వాడి వేడి చర్చ.. సభలో గరం గరం

  •  మేం సంపద సృష్టించినం.. తలసరి ఆదాయం పెంచినం: కేటీఆర్
  •  ఉద్యోగులకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్న
  •  మీ పాలన అద్భుతమే అయితే ఫస్ట్​కే జీతాలెందుకియ్యలే: భట్టి
  •  అబద్ధాలు చెప్పుట్ల కేటీఆర్​ దిట్ట.. బంగారు తెలంగాణ ఏడుంది?: సీతక్క
  •  ఫ్రీ జర్నీతో ఆడబిడ్డలు సంతోషిస్తుంటే బీఆర్​ఎస్​ అవమానిస్తున్నది: పొన్నం

హైదరాబాద్, వెలుగు: ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. బుధవారం సభ స్టార్ట్ కాగానే బిల్లును డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్యే కేటీఆర్ చర్చను స్టార్ట్ చేశారు. గత పదేండ్ల పాలన వల్ల అప్పులు, వడ్డీలు కడుతున్నట్లు ఎనిమిది నెలల నుంచి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తున్నారని.. సోషియో ఎకనమిక్ సర్వే మాత్రం అందుకు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. 

పదేండ్ల రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగిందని, తాము సంపద సృష్టించామని ఆయన చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నంప్రభాకర్, శ్రీధర్ బాబు ఖండించారు. ‘‘పదేండ్ల మీ పాలన అంత అద్భుతమే అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్​కే జీతాలు ఎందుకు ఇయ్యలేదు?” అని భట్టి  ప్రశ్నించారు.  పదేండ్లు ఉద్యోగాలు ఇస్తే ఉస్మానియా వర్సిటీకి వెళ్లడానికి మీరెందుకు వెనుకాడారని కేటీఆర్​ను సీతక్క ప్రశ్నించారు.  

జాబుల జాతర అబద్ధాల జాతరైంది: కేటీఆర్​

‘‘ఉద్యోగుల‌‌కు పంట రుణ‌‌మాఫీ చేయ‌‌డం లేదు. రైతు భ‌‌రోసాలో కూడా క‌‌టింగ్స్​ పెడ్తున్నట్లు వార్తలు వ‌‌స్తున్నాయి” అని కేటీఆర్​ అన్నారు. ఆడ‌‌బిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. దుబారా ఖ‌‌ర్చులు త‌‌గ్గించుకోవాలని, అన‌‌వ‌‌స‌‌ర‌‌ ఆర్భాటాలు త‌‌గ్గించుకోవాలని, ఆరు గ్యారంటీలు అమ‌‌లు చేయాలని డిమాండ్​ చేశారు. ‘‘ఎన్నిక‌‌లకు ముందు ర‌‌జినీకాంత్‌‌లు.. ఎన్నిక‌‌ల త‌‌ర్వాత గ‌‌జ‌‌నీకాంత్‌‌లు అయిపోయారు. 

నాలుగు కోట్ల మంది ప్రజ‌‌ల‌‌ను మ‌‌భ్య పెడుతున్నారు. ప్రజ‌‌ల త‌‌ర‌‌ఫున ఈ ప్రభుత్వాన్ని త‌‌ప్పకుండా నిల‌‌దీస్తాం. గత ప్రభుత్వం.. గ‌‌తం గ‌‌తం అంటూ ఎనిమిది నెలల నుంచి పురావ‌‌స్తు శాఖ త‌‌వ్విన‌‌ట్టు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తూనే ఉన్నారు” అని దుయ్యబట్టారు.

