- బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని కామెంట్
- కేసీఆర్ అన్న కూతురు రమ్యారావుతో కలిసి ప్రచారం
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పిన సీఎం కేసీఆర్.. నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండలో కేసీఆర్ అన్న కూతురు రమ్యారావుతో కలిసి ఆయన ప్రచారం చేశారు. నల్గొండలో తనకు తానే పోటీ అన్నారు. నల్గొండలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని, ఏం అభివృద్ధి చేశారని మూడోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తన బిడ్డ కవితను రక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు మాత్రమే బాగుపడ్డారని, ప్రజలు మరింత పేదలుగా మారారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని, రేషన్ షాపులో మళ్లీ తొమ్మిది రకాల సరుకులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
‘‘సీఎం కేసీఆర్ తన అన్న కూతురు రమ్యారావునే ఓర్వలేకపోయారు. ఆమెను అనేక ఇబ్బందులకు గురిచేసి పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టారు. సొంత అన్న కూతురినే ఓర్వలేని వ్యక్తి ప్రజల గురించి ఏం ఆలోచిస్తాడు. నేను ఏ స్థాయిలో ఉన్నా నాకు రాజకీయ జన్మనిచ్చిన నల్లగొండ నియోజకవర్గాన్ని మర్చిపోను. నల్గొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా ప్రధాన ధ్యేయం” అని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. కాంగ్రెస్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యా రావు మాట్లాడుతూ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిఖార్సయిన నాయకుడని, ఆయన నియోజకవర్గ ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే వ్యక్తి అని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ఎవరూ ఊహించని మెజారిటీ ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలను ఆమె కోరారు. సీఎం కేసీఆర్ తో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. కేసీఆర్ తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, దాంతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరానని ఆమె తెలిపారు. పేదల సంక్షేమం గురించి ఆలోచించేది ఒక్క కాంగ్రెస్ పార్టీయే అని, ప్రజలంతా కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ వైస్‌చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.