లెటర్​ టు ఎడిటర్​: గ్రూప్-2, 3 పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలి

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు దశాబ్దకాలం తర్వాత వచ్చిన నోటిఫికేషన్​లు గ్రూప్-2, గ్రూప్-3.  రెండు ఏండ్ల క్రితం వచ్చిన నోటిఫికేషన్​లో ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో అవే ఖాళీలకు పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలూ, వాయిదాల తర్వాత ఎంతో ఆలస్యంగా జరుగుతున్న పరీక్షలకు లక్షలాది మంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు Tspsc బోర్డు ప్రక్షాళన కోసం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీసీసీ అధ్యక్షుల హోదాలో పాల్గొన్న రేవంత్ రెడ్డి  మా ప్రభుత్వం వస్తే పోస్టులు పెంచుతాం అని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు గ్రూప్-2,  గ్రూప్-3 నోటిఫికేషన్లలో అదనంగా ఖాళీలు కలిపి పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులం  ప్రభుత్వాన్ని కోరుతున్నాం.  

ఏటా  రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టి స్వయంగా రేవంత్ రెడ్డి పదే పదే ప్రచారంలో చెప్పడంతో గత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నిరుద్యోగ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారి సొంత పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగానే కష్టపడ్డారు. ఈ విషయం ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావించారు. డీఎస్సీ విషయంలో చెప్పినట్లుగా ఖాళీలను పెంచిన రేవంత్ రెడ్డి సర్కారు గ్రూప్-2, గ్రూప్-3లో ఖాళీలు పెంచుతారని నిరుద్యోగులంతా ఎదురుచూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఐదు నెలలు కావస్తోంది. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలంటే ప్రభుత్వానికి ఇంకో ఏడు నెలలు మాత్రమే సమయం ఉన్నది.  ప్రభుత్వం పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా  డీఎస్సీ నోటిఫికేషన్​లో కలపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 

- మఠం శివానంద స్వామి,నిరుద్యోగ చైతన్యయాత్ర ఇంచార్జి