పచ్చని చెట్లపై గొడ్డలి వేటు

  • కవ్వాల్​ ఫారెస్ట్​లో యథేచ్ఛగా టేకు చెట్ల నరికివేత
  • మామూళ్ల మత్తులో బీట్, సెక్షన్​అధికారులు
  • ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు
  • ఇన్​ఫార్మర్​వ్యవస్థ నిర్వీర్యం


మంచిర్యాల/దండేపల్లి, వెలుగు: కవ్వాల్ టైగర్​ రిజర్వ్​ ఫారెస్ట్​లోని పచ్చని చెట్లు కలప స్మగ్లర్ల గొడ్డలి వేటుకు కుప్పకూలుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొంతమంది స్మగ్లర్లు విలువైన టేకు చెట్లను యథేచ్ఛగా నరికేసి కలప అమ్ముకుంటున్నారు. అడవులను కాపాడాల్సిన బీట్, సెక్షన్​ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారు. దీనికితోడు పైఅధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్మగ్లింగ్​కు అడ్డూఅదుపు లేకుండా పోతోందని విమర్శలు వస్తున్నాయి. 

తాజాగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని తానిమడుగు బీట్​లో నరికిన చెట్లే ఇందుకు నిదర్శనం. ఇటీవల దాదాపు ఎకరం విస్తీర్ణంలో 35 భారీ టేకు చెట్లను నరికేసి అక్కడినుంచి కలపను తరలించుకుపోయారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.

మామూళ్ల మత్తులో అటవీ సిబ్బంది

కవ్వాల్ ​టైగర్ ​రిజర్వ్​ ఫారెస్ట్​పరిధిలో కొన్ని వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇందులో చెట్ల కన్నా ఖాళీ ప్రదేశం, ముండ్ల పొదలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటే కలప స్మగ్లింగ్​ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కిందిస్థాయి సిబ్బంది అవినీతి కారణంగానే అడవులు అంతరించిపోతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బీట్ ఆఫీసర్లు అటవీశాఖకు శాపంగా మామారారని, స్మగ్లర్లతో కుమ్మక్కై వనమేధానికి సహకరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం హరితహారం, స్వచ్ఛదనం - పచ్చదనం ప్రోగ్రాంల ద్వారా లక్షలాది మొక్కలు నాటిస్తుంటే మరోపక్క అడవులు నరికివేతకు గురవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం.

ఇన్​ఫార్మర్​ వ్యవస్థ నిర్వీర్యం 

అడవుల పరిరక్షణలో మొన్నటివరకు అటవీశాఖ అనుసరించిన ఇన్​ఫార్మర్​ వ్యవస్థ ఇటీవల నీరుగారిపోయింది. గతంలో గ్రామస్తుల సహకారంతో అటవీశాఖ పగడ్బందీగా ఇన్​ఫార్మర్ నెట్​వర్క్ ఏర్పాటు చేసుకునేది. వారిద్వారా అడవుల నరికివేత, కలప తరలింపు సమాచారం తెలుసుకొని ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టేవారు. అటవీశాఖ ఆన్ ఆడిట్ నిధుల నుంచి ఇన్​ఫార్మర్లకు రెమ్యునరేషన్​ చెల్లించేవారు. ఇటీవల ఇన్​ఫార్మర్​వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఫలితంగా చెట్ల నరికివేత, కలప స్మగ్లింగ్ సమాచారం అధికారులకు ఎప్పటికప్పుడు అందడం లేదు. 

గతంలో నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలను కలుపుతూ ఫ్లయింగ్ స్క్వాడ్ విభాగం ఉండడంతో పూర్తిస్థాయిలో తనిఖీలు చేసి అడవులను సంరక్షించుకున్నారు. డీఎఫ్ఓలు, రేంజ్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు ప్రతిరోజూ అడవుల చుట్టూ తిరుగుతూ స్మగ్లర్లను గుర్తించి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేవారు. ఇప్పుడు సరిపడా స్టాఫ్ ఉన్నప్పటికీ మనమేధం మాత్రం ఆగడం లేదు. ఇటీవల కొంతమంది అధికారులు తమ సొంత పనుల్లో నిమగ్నమై అడవుల రక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అడవుల రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

అటవీ సిబ్బందిపై చర్యలు తప్పవు 

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఫారెస్ట్ సిబ్బందిపై చర్యలు తప్పవని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ సీఎఫ్​వో శాంతారాం హెచ్చరించారు. దండేపల్లి మండలం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని తానిమడుగు బీట్ లో టేకు చెట్లు నరికివేసిన ప్రదేశాన్ని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శివ్​ఆశిష్​ సింగ్​తో తో కలిసి ఆదివారం పరిశీలించారు. తానిమడుగు బీట్​లో టేకు చెట్లు నరికిన వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.- కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ సీఎఫ్ఓ శాంతారాం