జూనియర్​ కాలేజీల్లో.. వేధిస్తున్న లెక్చరర్ల కొరత

  • నాగర్​కర్నూల్​ జిల్లాలో సగం పోస్టులు ఖాళీ

నాగర్ కర్నూల్,​ వెలుగు: జూనియర్​ కాలేజీల్లో లెక్చరర్ల కొరతతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితి నెలకొంది. రెగ్యులర్​ లెక్చరర్​ పోస్టుల ఖాళీలు కొన్నేండ్లుగా భర్తీ చేయకపోవడంతో పాటు కాంట్రాక్ట్, గెస్ట్​ లెక్చర్లర్లు రాకపోవడంతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే స్టూడెంట్స్ కు​సిలబస్​ టెన్షన్​ మొదలైంది. కాలేజీలు తెరిచిన నెల తర్వాత  గెస్ట్​ లెక్చరర్లను కొనసాగించిన ఇంటర్  బోర్డ్.. ఆ తరువాత​రెన్యువల్​ చేయలేదు. 

ఆగస్టు​నెలలో డ్యూటీకి వెళ్లాలా? వద్దా? అర్థం కాక గెస్ట్ లెక్చరర్లు ఆయోమయంలో ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంటర్​ బోర్డు చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలాఉంటే గత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు నెలల జీతాలు ఇంకా పెండింగ్​లోనే ఉన్నాయి. గత ఏడాది పని చేసిన గెస్ట్​ లెక్చరర్లకు ఈ అకడమిక్​ ఇయర్​లో ఒక్క జులై నెలకు మాత్రమే రెన్యువల్​ ఆర్డర్స్​ ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

సగానికి పైగా ఖాళీలే..

నాగర్​కర్నూల్​ జిల్లాలో 20 మండలాలు ఉంటే.. 16 మండలాల్లో ప్రభుత్వ జూనియర్​ కాలేజీలు ఉన్నాయి. తెల్కపల్లి, ఉప్పునుంతల, పెంట్లవెల్లి, చారకొండ మండలాల్లో గవర్నమెంట్​ జూనియర్​​ కాలేజీలు లేవు. ఇందులో తెల్కపల్లి, ఉప్పునుంతల పెద్ద మండలాలు. ఈ మండలాలకు చెందిన స్టూడెంట్స్​ ఇంటర్​ చదవాలంటే పక్క మండలాలకు లేదా ప్రైవేట్​ కాలేజీలకు వెళ్లాల్సిందే.

పెద్ద కొత్తపల్లి మండలానికి కాలేజీ మంజూరైనా​స్టాఫ్​ను అలాట్​ చేయలేదు. కాలేజీలోని గ్రూప్​లు, స్టూడెంట్స్​ ఆధారంగా గెస్ట్​ లెక్చరర్​ పోస్టులు మంజూరవుతాయి. ఒక జూనియర్​ కాలేజీలో ప్రిన్సిపాల్​తో కలుపుకొని కనీసం12 మంది లెక్చరర్లు ఉండాలి. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా 8 మందికి మించి లేరు. కొన్ని కాలేజీలు నలుగురు, ఐదుగురితో నడుస్తున్నాయి. జిల్లాలోని గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీలకు 196  లెక్చరర్​ పోస్టులు మంజూరైతే, 98 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 93 మంది రెగ్యులర్, నలుగురు కాంట్రాక్ట్​ లెక్చరర్లు పని చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో 95 ఖాళీలకు గాను 73 మంది గెస్ట్​ లెక్చరర్లను నియమించిన ఇంటర్​ బోర్డ్..​ 22 పోస్టులను ఖాళీగా వదిలేసింది. 

సిలబస్​ పూర్తయ్యేదెలా?

ఇంటర్​లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో పాటు కామర్స్, హిస్టరీ స్టూడెంట్స్​కు కాలేజీలు స్టార్ట్​ అయ్యి రెండు నెలలు గడుస్తున్నా సిలబస్​ స్టార్ట్​​కాలేదు. దీంతో ఈ ప్రభావం రిజల్ట్​పై పడుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పేద విద్యార్థులు చదువుకునే ఇంటర్​ కాలేజీల్లో లెక్చరర్ల కొరత ఉండడం సరైంది కాదని నిపుణులు అంటున్నారు. కాలేజీలకు మంజూరైన పోస్టుల్లో సగం ఖాళీలు ఉంటే విద్యా ప్రమాణాలు, రిజల్ట్​ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. 

విద్యార్థులపై ప్రభావం..

గత సర్కారు జూనియర్​ కాలేజీల్లో​లెక్చరర్​ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్ట్, గెస్ట్​ లెకర్చర్లతో నడిపించే విధానానికి తెరలేపింది. గత విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని జూనియర్​ కాలేజీల్లో 1,658 గెస్ట్​ లెక్చరర్లు పని చేశారు. పదేండ్లుగా గెస్ట్​ లెక్చరర్లుగా పని చేస్తున్న వారిని రెన్యువల్​ చేయాల్సి ఉండగా, కాలేజీలు తెరిచిన రెండు నెలల తరువాత తిరిగి నియమిస్తూ వస్తున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన  అచ్చంపేట, కోడేరు, కొల్లాపూర్, కొండనాగుల, అమ్రాబాద్  జూనియర్ కాలేజీలు గెస్ట్​ లెక్చరర్లతోనే నడుస్తున్నాయి. ఇక కాలేజీల్లో సైన్స్​​ల్యాబ్స్, ప్రాక్టికల్స్, లైబ్రరీలు, ఓకేషనల్​ కోర్సులు మరిచిపోయే స్థితికి తెచ్చారు.

ప్రభుత్వానికి నివేదించాం..

సాధారణ బదిలీల తరువాత జిల్లాలోని​కాలేజీల్లో స్టాఫ్, స్టూడెంట్స్​ వివరాలను​ ప్రభుత్వానికి పంపించాం. విద్యార్థుల సంఖ్యను బట్టి గెస్ట్​ లెక్చరర్ల నియామకానికి బోర్డు అనుమతిస్తుంది. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం.

వెంకటరమణ, డీఐఈవో, నాగర్​కర్నూల్