గద్వాల జిల్లాలో వేగంగా పడిపోతున్న భూగర్భజలాలు

  • నడిగడ్డలో 26 మీటర్ల దిగువకు గ్రౌండ్​ వాటర్
  • పొంచి ఉన్న నీటి గండం
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆఫీసర్ల ఫోకస్
  • గ్రామాలను రెడ్, ఎల్లో, ఆరంజ్  జోన్లుగా గుర్తింపు

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో గ్రౌండ్ వాటర్  వేగంగా పడిపోతోంది. జిల్లాలో సాధారణంగా 5.97 మీటర్ల వరకు భూగర్భజలాలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 26.84 మీటర్లకు పడిపోయింది. నెలకు 2 నుంచి 3 మీటర్ల మేర గ్రౌండ్  వాటర్ పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రౌండ్  వాటర్  తగ్గడంతో బోర్ల కింద పంటల సాగు కూడా తగ్గించారు. 

ఇక గత వానాకాలంలో వర్షాలు కురవకపోవడంతో జూరాల ప్రాజెక్టు అడుగంటిపోతోంది. జూరాల నుంచి నీటిని ఎత్తిపోయకపోవడంతో నెట్టెంపాడు ప్రాజెక్ట్​ కింద ఈసారి క్రాప్  హాలిడే ప్రకటించారు. తుంగభద్రలో నీళ్లు లేకపోవడంతో ఆర్డీఎస్  కింద కూడా పంటలు సాగు చేయలేదు. ఇలా ఈ మూడు ప్రాజెక్టుల కింద దాదాపు 2 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదు. ఈ ప్రాజెక్టుల కింద సాగునీరు అందించకపోవడం కూడా భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోవడానికి కారణమని చెబుతున్నారు.

పడిపోతున్న గ్రౌండ్  వాటర్..

జిల్లాలో 5.97 మీటర్ల లోతులో గ్రౌండ్  వాటర్  ఉండాలి. 26.84 మీటర్ల లెవెల్ కు గ్రౌండ్  వాటర్  పడిపోయింది. జిల్లాలో ధరూర్  మండలం మార్లబీడులో అత్యధికంగా 26. 84 మీటర్లకు గ్రాండ్  వాటర్ చేరింది. అలాగే అలంపూర్ మండలం పుల్లూరులో 20.40 మీటర్లు, కంచుపాడు 22.59, మునగాల 26.49, గట్టు మండలం చింతలకుంట 22.32 మీటర్ల లెవల్ కు తగ్గిపోయింది. ఉండవెల్లి మండలంలో 11.93 మీటర్లు, కేటిదొడ్డిలో 10.57 మీటర్లు, గట్టు మండలంలో 8.42 మీటర్లు, అలంపూర్​లో 8.16 మీటర్లకు పడిపోయింది.

గ్రామాలకు తాగునీటి గండం

గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడంతో తాగునీటికి ఇబ్బందులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో నీటి సమస్యను ఎదుర్కొనేందుకు ఆఫీసర్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఏ గ్రామాల్లో నీటి సమస్య వస్తుందనే విషయంపై సమగ్ర నివేదిక రూపొందించారు. ఇలా జిల్లాలో 15 గ్రామాలు ఎల్లో జోన్(ఒక్కొక్కరికి 50 లీటర్ల కంటే తక్కువ నీటిని అందిస్తున్న గ్రామాలు)లో, 82 ఆరంజ్ జోన్(ఒక్కో వ్యక్తికి 55 నుంచి 60 లీటర్లు అందించే విలేజ్ లు)లో ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 200 పైగా గ్రామాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి.

జూరాలలో తగ్గుతున్న నీటి నిల్వ..

జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గుతోంది. పంటలకు నీళ్లు బంద్​ పెట్టినప్పటికీ, తాగునీటికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. మిషన్ భగీరథ గ్రిడ్  డిజైన్ లో లోపం వల్ల ప్రాజెక్టులో ప్రస్తుతం 3.16 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ఆ నీటిని తాగునీటి కోసం ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంది. ఈ నెల చివరి వరకు తాగునీటికి సమస్య లేకపోయినా, ఆ తర్వాత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నీటి ఎద్దడి నివారణపై ఫోకస్

గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లో తాగునీటికి ఇబ్బందులు రాకుండా కలెక్టర్  ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. ఎల్లో జోన్ లో ఉన్న గ్రామాలకు తాగునీటి ఇబ్బంది ఉండదని ఆఫీసర్లు చెబుతున్నారు. మిషన్ భగీరథ నుంచి ఒకవేళ నీళ్లు రాకపోయినా గ్రామాల్లోని ఇతర వనరుల ద్వారా నీటిని ఇచ్చేందుకు ఆఫీసర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం మిషన్  భగీరథ ఇంట్రా వారికి గవర్నమెంట్  ఇప్పటికే రూ.1.89 కోట్లు రిలీజ్​ చేసింది. ఈ నిధులతో గ్రామాల్లోని బోర్లు, పైప్  లైన్ల రిపేర్లు చేస్తున్నారు. వీటితో పాటు రైతుల బోర్లను కూడా తీసుకొని నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

జూన్ 15 వరకు ఇబ్బంది ఉండదు..

మిషన్  భగీరథ ద్వారా జూన్  15 వరకు నీటిని అందించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇబ్బంది వచ్చినా, ఇతర వనరుల ద్వారా నీటిని అందిస్తాం. ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటికి ఇబ్బందులు రానివ్వం.

భీమేశ్వరరావు, మిషన్  భగీరథ ఈఈ