కరీంనగర్, వెలుగు: జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ వెలిచాల జగపతి రావుపై గ్రూప్ 2లో రెండు ప్రశ్నలు వచ్చాయి. నాలుగో పేపర్ లో ఎవరి ఆధ్వర్యంలో ‘తెలంగాణ శాసన సభ్యుల ఫోరం ఏర్పడింది’ అనే ప్రశ్న అడిగారు. తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో 1992లో వెలిచాల జగపతిరావు కన్వీనర్ గా, జానారెడ్డి చైర్మన్‌గా తెలంగాణ శాసన సభ్యుల ఫోరాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలకు చెందిన 92 మంది ఎమ్మెల్యేల సంతకాలతో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుకు వినపతిపత్రం సమర్పించారు.
అలాగే మరో ప్రశ్నలో ‘వెలిచాల జగపతి రావుకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిగణించండి.’ అని ఇచ్చారు. 1989 లో ఆయన కరీంనగర్ లో తెలంగాణపై మూడు రోజుల సదస్సు నిర్వహించడం, దుశర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన జల సాధన సమితి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం ఆయనకు సంబంధించి వ్యాఖ్యల్లో సరైనవని ఆయన కుమారుడు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు వెల్లడించారు. 1989లో తెలంగాణ ఆవశ్యకతపై మూడు రోజుల సదస్సు నిర్వహించి మలిదశ ఉద్యమానికి తన తండ్రి అంకురార్పణ చేశారని గుర్తుచేసుకున్నారు. గ్రూప్ 2లో ప్రశ్నలు ఇవ్వడం ద్వారా తన తండ్రి త్యాగాన్ని, ఆయన పోరాట చరిత్రను ఈ తరానికి తెలియజేసినందుకు టీజీపీఎస్సీ బాధ్యులకు రాజేందర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.