ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువులు నిండలే

  • ఉమ్మడి జిల్లాలో  మొత్తం చెరువులు 2511
  • ఈ వర్షాకాలంలో  75 నుంచి 100 శాతం మేర నీళ్లు వచ్చినవి 572
  • కామారెడ్డి జిల్లాలో స్వల్పంగా పెరిగిన భూగర్భజలాలు

కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంకా సగం చెరువులు కూడా  నిండలేదు.  వానాకాలం సీజన్​ వచ్చి 2 నెలలు కావొస్తున్న  చెరువుల్లో మాత్రం నీరు రాలేదు.   ఉమ్మడి జిల్లాలో  కుంటలు, చెరువులు కలిపి మొత్తం 2,511 ఉన్నాయి. ఇందులో  572 చెరువుల్లోకి  75 శాతం నుంచి 100 శాతం మేర నీళ్లు చేరాయి.  కొన్ని చెరువులు మాత్రమే అలుగుపారాయి.   సీజన్​ ఆరంభం నుంచి స్థానికంగా భారీ వర్షాలు లేక చెరువుల్లోకి నీళ్లు రావట్లేదు.  సీజన్​ ప్రారంభమై  నెల రోజులు దాటినా ఇప్పటికీ కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురవలేదు.  చెరువులు, కుంటలు కంప్లీట్​గా నిండకపోవటంతో భూగర్భజల మట్టాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు.  నిరుడు ఈ పాటికి   దాదాపు చెరువులన్నీ నిండాయి.  చెరువుల కింద  వరి నాట్లు కూడా ఇప్పుడిప్పుడు వేస్తున్నారు.   ప్రధానంగా బోర్లు, వర్షపు చినుకులకు నాట్లు వేశారు.  

కామారెడ్డి జిల్లాలో 13.57 మీటర్లకు చేరిన నీటి మట్టం

  • కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాల నీటి మట్టం కొద్దిగానే పెరిగింది.  జిల్లా సగటు నీటి మట్టం జూన్​లో   14.46 మీటర్లు ఉండగా జులైలో 13.57 మీటర్ల చేరింది. నెల రోజుల్లో  కేవలం 0.89 మీటర్లు నీటి మట్టం పెరిగింది.   నిరుడు జులైలో  సగటు నీటి మట్టం  9.19 మీటర్లు ఉంది.  నిరుటి కంటే ఈ సారి నీటి మట్టం ఇంకా 4.38 మీటర్లు తక్కువగా ఉంది. ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో  భూగర్భజలాలు ఇంకా పెరగలేదు.  జిల్లాలో  ఆగస్టు 6 నాటికి  450 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 451 మి.మీ. వర్షం కురిసింది.  నిరుడు  సీజన్​ ఆరంభం నుంచి  ఆగస్టు 6 వరకు 630 మి.మీ. లకు గాను 1,114 మి.మీ. వర్షపాతం కురిసింది.   నిరుటి కంటే ఈ సారి వర్షాలు తక్కువగా కురిశాయి. నిరుడు సీజన్​ ఆరంభం నుంచే భారీ వానలు పడటంతో  చెరువులు, కుంటలు ఇప్పటికే  కంప్లీట్​గా నిండాయి.   
  •  కామారెడ్డి జిల్లాలో మొత్తం 1515 చెరువులు ఉండగా.. అందులో 674 చెరువుల్లో కేవలం 25 శాతం మేర నీరు వచ్చి చేరింది. 481 చెరువుల్లో 50 శాతం వరకు నీరు ఉండగా.. 149 చెరువుల్లో 75 శాతం వరకు నీటి నిల్వలు ఉన్నాయి. 141 చెరువులు మాత్రం పూర్తి స్థాయిలో నిండి అలుగులు పారుతున్నాయి. 
  •     నిజామాబాద్​ జిల్లాలో మొత్తం చెరువులు 996 ఉండగా..  ఈ వర్షాకాలంలో  25 శాతం మాత్రమే నీళ్లు వచ్చినవి 59. 50 శాతం నీరు చేరినవి 132 కాగా.. 75 శాతం నీటి నిల్వలు ఉన్నవి 298 కాగా.. 431 చెరువుల్లో మొత్తం నీరు చేరి అలుగు పారుతున్నాయి.