Halloween 2024: ప్రతి ఏడాది దెయ్యాల పండుగ.. ఎప్పుడు ఎందుకు చేసుకుంటారో తెలుసా..?

ఎప్పుడూ దేవుళ్ల కోసమే పండుగలు చేసుకోవాలా? దెయ్యాల కోసం ఎందుకు చేసుకోవద్దు? అవును.. వింతగా అనిపిస్తున్నా మీరూ దెయ్యాల కోసం ఓ పండుగ చేయొచ్చు. అదే 'హాలోవీన్ డే'. ఉత్తర అమెరికాలో ఎక్కువగా జరుపుకునే ఈ పండుగను... అన్ని దేశాల్లోనూ చేసుకోవడం ప్రారంభించారు. అక్టోబర్ 31 న 'హాలోవీన్ డే'. దెయ్యాల్లా కనిపించే డ్రెస్సులు వేసుకుని, విచిత్రమైన మేకప్ అందర్నీ ఆకట్టుకుంటారు. అలాగే ఇంట్లోని పెట్సూ వేడుకలో భాగం చేయొచ్చు. 

ఈ పండగ పుట్టింది ఐర్లాండ్లో. 1846లో ఏర్పడిన తీవ్రమైన కరువుకారణంగా ఉత్తర అమెరికాకు వలస వెళ్లిన ఐర్లాండ్ ప్రజలు ఈ సంప్రదాయాన్ని అక్కడ పరిచయం చేశారు. దీన్ని 'సాంహైన్ పండుగ' అని కూడా అంటారు. పంట కోతల కాలం ముగింపు సందర్భంగా నిర్వహించే వేడుక. మెల్లిగా ప్రపంచమంతా పాకింది. రోమన్ పాలనకు ముందు బ్రిటన్, స్పెయిన్, గాల్ ప్రాంతాలను ఆక్రమించిన యూరోపియన్లు కొత్త సంవత్సరంగా ఇలాంటి వేడుకను జరుపుకునేవారని చరిత్రకారులు చెప్తుంటారు. ప్రతి ఏడాది అక్టోబర్ 31న.. ప్రాణం ఉన్నవారికి, చనిపోయినవారికి మధ్య సరిహద్దులు తొలగిపోతాయని వాళ్ల నమ్మకం. పూర్వం హాలోవీన్ డే రోజున పశువులను బలి ఇచ్చి. వాటి ఎముకలను కాల్చేవారు.

ఏం చేస్తారు?

ఈ రోజున దెయ్యాలు, మంత్రగత్తెల్లా డ్రెస్సులు వేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. 'ఆల్ హలో ఈవెనింగ్' నుంచి ఈ హాలోవీన్ డే పేరు పుట్టిందంటారు. దీన్ని 'ఆల్ సెయింట్స్ డే' అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు యూఎస్ లో  మాత్రమే జరిగేది. ఈ రోజున పిల్లలు, యువత కొన్ని హారర్ సినిమాల్లోని భయానక పాత్రల వేషధారణల్లో కనిపిస్తారు. ఈ రోజున పిల్లలతో ఆడించే 'ట్రిక్ ఆర్ ట్రీట్' ఆట బాగా ఫేమస్. ఇందులో భాగంగా విచిత్ర వేషధారణలో ఉన్న పిల్లలు ఇంటింటికీ వెళ్లి చాక్లెట్లు, క్యాండీలను అడిగి తెచ్చుకుంటారు. అలాగే వేడుకలో పాల్గొనేవాళ్లు ఎక్కువగా నలుపు, నారింజ రంగు బట్టలనే ధరిస్తారు.

లాంతర్ల సంగతేంటి?

జాక్ లాంతర్ హాలోవీన్ అత్యంత ముఖ్యమైనది. గుమ్మడికాయలో ఏర్పాటు చేసి అలంకరిస్తారు. దాన్నే జాక్ ఒ లాంతర్ అంటారు. వ్యసనపరుడైన జాక్ అనే ముసలి రైతు.. తనని బాగా విసిగిస్తున్న దెయ్యాన్ని చెట్టు మీదకు ఎక్కించి శిలువగా మార్చేస్తాడు. దాంతో ఆ దెయ్యం జాక్ దగ్గరున్న లాంతర్ దీపంతోనే భూమిపై తిరగాలని శపిస్తుంది. ఆ సమయంలో జాక్ చేతిలో ముల్లంగితో తయారు చేసిన ఉంటుంది. అందుకే హాలోవీన్ డే రోజున ముల్లంగి లేదా గుమ్మడికాయలో లాంతరును అమర్చుతారు. వాటిని చీకటి పడ్డాక గుమ్మం ముందు పెడతారు.

V6 వెలుగు