల్లా రాముడికి తోడు నిలిచాడు. అలా త్రేతాయుగంలో ధర్మస్థాపనలో కీలకపాత్ర వహించినవాడు హనుమంతుడు. రామ రావణయుధ్ధమనే ధర్మయుధ్ధంలో విజయకారకుడు హనుమంతుడు.

ద్వాపరయుగంలో ధర్మాధర్మాలమధ్య జరిగిన యుధ్ధం కురుక్షేత్రసంగ్రామం. అందులోనూ ధర్మం విజయం సాధించింది.  ద్వాపరయుగ ధర్మవిజయంలో కూడా హనుమంతుడిదే కీలకపాత్రే.  త్రేతాయుగంలో ధర్మవిజయానికి ప్రత్యక్షంగా కారణం కాగా, ద్వాపరయుగంలో  ధర్మవిజయానికి పరోక్షంగా కారకుడయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామ విజయం భీమార్జునుల భుజస్కంధాలమీదే ఉంచబడింది. అటువంటి భీమార్జునులను ఇరువురికీ బలపరీక్షపెట్టి, ధర్మరక్షకులకు గర్వం తగదని బోధించి, అభయమిచ్చి, అండగా నిలిచి వారి విజయానికి పరోక్షంగా కారకుడయినవాడు హనుమంతుడు. విజయుడికి వరమిచ్చిన ప్రకారం... అమ్ములవారధిని అవలీలగా పడగొట్టి ... ఓటమి నంగీకరించి... అర్జునుడి రథంటెక్కెంమీద ఉండి ధర్మవిజయానికి కారకుడయ్యాడు హనుమంతుడు.  సౌగంధిక కుసుమాన్ని, పురుష మృగాన్ని తేవటంలో భీముడిని పరీక్షించి అనుగ్రహించి విజయవరం ఇచ్చినవాడు హనుమంతుడు.

కౌరవసేన కళ్లు  హనుమంతుని తేజఃప్రభలతో బైర్లు కమ్మి యుధ్ధం చేయటంలో అశక్తమయయింది. హనుమంతుడు టెక్కెంమీద ఉన్నందువల్లనే శత్రుపక్షపు భయంకర ఆగ్నేయాస్త్రాదులవల్ల రథం ధగ్ధం కాకుండా ఉందని శ్రీకృష్ణుడు  ... అర్జునిడికి వివరించాడు,   అలా ద్వాపరయుగంలోనూ ధర్మవిజయానికి కారకుడు హనుమంతుడు.

‘ధర్మ ఏవ హతో హన్తి’ అంటే ధర్మాన్ని దెబ్బతీస్తే అది మనలను దెబ్బతీస్తుంది. సరిగ్గా ప్రస్తుత  పరిస్థితి అదే.  సకలసద్గుణ గరిష్టుడు, సర్వశక్తి సముపేతుడు ... హనుమంతుడిని ఆదర్శంగా స్వీకరించనప్పుడే మానవజాతి ధర్మరక్షణలో కృతకృత్యమై, నేటి ఘోరవిపత్కర పరిస్థితులనుండి బయటపడుతుంది. ధర్మం ఎన్నివిధాల మానవులచే నాశనం చేయబడుతోందో అన్ని విధాలా మానవాళి వినాశం కొనితెచ్చుకొంటోంది. అనుక్షణం జరుగుతున్న దారుణాలను గూర్చి విచారిస్తున్నారే తప్ప దానికి నిజమైన కారణాలను గుర్తించటం లేదు. అందుకే కళ్ళముందున్న వినాశానికీ సరైన పరిష్కారం ఎవ్వరికీ కానరావటంలేదు. ధర్మరక్షణ జరిగిననాడే ఈవినాశంనుండి మానవాళి రక్షింపబడుతుందనేది సత్యం. అదొక్కటే పరిష్కారం.