ఏందిరా ఇది.. పెళ్లికూతురు ఇంటిపై లక్షల రూపాయలు పారపోశారు.. అదీ విమానం నుంచి..!

దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది.. గోధుమ పిండి దొరక్క పాకిస్థానీలు అల్లాడుతున్నారు. ఇవీ పొద్దస్తమానం పొరుగు దేశం గురించి మన పత్రికల్లో వచ్చే కథనాలు. కానీ, ఈ వార్త చదివితే.. పాకిస్థానోళ్ల దగ్గర బాగానే డబ్బులున్నాయ్ అనిపించకమానదు. 

పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడి పెళ్లి పది కాలాల పాటు గుర్తుండేలా చేశాడు. పొరుగు దేశం సైతం వార్తలు రాసుకునేలా అంగరంగ వైభవంగా జరిపించాడు. ఇంతకూ ఏం చేశాడంటారా..! ఏకంగా ప్రైవేట్ జెట్‌ను అద్దెకు తీసుకొని తన కుమారుడికి కాబోయే వధువు ఇంటిపై లక్షల రూపాయలు వెదజల్లాడు. విమానం నుండి నగదు కింద పడుతున్న సమయంలో వధువు ఇంటిలోని కొందరు వ్యక్తులు ఆకాశంవైపు తదేకంగా చూస్తున్నారు. విమానంలో నగదు జారవిడుచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఖరీదైన వివాహం పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో జరిగినట్లు తెలుస్తోంది.

పిచ్చంటారు దీన్ని.. 

కుమారుడి పెళ్లి గురించి పది మంది మాట్లాడుకునేలా చేయాలనే ఆ తండ్రి ఆలోచన మంచిదే కానీ, అనుసరించిన వ్యూహం ఇది కాదని కొందరు వరుడి తండ్రిని విమర్శిస్తున్నారు. అసలే పాకిస్థాన్ లో కొందరు పౌరులు.. తినడానికి తిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. అటువంటి వారికి బాసటగా నిలుచుంటే బాగుండేదని సూచిస్తున్నారు. ఏదేమైనా ఈ పెళ్లి మాత్రం అందరినీ మాట్లాడుకునేలా చేసింది.