హమాస్ చీఫ్ సిన్వార్ మృతి..డీఎన్ఏ టెస్టుతో గుర్తింపు

  • ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్ వెల్లడి
  • దక్షిణ గాజా స్ట్రిప్‌లో గురువారం తెల్లవారుజామున సైనిక ఆపరేషన్‌
  • ముగ్గురు టెర్రరిస్టులు హతం.. డీఎన్ఏ టెస్టుతో యహ్యా సిన్వార్‌ గుర్తింపు

జెరుసలెం: హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్‌(62) మృతి చెందాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్ కాట్జ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. దక్షిణ గాజా స్ట్రిప్‌లో గురువారం తెల్లవారుజామున సైనిక ఆపరేషన్‌ చేపట్టినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు గుర్తుతెలియని టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు చెప్పింది. 

డీఎన్ఏ టెస్టుల ఆధారంగా మృతుల్లో ఒకరు యహ్యా సిన్వార్‌ గా తేలినట్లు వివరించింది. తాము అటాక్ చేసిన బిల్డింగులో బందీలు ఎవరూ లేరని పేర్కొంది. దక్షిణ గాజా స్ట్రిప్‌లో పనిచేస్తున్న తమ బలగాలు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతున్నాయని.. దాడిని కొనసాగిస్తున్నాయని ఐడీఎఫ్ వెల్లడించింది. అయితే, యహ్యా  మరణాన్ని హమాస్ ఇంకా ధ్రువీకరించలేదు.

ఇజ్రాయెల్ పై 2023 అక్టోబర్ 7 నాటి ఉగ్రదాడికి  యహ్యానే ప్రధాన సూత్రధారి అని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నది. ఆ ఘటనలో హమాస్ మిలిటెంట్లు1200 మంది ఇజ్రా యెల్ పౌరులను దారుణంగా చంపేశారు. అప్పటి నుంచి సిన్వార్ ను తుదముట్టించాలని ఇజ్రాయెల్ ప్రయత్నించి చివరకు సఫలం అయ్యింది.