నిమిషం ఆలస్యం.. కన్నీటి పర్యంతం

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాల్లోని 46 సెంటర్లలో గ్రూప్–1 మెయిన్స్ ​ఎగ్జామ్స్ ​మొదలయ్యాయి. మొదటిరోజు 31,403 మందికిగానూ 22,750 మంది ఎగ్జామ్​కు హాజరయ్యారు. మధ్యాహ్నం 1.30 తర్వాత వచ్చిన వారిని అధికారులు సెంటర్లలోకి అనుమతించలేదు. పలువురు మహిళా అభ్యర్థులు అధికారులను బతిమాలుతూ లోపలికి పంపించాలని వేడుకున్నారు. చివరికి చేసేదేమీ లేక కన్నీటి పర్యంతమవుతూ వెనుదిరిగారు.

 కోఠి వివేకవర్ధిని కాలేజీలోని సెంటర్​కు ఆలస్యంగా వచ్చిన గజ్వేల్ కు చెందిన అనిరుధ్​రెడ్డిని, కీసర గీతాంజలి ఇంజినీరింగ్ కాలేజీలో లేటుగా వచ్చిన ముగ్గురిని అధికారులు లోపలికి పంపించడానికి ఒప్పుకోలేదు. కేజీ రెడ్డి ఇంజినీరింగ్​కాలేజీకి ఎం.వినోద్, ఘట్​కేసర్ ​సంస్కృతి కాలేజీకి ఆలస్యంగా వచ్చిన బోరబండకు చెందిన గారిడి రాహుల్​ను అనుమతించలేదు. లేటుగా వచ్చిన సిటీకి చెందిన మ్యాథ్యూస్​ను సికింద్రాబాద్ ​పీజీ కాలేజీ సెంటర్​లోకి అనుమతించలేదు.

 ఎంత బతిమలాడినా పంపించలేదని గోడ దూకి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పీఎస్​కు తరలించారు. సాయంత్రం వదిలేశారు. ట్రాఫిక్​ కారణంగా లేట్​అవడంతో నిజామాబాద్​ జిల్లా మోర్తాడ్​కు చెందిన కొమన్​పల్లి వినీత్, గూగుల్​ మ్యాప్ ​తప్పు చూపించడంతో హయత్​నగర్​కు చెందిన అఖిల ఇన్​టైంలో ఇబ్రహీంపట్నంలోని గురునానక్​కాలేజీకి చేరుకోలేకపోయారు. ఎగ్జామ్​రాసే అవకాశం కోల్పోయారు. ఇలా దాదాపు 15 మంది ఒక నిమిషం నిబంధన కారణంగా ఎగ్జామ్ ​రాయలేకపోయినట్లు తెలిసింది.– వెలుగు, హైదరాబాద్ సిటీ/ ఇబ్రహీంపట్నం/మేడ్చల్/సికింద్రాబాద్

పోలీసుల సాయంతో  పరీక్ష కేంద్రానికి..

టైం అయిపోతుంది.. ఎగ్జామ్ ​సెంటర్​కు వెళ్లలేకపోయేలా ఉన్నామే అని భావిస్తున్న కొంతమందికి పోలీసులు ఆపద్భాంధవులయ్యారు. కీసర ట్రాఫిక్ ​ఇన్​స్పెక్టర్ ​వెంకటయ్య ఓ అభ్యర్థిని పెట్రోలింగ్​ కారులో గీతాంజలి కాలేజీకి చివరి నిమిషంలో తీసుకొచ్చారు. దీంతో ఆ అభ్యర్థి ఎగ్జామ్ ​సెంటర్​కు సమయానికి చేరుకోగలిగారు. అలాగే ఇబ్రహీంపట్నం గురునానాక్​ కాలేజీలో కాలికి గాయమైన శెట్టి అంకిత అనే మహిళా అభ్యర్థికి బందోబస్తులో ఉన్న పోలీసులు సాయం చేశారు. 

ఆమెను కుర్చీలో కూర్చొబెట్టి మూడో అంతస్తులో ఎగ్జామ్​రాసే గదికి మోసుకెళ్లారు. దుండిగల్ పీఎస్​ పరిధి ‌ఎమ్ఎల్ ఆర్ఐటీ కాలేజీకి పొరపాటున వచ్చిన అభ్యర్థిని మేడ్చల్ ఏసీపీ ఆదేశాలతో కరెక్ట్​ పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లి వదిలేశారు.