యూట్యూబర్ ​: ఉద్యోగాలు వదిలి.. వంటలు చేస్తున్నరు

ఏఎస్‌‌‌‌ఎంఆర్ వీడియోలు అనగానే మనకు ఎక్కువగా ఇంగ్లిష్‌‌‌‌ వాళ్ల యూట్యూబ్‌‌‌‌ ఛానెల్స్‌‌‌‌ గుర్తొస్తాయి. కానీ.. మనవాళ్లు కూడా అలాంటి ఛానెల్స్‌‌‌‌ నడుపుతున్నారు. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి నడుపుతున్న ‘గ్రేట్ ఇండియన్ ఏఎస్‌‌‌‌ఎంఆర్‌‌‌‌‌‌‌‌’ అనే ఛానెల్‌‌‌‌ ఇంగ్లిష్‌‌‌‌ ఛానెల్స్​కి పోటీనిస్తోంది. ఛానెల్‌‌‌‌ పెట్టి రెండేండ్లు కాకముందే లక్షల మంది అభిమానాన్ని, కోట్ల వ్యూస్‌‌‌‌ తెచ్చుకుంది. 

ముగ్గురు స్నేహితులు కలిసి ఓ యూట్యూబ్‌‌‌‌ ఛానెల్ పెట్టారు. ఆ ఛానెల్‌‌‌‌ పేరు ‘‘గ్రేట్‌‌‌‌ ఇండియన్ ఏఎస్‌‌‌‌ఎంఆర్‌‌‌‌‌‌‌‌”. ఈ ఛానెల్‌‌‌‌ని నడుపుతున్న గౌతమ్‌‌‌‌, కిరణ్​, కార్తిక్‌‌‌‌లు ముగ్గురు ఫ్రెండ్స్‌‌‌‌. 2023లో మన దేశంలో అత్యంత జనాదరణ పొందిన వీడియో, షార్ట్‌‌‌‌, బ్రేకవుట్ క్రియేటర్ల లిస్ట్‌‌‌‌ని ‘ఇయర్ ఎండ్‌‌‌‌ రౌండప్‌‌‌‌’ పేరుతో యూట్యూబ్‌‌‌‌ ఈ మధ్యే విడుదల చేసింది. అందులో ఈ ఏడాది వ్యూయర్స్‌‌‌‌ని మెప్పించిన కంటెంట్, క్రియేటర్స్‌‌‌‌ గురించి చెప్పింది.

అందులో టాప్‌‌‌‌ టెన్‌‌‌‌ బ్రేకవుట్‌‌‌‌ క్రియేటర్స్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో ‘‘గ్రేట్‌‌‌‌ ఇండియన్ ఏఎస్‌‌‌‌ఎంఆర్‌‌‌‌‌‌‌‌” ఛానెల్‌‌‌‌ కూడా ఉంది. ఎందుకంటే.. ఛానెల్‌‌‌‌ పెట్టిన చాలా తక్కువ టైంలోనే ఎంతో పాపులర్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. ప్రస్తుతం ఈ ఛానెల్‌‌‌‌కు 9.67 మిలియన్ల సబ్‌‌‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 218 వీడియోలు పోస్ట్‌‌‌‌ చేశారు. ఛానెల్‌‌‌‌లో ఒక వీడియోకు ఏకంగా205 మిలియన్ల వ్యూస్‌‌‌‌ వచ్చాయి. యాభై మిలియన్ల వ్యూస్‌‌‌‌ దాటిన వీడియోలు బోలెడు.  

వాళ్లే అన్నీ.. 

ఈ ఛానెల్‌‌‌‌ నడుపుతున్న వాళ్లలో ఒకరైన గౌతమ్‌‌‌‌.. ఛానెల్‌‌‌‌కు హోస్ట్‌‌‌‌, ఎడిటర్‌‌‌‌‌‌‌‌. వీడియోల్లో ఎక్కువగా అతనే కనిపిస్తుంటాడు. వాళ్లలో కిరణ్​ బాగా వండుతాడు. అందుకే అతను కుక్‌‌‌‌గా పని చేస్తున్నాడు. కార్తిక్​ కెమెరా వర్క్‌‌‌‌తో పాటు ఇతర పనులు చేస్తున్నాడు. వీళ్లలో గౌతమ్‌‌‌‌, కార్తిక్ ఉడిపిలో ఉండేవాళ్లు. ఇద్దరూ ఎంఎన్‌‌‌‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుండేవాళ్లు. కిరణ్‌‌‌‌ బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు. ఈ  ముగ్గురూ కలిసి ఉడిపి నుంచి ఈ ఛానెల్‌‌‌‌ నడుపుతున్నారు. 

ఎందుకు? 

