Guru Purnima2024 :గురు పౌర్ణమి ఎప్పుడు..  జులై 20 నా..  21నా..  క్లారిటి ఇచ్చిన పండితులు 

తొలి ఏకాదశి తరువాత వచ్చే పండుగ గురు పౌర్ణమి... హిందూ గ్రంధాల ప్రకారం గురు పౌర్ణమి రోజున శ్రీ మహా విష్ణుమూర్తిని, లక్ష్మి దేవిని, చంద్రుడిని, శివుడితో పాటు గురువుని కూడా పూజించే సంప్రదాయం ఉంది. పౌర్ణమి రోజు స్నానం, దానధర్మాలు, పూజలకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మరికొన్ని రోజుల్లో గురు పౌర్ణమి రాబోతోంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది కూడా గురు పౌర్ణమి జరుపుకునే విషయంలో గందరగోళం నెలకొంది. ఈ రోజు పౌర్ణమి ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, చేయాల్సిన దానాల గురించి తెలుసుకుందాం..

హిందూ మతంలో ప్రతి తిధికి ఒకొక్క విశిష్ట సొంత ప్రాముఖ్యత ఉన్నట్లే పౌర్ణమికి కూడా సొంత ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున ఆషాఢ పూర్ణిమ, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి గా జరుపుకుంటారు.   గురు పూర్ణిమ రోజున ఉపవాసం ఉంటారు. నదీ స్నానమాచరించి దానాలు చేసి సత్యనారాయణుడిని పూజిస్తారు. పూర్ణిమ తిథి రోజున చంద్రోదయం జరిగే రోజున పూర్ణిమ ఉపవాసం పాటిస్తారు. పూర్ణిమ తిథి నాడు సూర్యోదయాన్ని దృష్టిలో ఉంచుకుని మర్నాడు నది స్నానం, దానం చేస్తారు. పౌర్ణమి రోజున ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని, చంద్రుడిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో ఐశ్వర్యం, కీర్తి, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తోంది


 
గురు పౌర్ణమి 2024 ఎప్పుడంటే..

హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తేదీ జూలై 20 శనివారం సాయంత్రం 5:59 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలోఈ పౌర్ణమి తిధి ఆదివారం జూలై 21 మధ్యాహ్నం 3:46 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో చాంద్రమానం ప్రకారం రూపొందిచిన  పంచాంగాన్ని పరిగణనలోకి తీసుకుని జూలై 21న గురు పౌర్ణమి జరుపుకోవాలని సూచిస్తున్నారు.

చంద్రోదయ సమయం ఎప్పుడంటే.....

 ఆషాడ పౌర్ణమి జులై 21న చంద్రోదయ సమయం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలని సిద్దాంతులు చెబుతున్నారు.  ఆ సమయంలో చంద్రునికి పాలను నైవేద్యంగా సమర్పించి.. నీటితో అర్ఘ్యం ఇవ్వాలి.  తరువాత చంద్రుని నమస్కరిస్తూ .. వేదమంత్రాలు పఠించాలి.  ఇష్టదైవాన్ని ప్రార్థించాలి.  

గురు పౌర్ణమి స్నానం, దానం..

ఈ సంవత్సరం గురు పౌర్ణమి వ్రతం జూలై 20న నిర్వహించుకోవాలి. అంటే చాలా మంది సత్యనారాయస్వామి వ్రతం గురు పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అటువంటి వారు కూడా జూలై 20 న జరుపుకోవాల్సి ఉంటుంది. జూలై 21 న స్నానం , దానధర్మాలకు అనుకూలమైనది. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో, ఉదయం 5.37 నుండి స్నానం చేసి శక్తి మేరకు దానం చేయాలి.  

సర్వార్థ సిద్ధి యోగం: ఇది జూలై 21 ఉదయం 5:37 నుంచి మర్నాడు అంటే జూలై 22 ఉదయం 12:14 వరకు ఉంటుంది. పూజకు అనుకూలమైన సమయం: జూలై 21 ఉదయం 7.19 నుండి మధ్యాహ్నం 12.27 వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.