చిగురిస్తున్న ఆశలు...కర్నూల్-విశాఖపట్నం సెమీ హైస్పీడ్​ కారిడార్​కు గ్రీన్​ సిగ్నల్

  • ఏపీ, కర్నాటక రాష్ట్రాలతో వనపర్తి, నాగర్​కర్నూల్, గద్వాల​జిల్లాలకు లింక్

వనపర్తి, వెలుగు: వనపర్తి మీదుగా కర్నూల్, విశాఖపట్నం సెమీ హైస్పీడ్​ కారిడార్​ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటివరకు అంతంతమాత్రంగా ఉన్న రైల్వే సదుపాయం మెరుగవుతుందని భావిస్తున్నారు. రెండున్నర దశాబ్దాల ఎదురుచూపుల తరువాత వనపర్తి మీదుగా రాయచూరు–-మాచర్ల రైల్వే లైను ఏర్పాటుకు గతంలో కేంద్రం పచ్చ జెండా ఊపడంతో జిల్లా ప్రజల్లో ఆశలు చిగురించాయి.

కానీ, దశాబ్దాలు గడుస్తున్నా రాయచూరు–-గద్వాల లైన్​ మాత్రమే పూర్తి చేశారు. ఈ తరుణంలో సెమీ హైస్పీడ్​ ప్రాజెక్ట్​ ప్రణాళిక పూర్తి కావడంతో వనపర్తి, నాగర్​కర్నూల్​ జిల్లా ప్రజలకు హై స్పీడ్​ రైలు అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా కర్నూల్​కు సెమీ హైస్పీడ్​ కారిడార్​ను నిర్మించనున్నారు. 

రైలు మార్గంలో మార్పులు..

రాయచూరు–-మాచర్ల రైల్వే లైన్​ కాకుండా తాజాగా కర్నూల్–​విశాఖ సెమీ హై స్పీడ్​ కారిడార్​ ఏర్పాటు కానుంది. వనపర్తి జిల్లాలో ఎప్పుడో సంస్థానాధీశుల కాలంలో మదనాపురంలో వనపర్తి రోడ్  రైల్వే స్టేషన్​ను ఏర్పాటు చేశారు. వనపర్తి పట్టణ ప్రజలు రైలు ఎక్కాలంటే 23 కిలోమీటర్లు వెళ్లక తప్పేది కాదు. హై స్పీడ్​ కారిడార్​లో మార్గాన్ని కొంత మార్చారు. దీంతో వనపర్తికి  రైలు కూత దగ్గర కానుంది.

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో అసలే రైలు సౌకర్యం లేని నాగర్​కర్నూల్​ జిల్లాకూ రైలు సౌలత్​ కలగనుంది.  ఈ మార్గంలో మదనాపురం, కొత్తకోట, అచ్యుతాపూరు, చిట్యాల, పొలికేపాడు, నాగర్​కర్నూల్, కల్వకుర్తి, నల్గొండ, సూర్యాపేట మీదుగా విశాఖపట్నం లైన్​ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ప్రిలిమినరీ, ఇంజినీరింగ్​ ట్రాఫిక్​ సర్వే పూర్తయ్యింది.  మదనాపురం నుంచి చిట్యాల వరకు ప్రతి 2కి.మీ ఒక రాయి వేస్తూ లైన్​ను క్లియర్​ చేశారు. ఈ నెలాఖరులో రైల్వే బోర్డుకు రిపోర్ట్​ ఇవ్వనున్నారు. 

ఏపీ, కర్నాటకతో లింక్..

వనపర్తి జిల్లా ప్రజలకు ఏపీలోని రాయలసీమ, కర్నాటకలోని రాయచూరుతో వ్యాపార, వాణిజ్య సంబంధాలతో పాటు ఇతర సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇప్పటికే కొల్లాపూర్​ నుంచి నందికొట్కూర్​కు హైవేలో భాగంగా సోమశిల-–నందికొట్కూరు మధ్య కృష్ణా నదిపై బ్రిడ్జి మంజూరైంది. ఇటు వనపర్తికి సెమీ హై స్పీడ్​ కారిడార్​ ఏర్పాటుతో దశ తిరుగుతుందని భావిస్తున్నారు.

ఇప్పటివరకు జిల్లా ప్రజలు హైదరాబాద్, కర్నూల్, రాయచూరు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తూ వస్తున్నారు. తాజా కారిడార్​తో జిల్లా ప్రజలకు హైదరాబాద్, రాయచూరు, కర్నూల్​ ప్రాంతాలకు రైలు సౌకర్యం మరింత మెరుగుపడనుంది. అదనంగా ఏపీలోని విశాఖపట్నం వెళ్లేందుకు అనుకూలంగా మారనుంది. 

శుభ పరిణామం..


విశాఖ-కర్నూల్​ సెమీ హైస్పీడ్​ కారిడార్​తో వనపర్తి జిల్లాకు మంచి రోజులు రానున్నాయి. రాయచూరు-మాచర్ల లైను కోసం ఉద్యమాలు చేశాం. లైనులో కొంత మార్పు చేసి కారిడార్​ ఏర్పాటు కానుండడంతో జిల్లా ప్రజలకు మూడు రాష్ట్రాల మధ్య రాకపోకలు మెరుగుపడనున్నాయి. - బి.కృష్ణ, రైల్వే సాధన సమితి ప్రతినిధి