‘‘అసెంబ్లీ ఎన్నిక‌‌ల సంద‌‌ర్భంగా రాహుల్ గాంధీ అశోక్‌‌న‌‌గ‌‌ర్ వచ్చారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండ‌‌ర్ విడుద‌‌ల చేస్తామ‌‌న్నారు. ఏడాదిలోపే 2 ల‌‌క్షల ఉద్యోగాలు భ‌‌ర్తీ చేస్తామ‌‌ని ట్వీట్ చేశారు. నిజంగా రాహుల్ ట్వీట్, వీరి నిర్వాకం చూసిన త‌‌ర్వాత గోబెల్స్ బ‌‌తికి ఉంటే వీళ్ల ద‌‌గ్గర ట్యూష‌‌న్ నేర్చుంటా అంటుండె” అని కేటీఆర్​ విమర్శించారు. ‘‘30 వేల ఉద్యోగాలు ఇచ్చామ‌‌ని బ‌‌డ్జెట్‌‌లో చెప్పారు. ఆ ఉద్యోగాల నోటిఫికేషన్లు, పరీక్షలు మా హయాంలోనే జరిగాయి. 

ఇప్పుడు వీరు నియామ‌‌కప్రతాలిచ్చారు. ప్రజ‌‌ల‌‌ను, నిరుద్యోగ యువ‌‌త‌‌ను త‌‌ప్పుదోవ ప‌‌ట్టించి న మీ మీద చార్జ్​షీట్​ వేయాలి” అని దుయ్యబట్టారు. జాబుల జాత‌‌ర బ‌‌దులు అబ‌‌ద్ధాల జాత‌‌ర న‌‌డుస్తున్నదని విమర్శించారు. ఎన్నిక‌‌ల స‌‌మ‌‌యంలో అశోక్‌‌న‌‌గ‌‌ర్‌‌కు, ఓయూకి ప‌‌రుగులు పెడుతూ వెళ్లారని.. స‌‌భ వాయిదా వేయ‌‌గానే అశోక్​నగర్​కు డిప్యూటీ సీఎం భ‌‌ట్టి, అవ‌‌స‌‌ర‌‌మైతే సీఎంను కూడా తీసుకెళ్దామని, అక్కడ ఏ ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క ఉద్యోగం వ‌‌చ్చింద‌‌ని చెప్పి నా అక్కడే తాను రాజీనామా చేసి రాజ‌‌కీయ స‌‌న్యాసం తీసుకుంటానని కేటీఆర్​ చెప్పారు.  

అద్భుతమే అయితే టైమ్​కు జీతాలేవి?:  భట్టి

‘‘ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ పదేండ్ల వాళ్ల పాలన అద్భుతమంటున్నారు. రెవెన్యూ మిగులు ఉందంటున్నపుడు 2021 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు మొదటి తేదీన ఎందుకు ఇయ్యలేదు?” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రెవెన్యూ మిగులు ఉన్నప్పుడు నిధులు ఏం చేశారని ఆయన నిలదీశారు. కేటీఆర్ జోక్యం చేసుకుంటూ కరోనా వరకు కరెక్ట్ గానే జీతాలు ఇచ్చామని, ఆ తర్వాత లేట్ గా ఇచ్చామన్నారు. 

స్పీకర్​ చెప్పినా కేటీఆర్​ వినకపోవుడేంది?: శ్రీధర్ బాబు

ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి బుధవారం ఆఖరు అని, త్వరగా స్పీచ్​ పూర్తిచేయాలని కేటీఆర్​ను స్పీకర్ కోరినా వినకుండా అలాగే మాట్లాడటం ఏమిటని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఇట్లా ఆయన ఒక్కడే మాట్లాడుకుంటూ పోతే మిగతా పార్టీల ఎమ్మెల్యేలు ఎప్పుడు మాట్లాడాలని నిలదీశారు. ‘‘అంతా తానే మాట్లాడాలనుకోవటం కరెక్ట్ కాదు. అందరికీ అవకాశం ఇవ్వాలి. కౌన్సిల్ లో కూడా బిల్లు పాస్ కావాలి. కేటీఆర్ 4 సార్లు గెలిచారు.. ఆయనకు సభ సమయం గురించి తెలుసనుకుంట” అని ఆయన అన్నారు.  

