King Food: వామ్మో .. రాజుకు  అంత ఆకలా.. రోజుకు 35 కిలోల అన్నం లాగించేవాడట..!

ఇప్పుడు పట్టుమని అరకేజీ  అన్నం తింటే  నడవలేని స్థితి.. ఇక ఆపసోపాలు పొట్ట బరువు.. అరగని పరిస్థితి. తిన్న కూడు జీర్ణం కావడానికి  మందులు మింగే రోజులివి.  కాని రాజ్యాలను పాలించే రాజుల కాలంలో .. రాజు తలుచుకుంటే.. దెబ్బలకు కొదవేముంది? అనే మాట మీరు వినే ఉంటారు. అలానే .. రాజు తలుచుకుంటే.. తిండికి కరువు ఉండదు.  అయితే ఓ రాజు రోజుకు 35 కిలోల తిండి తినేవాడట .. ఇంతకీ ఎవరా రాజు? ఏరాజ్యాన్ని పాలించాడు..  ఆ రాజు కథేంటో తెలుసుకుందాం. . . 

అనగనగా ఓ రాజు.. ఆ రాజు పేరు మహ్మద్​ షా.. ఆయన పాలించిన దేశం గుజరాత్​.. ఆ రాజు తిన్న తిండి తెలిస్తే ఔరా అనాల్సిందే.  రాజులు తినే ఆహారం.. గొప్పగా రుచికరంగా ఉండేది.  పూర్వ కాలంలో రాజులకు ఆహారం వండటానికి ప్రత్యేకంగా కొంతమంది ఉండేవారు. గుజరాత్ ను  పరిపాలించిన మహ్మదీయ రాజు మొదటి మహ్మద్ షా (ఈయనను మహమూద్ బేగడా అని కూడా పిలిచేవారు) తినే తిండి గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోవడం ఖాయం. అవును మరి.. ఆయన ప్రతిరోజూ ఏకంగా 35 కేజీల ఫుడ్ తినేవాడు. అంత ఫుడ్ ఎలా తినేవాడు? ఏం తినేవాడు...తెలుసుకోవాలనుందా? 

నిజంగా.. ఆ కాలం వాళ్లు తిన్న తిండి ఇప్పటి వారికి ఎక్కడ దొరుకుతది? ఒకవేళ దొరికినా వాళ్లు తిన్నట్టు ఈ కాలం వాళ్లు తినలేరు. అది వేరే విషయం. అందుకు ఈ రాజునే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ వంశంలో 53 సంవత్సరాల సుదీర్ఘకాలం జీవించిన రాజైన మొదటి మహ్మద్ షా ఆహార ప్రేమికుడు. ఎంతలా తినేవాడో.. అంతలా ఆరోగ్యాన్ని, శరీర సౌష్టవాన్ని కూడా కాపాడుకునేవాడు. తినే తిండికి తగ్గట్టు మనిషి కూడా బలంగా ఉండేవాడు. తిండి కలిగితె కండ కలదోయ్ అన్న టైప్ అన్నమాట. రోజుకు 35 కిలోల ఆహారాన్ని ఆయన అంత ఈజీగా తినడానికి కారణం.. ఆయనకున్న అతి ఆకలి.

ప్రతిరోజూ ఉదయాన్నే ఒక కప్పు తేనె, వెన్న కలిపి బ్రేక్​ ఫాస్ట్ తీసుకునేవాడు. ఆ తర్వాత బాగా పండిన 150  అరటిపండ్లు తినేవాడు. పర్షియన్, యూరోపియన్ యాత్రికులైన బెర్బోసా, వర్తేమా అనే ఇద్దరు వ్యక్తులు ఆయన ఆహారపు అలవాట్ల గురించి విని.. అసలేం తింటున్నాడో తెలుసుకుందామని ఎంక్వైరీ చేశారట. అప్పుడు తేలిందేమిటంటే... ప్రతిరోజూ 35 నుంచి 37 కిలోల అన్నం రకరకాల కూరలతో కలిపి తినేవాడు. అంతేకాదు అన్నం తినడం పూర్తయ్యాక నాలుగున్నర కేజీల పరమాన్నం లాగించేవాడు.

 ఇక సాయంత్రం  స్నాక్స్​ కు  రెండు పెద్ద పెద్ద బేసిన్ గిన్నెలలో మాంసంతో చేసిన సమోసాలు ఆయన కోసం సిద్ధం చేసేవారు. ఆయన పడుకునే మంచానికి రెండువైపులా ఆ రెండు బేసిన్లు ఉంచేవారు. రాత్రి ఎప్పుడు ఆకలిగా అనిపించినా లేచి తినడానికి ఆ ఏర్పాటు అన్నమాట. ఆయన ఆకలిని తీర్చుకునేందుకు వీలైనంత ఎక్కువగా మాంసం తినేవాడు. తన ఆకలి గురించి, పాలన గురించి నిత్యం మంత్రులతో, అనుచరులతో మాట్లాడుతూ 'అల్లాయే లేకపోతే నా ఆకలి ఎవరు తీర్చేవారు. ఈ రాజ్యాన్ని పాలించే అవకాశం నాకు ఎవరు ఇచ్చేవారు? ఇంతటి అవకాశం ఇచ్చాడు కాబట్టే.. నాకు ఇంత ఆకలి ఇచ్చాడు' అనేవాడట.

రాజుగారి రోజూవారీ ఆహారంలో భాగంగా కొద్దిమోతాదులో విషం కూడా తీసుకునేవాడట. ఎందుకంటే... ఆయన మీద ఒకసారి విషప్రయోగం జరిగిందట. ఆ ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డాడు. కానీ ఎప్పటికైనా డేంజరే అని అప్పటి నుంచి రోజూ కొద్దిమొత్తంలో విషం తీసుకోవడం మొదలుపెట్టాడు. రాజు విషం తీసుకోవడం మొదలు పెట్టినప్పటినుంచి ఆయన దుస్తులు ఎవరూ ముట్టుకునేవారు కాదు. ఆయన తినగా మిగిలిన ఆహారం కూడా గొయ్యి తవ్వి భూమిలో కప్పి పెట్టేవారు, ఆయన దుస్తులు కాల్చేసేవారు. ఇదంతా యూరోపియన్ చరిత్రకారులు నమోదుచేశారు.