హోమియోపతికి పెరుగుతున్న ఆదరణ

ఉష్ణం ఉష్ణేన శీతలం. ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి వంటి సామెతలను మనం తరచూ వింటూ ఉంటాం. కానీ, ఈ సామెతలను ప్రామాణీకరించి, దానికి చికిత్స ప్రక్రియకు అన్వయింపచేసి ఒక వ్యాధి దేనివలన వస్తుందో  దానికి విరుగుడు కూడా అదే అనే  సూత్రంపై హోమియో వైద్య విధానం పనిచేస్తోంది. రెండు దశాబ్దాల పరిశోధన అనంతరం..జర్మనీకి చెందిన శామ్యూల్ హనీమన్ ప్రపంచానికి హోమియో వైద్యాన్ని అందించారు. స్వతహాగా అల్లోపతి డాక్టర్ అయిన హనీమన్ ఆనాటి అల్లోపతి వైద్యంలో నెలకొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని, రోగికి మందుల దుష్ప్రభావాలు లేకుండా, స్వస్థత చేకూర్చడానికి తక్కువ ఖర్చుతోనే అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకు వచ్చిన వైద్య ప్రక్రియే హోమియోపతి. జర్మనీలో 1755 ఏప్రిల్‌ 10వ తేదీన జన్మించిన శామ్యూల్‌ హానిమన్ స్మృత్యర్థం ఏటా ఏప్రిల్‌ పదో తేదీన ప్రపంచవ్యాప్తంగా 'హోమియోపతి దినోత్సవం'గా జరుపుకుంటున్నారు. గ్రీకు భాషలో హోమియోపతి అనగా 'అదే విధమైన బాధ' అని అర్థం. శరీరానికి ఏ విధమైన బాధ ఉందో, అదే విధమైన బాధను శరీరంలోనికి మందుల ద్వారా చొప్పించడం వల్ల అసలు రుగ్మతను నిర్మూలించడం. అంటే ఒక పదార్థం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధకు విరుగుడు కూడా అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతి మూల సూత్రం. 

వ్యాధికి శాశ్వత పరిష్కారం 

అల్లోపతి వైద్యవిధానంలో వ్యాధి నుంచి సత్వర ఉపశమనం లభించగా హోమియోపతిలో శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అల్లోపతి వైద్యంలో రోగానికి వైద్యం చేస్తారు. ఈ వైద్యం ద్వారా సత్వర ఉపశమనం లభిస్తుంది. కానీ, శాశ్వత పరిష్కారం మాత్రం లభించదు. అల్లోపతి వైద్యంలో రోగాన్ని అణచివేసే యత్నం జరుగుతోంది తప్ప ఆ రోగానికి మూలమైన ఇతర అంశాలను తొలగించే ప్రయత్నం జరగదు. అదే హోమియోపతిలో వ్యక్తి మానసిక లక్షణాలను సైతం పరిగణనలోనికి తీసుకుంటారు. రోగం రావడానికిగల మూలాలను విశ్లేషించి ఔషధం ఇవ్వడం జరుగుతోంది. అల్లోపతి వైద్యంలో రోగ లక్షణాలను బట్టి మందులు రాస్తారు. హోమియోలో రోగి మనస్తత్వం, స్వభావం, అలవాట్లు, అనుభూతులు, రాగద్వేషాలు, జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలతో సహా అన్నీ పరిగణనలోకి తీసుకొని తగిన మందు నిర్ధారిస్తారు. హోమియో వైద్యులు రోగితో ఎక్కువ సమయం చర్చిస్తారు. ఈ సమయంలో రోగి బాధను వైద్యుడు ఆలకిస్తాడు. మనో ధైర్యాన్ని ఇస్తాడు. ఆ తరువాతే ఔషధం ఇస్తారు. ఇది రోగికి చాలా సంతృప్తి ఇస్తుంది. నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం లేనిదే ఏ ఔషధం కూడా పని చేయదు. 

దుష్ప్రభావాలు ఉండవు

మానవ శరీరంలో అత్యున్నత కేంద్ర వ్యవస్థ మెదడు. అందుచేత వైద్యం అనేది శరీరం నుంచి కాకుండా మనసు దగ్గర నుంచి ఆరంభించాలి అనేది హోమియో సిద్ధాంతం. హోమియోలో ఒక రోగానికి ఒక మందు అని కాకుండా రోగిని పూర్తిగా పరిశీలించిన తరువాత ఒకేవిధమైన సమస్యపై వెళ్లిన ఇద్దరు రోగులకు వేర్వేరు మందులు కూడా ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. శస్త్రచికిత్స ప్రక్రియ తప్ప మిగిలిన అన్ని సాధారణ శారీరక, మానసిక, దీర్ఘకాలిక రుగ్మతలకు అన్నింటికీ ఇతర వైద్య విధానాలలో లేని వెసులుబాట్లు హోమియో వైద్యంలో ఉన్నాయి. ఆధునిక అల్లోపతి వైద్యంలో ఒక జబ్బుకు ఒక మందు వేయడం వల్ల అది మరో స్థాయికి వెళ్లి మరో రుగ్మతకు కారణమవుతోంది. అయితే హోమియో వైద్యంలో దీనికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ మందులు ప్రకృతిలో దొరికే పదార్థాలతోటే తయారుచేస్తారు. హోమియో మందులు జన్యుస్థాయికి వెళ్లి శరీరానికి సహజంగా ఉండే వ్యాధి నిర్మూలన శక్తిని ఉద్దీపన చేస్తాయి. అక్కడ రోగ కారణాన్ని అంకురం నుంచి తొలగిస్తాయి. అంతేగాని అవి జబ్బును అణచవు. అందుకే హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు కలగవు. 

యూరప్​ దేశాల్లో హోమియోపతికి ఆదరణ

 విశిష్టమైన హోమియోపతి వైద్య విధానం పట్ల మొదట్లో ప్రజలకు నమ్మకం కలుగలేదు. క్రమేపీ ప్రజలు విశ్వసించడంతో ప్రభుత్వాలూ ఈ విధానాన్ని గుర్తించాయి. నేడు ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రత్యామ్నాయంగా హోమియో వైద్యం అందుబాటులో ఉంది. అన్నింటికంటే యూరప్ దేశాల్లో హోమియో వాడకం ఎక్కువగా ఉండగా అందులో ఫ్రాన్స్​ది మొదటిస్థానం. అదేవిధంగా జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, రష్యా, మెక్సికో దేశాలు కూడా హోమియో మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. భారత్‌లో హోమియో వైద్య విధానంలో 180 వైద్య కళాశాలలు, 40 పీజీ వైద్య కళాశాలలు ఉన్నాయి.  మూడు లక్షల మందికి పైగా శిక్షణ పొందిన వైద్యులు సేవలందిస్తున్నారు. 

రుద్రరాజు శ్రీనివాసరాజు