కరీంనగర్‌‌లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

నెట్​వర్క్​, వెలుగు: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శనివారం ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాలు జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగాయి. వేములవాడకు అంజన్న స్వాములు భారీగా తరలిరావడంతో స్వామివారి దర్శనానికి 3 గంటలకుపైగా సమయం పట్టింది. ఆలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరుని చల్లని చూపులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు.  జగిత్యాల జంబి హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్సీ, నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆయన సతీమణి అహల్య దేవితో కలిసి పూజలు చేశారు. 

సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రి నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు. కోరుట్ల ఏకిన్​పూర్ ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం జరిపారు.  మెట్ పల్లి, జమ్మికుంట, ఇల్లందకుంట, చొప్పదండి మండల కేంద్రాల్లోని దేవాలయాల్లోనూ హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.