ఇవాళ నుంచి కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు

కొండగట్టు, వెలుగు:  ఏటా వైశాఖ బహుళ దశమి రోజున నిర్వహించే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల సందర్భంగా అధికారులు ఆలయానికి రంగులు వేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రుత్వికులు అంకురార్పణ చేసి ఉత్సవాలు ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో సుమారు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.  

ఉత్సవాల సందర్భంగా పార్కింగ్ స్థలం నుంచి గుట్టపైన వై జంక్షన్ వరకు నాలుగు ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం 28 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. దీక్షాపరుల మాలవిరమణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కేశఖండనానికి కోనేరు పక్కన స్థలం కేటాయించారు. ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో 650 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తారు. 

ఆరు మెడికల్ టీం లు, ఫైరింజన్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సహకారంతో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టనున్నట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు తెలిపారు. ఉత్సవాలు జరిగే మూడు రోజులపాటు గుట్టపైకి రోజుకు 10 లక్షల లీటర్ల చొప్పున నీటిని సప్లై చేస్తామని భగీరథ అధికారులు తెలిపారు. 

కొండగట్టులో చిడతల రామాయణం 

కొండగట్టులో చిడతల రామాయణాన్ని కళాకారులు ప్రదర్శించారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం ఎంకతల గ్రామానికి చెందిన కళాకారుల బృందం బుధవారం అంజన్న సన్నిధికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో చిడతల రామాయణం ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శనలో భాగంగా కళాకారుల నృత్యాలు, పాటలు కొండగట్టుకు వచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

ఉత్సవాలకు ప్రత్యేక అధికారులు 

కొండగట్టు అంజన్న ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు ప్రత్యేక అధికారులుగా కృష్ణారావు, వినోద్ రెడ్డి లను నియమించినట్లు రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వీరు బుధవారం కొండగట్టుకు చేరుకొని అంజన్న ఆలయంలోని ఏర్పాట్లను పరిశీలించారు.