సమాజ రుగ్మతల నివారణకు బుద్ధుడి బోధనలే శరణ్యం : గుత్తా సుఖేందర్ రెడ్డి

  • శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

హాలియా, వెలుగు : సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక రుగ్మతల నివారణకు గౌతమ బుద్ధుడి బోధనలే శరణ్యమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ బుద్ధవనంలో తెలంగాణ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ధమ్మ విజయం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధ చరిత వనంలోని బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామ్రాట్ అశోక చక్రవర్తి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకున్న రోజు అక్టోబర్ 14  కావడం గొప్ప విషయమన్నారు.

 ప్రపంచ దేశాల్లో బుద్ధుడి బోధనలు అత్యంత ప్రాచుర్యం పొందాయన్నారు. ప్రస్తుత సమాజంలో బుద్ధుడి పంచశీలను పాటిస్తే యుద్ధాలకు తావు ఉండదన్నారు. మానవ మనుగడకు బుద్ధిజం సన్మార్గం చూపిస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ బుద్ధవనం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా మారనుందన్నారు. 

బుద్ధవనం ఆసియాలోనే అరుదైన బౌద్ధ వారసత్వ థీమ్ పార్కుగా గుర్తింపు పొందనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, బుద్ధవనం ప్రత్యేకాధికారి ప్రకాశ్ రెడ్డి, బుద్ధవనం అధికారులు పాల్గొన్నారు.