సేకరించిన పాలు అమ్ముడుపోక.. విజయ డెయిరీపై భారం : అమిత్​రెడ్డి

  • పాల సేకరణ రోజుకు 4.40 లక్షల లీటర్లు
  • అమ్మకం 3.20 లక్షల లీటర్లు
  • బిల్లుల చెల్లింపులో వ్యత్యాసమే కారణం

నిజామాబాద్,  వెలుగు: విజయ డెయిరీ పాల సేకరణ, అమ్మకాలను సమతుల్యం చేయడానికి ప్రభుత్వం​ చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్​ గుత్తా అమిత్​రెడ్డి అన్నారు. అంగన్వాడీ సెంటర్లు, సర్కారు హాస్పిటళ్లు, ఆలయాలు, జైళ్లకు విజయ డెయిరీ పాలను అమ్మడానికి కారణం అదేనన్నారు. బుధవారం నగర శివారులోని విజయ డెయిరీని సందర్శించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతీరోజు విజయ డెయిరీ 4.40 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేయగా 3.20 లక్షల లీటర్లే అమ్ముడుపోతున్నట్టు తెలిపారు. 

ఈతేడా పాడి రైతుల బిల్లుల చెల్లింపులపై పడుతోందన్నారు. పరిస్థితి చేయిదాటకుండా ప్రభుత్వం నుంచి బిల్లుల​ చెల్లింపు కోసం రూ.50 కోట్లు తీసుకున్నామని, వీటికి మరో రూ.10 కోట్లు కలిసి బకాయిలన్నీ చెల్లిస్తామన్నారు.  మిగులు పాలను మిల్క్​పౌడర్, వెన్నగా మార్చడానికి చిత్తూరు జిల్లాకు పంపడంతో సంస్థపై ఆర్థిక భారం పడుతోందని, అయినా రైతులకు లాభసాటి ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో లీటర్​ పాలకు రూ.23 మాత్రమే ఇస్తున్నారని, తాము రూ.39 ఇస్తూ పాడి రైతులకు బాసటగా నిలిచామన్నారు. సంస్థను లాభాల బాటలో నడిచేలా  రైతులు ఆలోచనలు చేయాలన్నారు. 

పాల అమ్మకాలు పెరిగితే అన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. కల్తీ లేని విజయ మిల్క్​ సేల్స్​ పెరిగేలా ప్రచారం చేయాలని కోరారు.  విజయ డెయిరీ పాల వినియోగం జిల్లాలో  పది శాతమే ఉండడం ఆందోళన కలిగించే విషయమని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు అన్నారు. ముల్కనూరు​లో రైతులు సమాఖ్యగా ఏర్పడి మంచి ఫలితాలు సాధించిన  సంగతి గమనించాలన్నారు. 

స్వచ్ఛతకు మారుపేరైన విజయ మిల్క్​ అమ్మకాలు పెరగడానికి కావాల్సిన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి మాట్లాడుతూ.. సర్కారు ఆఫీసులలో విజయ మిల్క్​ ఉపయోగించే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్​ సభ్యుడు గడుగు గంగాధర్​, జిల్లా వెటర్నరీ ఆఫీసర్ జగన్నాథచారి, విజయ డెయిరీ సారంగాపూర్​యూనిట్​ఏడీ నాగేశ్వర్​రావు, పాడి రైతుల సంఘం నేతలు సురేశ్, తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.