అబద్ధాల్లో కేటీఆర్​ దిట్ట: సీతక్క

అబద్ధాలు అద్భుతంగా చెప్పడంలో కేటీఆర్ దిట్ట అని, పదేండ్లలో ఉద్యోగాలు ఇస్తే.. ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వెళ్లలేదని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ‘‘మీ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఆసరా పెన్షన్లు తీసుకున్నారు. సాగు చేసుకుంటున్న రైతులకు రైతు బంధు ఇవ్వకుండా మోసం చేశారు. ధరణిలో భూమి లేదని రైతు బంధు రాకుండా చేశారు. ప్రతిరోజూ ధనిక రాష్ట్రం.. బంగారు తెలంగాణ అంటే.. బయట ఉన్న మేం నిజమే అనుకున్నాం. 

కానీ ఎక్కడ?” అని నిలదీశారు. తమ మేనిఫెస్టోను చూసి.. గ్యాస్ సిలెండర్​ను రూ.440కే ఇస్తామని బీఆర్​ఎస్​ చెప్పిందని, ఇలా ఎన్నో పథకాలు పెంచి ప్రజలను మోసం చేద్దామనుకుందని మండిపడ్డారు. మాకు ఐదేండ్లు అవకాశం ఇచ్చారని, తప్పకుండా హామీలు అమలు చేస్తామని తెలిపారు. “మీరు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే గొప్ప.. మేం చేర్చుకుంటే తప్పా కేటీఆర్? కలిసివస్తానని మోసం చేసిన అక్కలతో జాగ్రత్తగా ఉండాలని సీఎం చెప్పారు. పార్టీ మారి మంత్రి అయిన సబితమ్మతో.. పార్టీ మారిన ఎమ్మెల్యేల  మీద ఇప్పుడు బీఆర్ ఎస్ ఫిర్యాదు చేయించటం ఎంత వరకు కరెక్ట్. మీరు 
మా ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా.. మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా?” అని నిలదీశారు.  

చేనేత కార్మికులను మేమే ఆదుకున్నం: పొన్నం 

సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో మంత్రులుగా తాను, శ్రీధర్ బాబు, విప్ ఆది శ్రీనివాస్​ చేనేత కార్మికుల పక్షాన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. ‘‘మేం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంత్యోదయ కార్డులు తీయలేదు. కానీ, 2014 కు ముందు సిరిసిల్లలో 12 వేల అంత్యోదయ కార్డులు ఉంటే.. తెలంగాణ వచ్చిన తర్వాత అంత్యోదయ కార్డులు ఎత్తేశారు. 

రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రం వచ్చిన తర్వాత, ఇప్పుడు కూడా  చేనేత కార్మికులకు ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 45 వేల పవర్ లూమ్స్  ఉంటే సిరిసిల్లలోనే 35 వేల పవర్ లుమ్స్ ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల చేనేత కార్మికుల బకాయిలను చెల్లించింది. వారికి అండగా ఉంది” అని ఆయన చెప్పారు. ఫ్రీ జర్నీ స్కీమ్ ను బీఆర్​ఎస్​ నేతలు అవమానిస్తున్నారని, బస్సుల్లో అవసరం లేకున్నా జర్నీ చేస్తున్నట్లు వాళ్ల టీమ్​ తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నదని పొన్నం మండిపడ్డారు. 

‘‘కావాలని కొన్ని వీడియోలు బీఆర్ ఎస్  పార్టీ సోషల్ మీడియా సృష్టిస్తున్నది. వాటిపై సమగ్ర విచారణ జరిపించాలి” అని అన్నారు. ‘‘ఆడబిడ్డలకు ఎంతో ఉపయోగపడే ఫ్రీ జర్నీ స్కీమ్ సక్సెస్ కావటంతో బీఆర్ ఎస్ పార్టీ ఓర్వలేకపోతున్నది. అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.