కిచెన్ తెలంగాణ : ఆకుపచ్చని బటానీలతో వెరైటీ వంటకాలివే..

ఆకుపచ్చని రంగులో ఉండే బటానీ.. సైజులో చిన్నగా కనిపించినా.. పోషకాల్లో మాత్రం దానికి సాటి లేదు. ఎందుకంటే.. ఇందులో ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్.. ఇలా ఎన్నో న్యూట్రియెంట్స్​ ఉన్నాయి. బటానీలు తింటే.. డైజెషన్ బాగుంటుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్​ చేస్తుంది. క్యాన్సర్​ రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు.. కళ్లు, చర్మం, ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న బటానీలను ఇలా వెరైటీగా చేసుకుని తిన్నారంటే నోటికి రుచిగానే కాకుండా కాస్త డిఫరెంట్ ఫుడ్ తిన్న తృప్తి కూడా ఉంటుంది. 

మరింకేం.. ఈ బటానీలతో బ్రేక్​ఫాస్ట్​ రెసిపీలు ఈ వారం స్పెషల్స్.

పొంగనాలు 

కావాల్సినవి :
బొంబాయి రవ్వ, బటానీలు – ఒక్కో కప్పు, 
పెరుగు, నీళ్లు – ఒక్కోటి అర కప్పు,
పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ – ఒక్కోటి, వెల్లుల్లి – ఎనిమిది,
నూనె – ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర – కొంచెం,
జీలకర్ర పొడి, కారం, బేకింగ్ సోడా – ఒక్కోటి అర టీస్పూన్, పసుపు, గరం మసాలా – పావు టీస్పూన్, ఉప్పు – సరిపడా

ముందుగా ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, పెరుగు వేసి నీళ్లు పోసి బాగా కలపాలి. మూతపెట్టి 20 నిమిషాలు పక్కన ఉంచాలి. తర్వాత నానబెట్టిన బొంబాయిరవ్వ మిశ్రమంలో ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలపాలి.
మరోవైపు పాన్​లో నూనె వేడి చేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు వేసి వేగించాలి. మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత అందులో పసుపు, జీలకర్రపొడి, కారం, ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. కాసేపటి తర్వాత వాటిని చల్లారనివ్వాలి. మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. వాటిని ఉండలుగా చేసి పెట్టుకోవాలి. 
చివరిగా పొంగనాల పెనం వేడి చేసి, అందులో నూనె వేసి రెడీ చేసుకున్న పిండిని వేయాలి. తర్వాత రెడీ చేసుకున్న ఉండలను ఒక్కోదాంట్లో వేసి మరోసారి దానిపై పిండి వేయాలి. ఆపై మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని తిప్పేసి, మరికాసేపు ఉడకనివ్వాలి. అంతే.. బటానీ స్టఫ్డ్​​ పొంగనాలు తినడానికి రెడీ. 

పూరీలు

కావాల్సినవి :
మొలకెత్తిన బటానీలు,
గోధుమ పిండి – ఒక్కో కప్పు
పచ్చిమిర్చి – రెండు
పసుపు, వాము – ఒక్కో టీస్పూన్ 
కారం – అర టేబుల్ స్పూన్
ఉప్పు – సరిపడా
కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్లు

తయారీ :మిక్సీజార్​లో మొలకెత్తిన బటానీలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి, పసుపు, వాము, కారం, ఉప్పు, కొత్తిమీర, రెడీ చేసుకున్న బటానీ మిశ్రమం కూడా వేసి బాగా కలపాలి. ముద్దలా తయారయ్యాక కొంచెం నూనె వేసి మరోసారి కలిపి పావుగంట పాటు పక్కన ఉంచాలి. తర్వాత ఆ పిండిని చిన్న ఉండలుగా చేసి వాటిని చపాతీల్లా వత్తాలి. ఆపై పూరీల్లా కట్ చేయాలి. బాండీలో నూనె వేడి చేసి అందులో పూరీలను వేసి వేగించాలి. నిజానికి పూరీలను బటానీ కర్రీతో తింటుంటారు. అయితే ఈసారి పూరీ కూడా బటానీతో చేసుకుంటే టేస్ట్​ అదిరిపోద్ది. 

ఇడ్లీ

కావాల్సినవి :
బటానీలు, బొంబాయి రవ్వ, పెరుగు – ఒక్కో కప్పు
అల్లం – చిన్న ముక్క
పచ్చిమిర్చి – రెండు
నీళ్లు – సరిపడా
నూనె – రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు – అర టీస్పూన్
మినప్పప్పు – ఒక టీస్పూన్
కరివేపాకు – కొంచెం
బేకింగ్ సోడా లేదా ఈనో – ఒక టీస్పూన్
నీళ్లు, ఉప్పు – సరిపడా

తయారీ : మిక్సీజార్​లో బటానీలు, అల్లం, పచ్చిమిర్చి వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో పేస్ట్​ని వేసి అందులో పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. పాన్​లో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేగించాలి. ఆ తాలింపును కూడా బటానీ మిశ్రమంలో వేసి కలపాలి. తర్వాత బేకింగ్ సోడా వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్​కి నూనె పూసి అందులో బటానీ మిశ్రమాన్ని వేయాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసి అందులో ఇడ్లీ ప్లేట్​ను పెట్టి మూతపెట్టాలి. పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత తీసి తింటే టేస్ట్ బాగుంటాయి.