రూ.450 కోట్ల కుంభకోణంలో.. క్రికెటర్లకు సీఐడీ సమన్లు.. లిస్టులో శుభ్మన్ గిల్

క్రికెట్ ప్రపంచంలో సంచలనం.. నలుగురు భారత క్రికెట్ ఆటగాళ్లకు సీఐడీ నోటీసులు పంపించింది. ఈ నోటీసులు ఇచ్చింది ఎవరో తెలుసా.. గుజరాత్ రాష్ట్రం సీఐడీ క్రైం బ్రాంచ్.. ఈ సమన్లు అందుకున్న వారిలో శుబ్ మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ ఉన్నారు. 450 కోట్ల రూపాయల స్కాంలో.. ఈ క్రికెటర్ల పాత్ర ఏంటీ.. సీఐడీ నోటీసుల్లో ఏముందో చూద్దాం...

ఇండియాలో పోంజీ స్కీమ్ నిర్వాహకుడిగా పేరుమోసిన వ్యక్తి భూపేంద్రసింగ్. ఇతనికి BZ ఫైనాన్షియల్ సరన్వీసెస్ అనేది కంపెనీ ఉంది. గుజరాత్ రాష్ట్రంలో 2020 నుంచి 2024 మధ్య కాలంలో.. జస్ట్ నాలుగేళ్లలోనే 17 ఆఫీసులు ఓపెన్ చేశాడు. లక్ష పెట్టుబడికి 3 లక్షల లాభం అంటూ ఆకర్షించాడు. ఏకంగా 11 వేల మంది నుంచి 450 కోట్లు వసూలు చేశాడు ఈ భూపేంద్రసింగ్. ఆ తర్వాత ఏముందీ.. కంపెనీలు ఎత్తేశాడు.. ప్రస్తుతం ఈ కేసులోనే ఈ నలుగురు క్రికెటర్లకు నోటీసులు పంపించారు గుజరాత్ సీఐడీ క్రైం బ్రాంచ్ పోలీసులు. 

పోంజీ స్కీం కాస్తా.. పోంజీ స్కాంగా మారిపోయింది. ఈ కేసులో కీలక వ్యక్తి భూపేంద్రసింగ్ ను విచారించిన తర్వాత.. నలుగురు క్రికెటర్లు పెట్టుబడి పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది.
శుభ్ మన్ గిల్ ఒక కోటి 95 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు
క్రికెటర్ మోహిత్ శర్మ  50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు
సాయి సుదర్శన్ 45 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం
రాహుల్ తెవాటియా కోటి రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది. 
శుభ్ మన్ గిల్ ఎంత పెట్టుబడి పెట్టింది వెల్లడించిన గుజరాత్ సీఐడీ వాళ్లు.. మిగతా క్రికెటర్ల పెట్టుబడి మొత్తాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

పోంజీ స్కాం పేరుతో.. BZ సర్వీసెస్ కింద వసూలు చేసిన 450 కోట్ల రూపాయలతో ఇళ్లు, స్థలాలు, భూములు భారీ ఎత్తున కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

ఈ స్కీంలో నలుగురు క్రికెటర్లు పెట్టుబడి పెట్టటం ద్వారా.. మిగతా వాళ్లను ఈజీగా ఆకర్షించినట్లు చెబుతున్నారు పోలీసులు. క్రికెటర్లు సైతం పెట్టుబడిగా పెట్టారంటూ వాళ్ల పేమెంట్ హిస్టరీ, వాళ్లకు వచ్చిన లాభాలు ఇవీ అంటూ  భారీ ఎత్తున ప్రచారం చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. దీంతో వేలాది మంది.. భూపేంద్రసింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టారని.. ఆ తర్వాత అందర్నీ ముంచేశాడని.. ఒక్క రూపాయి లాభం ఇవ్వకపోగా.. అసలు కూడా ఇవ్వలేదు అంటున్నారు పోలీసులు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న భూపేంద్ర సింగ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే నలుగురు క్రికెటర్లకు నోటీసులు పంపించారు గుజరాత్ సీఐడీ క్రైం బ్రాంచ్ పోలీసులు.

ప్రస్తుతం శుభ్ మన్ గిల్ ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నాడు. ఇండియా వచ్చిన వెంటనే విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.