ముగ్గురూ మంచి ఉద్యోగాల్లో సెటిల్‌‌‌‌ అయినప్పటికీ ఇంకా ఏదో సాధించాలి. కొత్తగా ఏదైనా చేయాలనే విజన్ ఉండేది. కానీ.. ఏం చేయాలనేందుకు మాత్రం సరైన ఐడియా లేదు. అదే టైంలో యూట్యూబ్‌‌‌‌ షార్ట్స్‌‌‌‌ బాగా పాపులర్ అయ్యాయి. అలాంటి టైంలో గౌతమ్‌‌‌‌  అనుకోకుండా ఒకరోజు యూట్యూబ్‌‌‌‌లో ఒక ఫారినర్‌‌‌‌‌‌‌‌ వీడియోలు చూశాడు. అతని ఛానెల్లోని వీడియోల్లో మ్యూజిక్‌‌‌‌, బీట్స్‌‌‌‌ మాత్రమే ఉండేవి. అయినా.. వీడియోలు బాగుండేవి. అతను వంట చేస్తున్నప్పుడు వస్తున్న ఏఎస్‌‌‌‌ఎంఆర్ సౌండ్స్‌‌‌‌ వింటే హాయిగా అనిపించింది. అందుకే ఆ వీడియోలకు వ్యూస్‌‌‌‌ కూడా ఎక్కువగా వచ్చేవి.

అదే ఛానెల్‌‌‌‌లో ఒకసారి చికెన్‌‌‌‌ బిర్యానీ మేకింగ్​ వీడియో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశాడు. ఫారినర్ అయినా ఇండియన్‌‌‌‌ స్టయిల్‌‌‌‌లో ఫర్ఫెక్ట్‌‌‌‌గా బిర్యానీ చేశాడు. కానీ.. దాన్ని స్పూన్‌‌‌‌తో తిన్నాడు. దాంతో గౌతమ్‌‌‌‌కు ఇండియన్ స్టయిల్‌‌‌‌లో చేసినప్పుడు ఇండియన్‌‌‌‌ స్టయిల్‌‌‌‌లో చేత్తోనే తినాలి కదా! అనిపించింది. అప్పుడే ఇండియన్‌‌‌‌ స్టయిల్​ ఫుడ్‌‌‌‌ మేకింగ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ పెట్టాలనే ఐడియా వచ్చింది. అందులో కూడా ఏఎస్‌‌‌‌ఎంఆర్‌‌‌‌‌‌‌‌ స్టయిల్‌‌‌‌లో వీడియోలు చేయాలి అనుకున్నాడు. కానీ.. ఆ తర్వాత ఛానెల్‌‌‌‌ పెట్టాలనే ఆలోచన పక్కన పెట్టాడు.

2022లో కమల్‌‌‌‌హాసన్‌‌‌‌ హీరోగా వచ్చిన ‘విక్రమ్‌‌‌‌’ సినిమా చూశాక ఆ ఆలోచన అమలు చేయాలని డిసైడ్​ అయ్యాడు. ఆ సినిమాకు.. గౌతమ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ పెట్టడానికి సంబంధం ఏంటి అంటారా? విక్రమ్‌‌‌‌ సినిమాలో తమిళనాడులోని ‘విలేజ్‌‌‌‌ కుకింగ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌’ అనే యూట్యూబ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌కు చెందిన కొందరు బిర్యానీ వండే సీన్‌‌‌‌లో నటించారు. సినిమాలో ఆ సీన్‌‌‌‌ చూశాక అతనికి చాలా హ్యాపీగా అనిపించింది. ఒక యూట్యూబ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ వల్ల అంతలా ఫేమస్‌‌‌‌ అయ్యారని వాళ్లను చూసి ఇన్‌‌‌‌స్పైర్ అయ్యాడు. దాంతో తాను కూడా కుకింగ్ ఛానెల్‌‌‌‌ పెట్టాలని డిసైడ్‌‌‌‌ అయ్యాడు.

మరుసటి రోజే తన ఫ్రెండ్ కిరణ్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేశాడు. అతను కూడా ‘ఓకే’ అనడంతో ఛానెల్‌‌‌‌కు పునాదులు పడ్డాయి. అయితే.. ఇక్కడే ఒక సమస్య వచ్చింది. అదేంటంటే.. కిరణ్​ ఛానెల్‌‌‌‌ కోసం పనిచేయడానికి ఒప్పుకున్నా కెమెరా ముందుకు రావడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే.. అతనికి కెమెరా ముందు కనిపించడమంటే సిగ్గు. అందుకే కుకింగ్‌‌‌‌ చేయడం మాత్రమే చూపించాలని డిసైడ్ అయ్యి ఛానెల్‌‌‌‌ పెట్టారు. కార్తిక్‌‌‌‌ కూడా కెమెరా వర్క్‌‌‌‌ చేసేందుకు ఒప్పుకుని జాబ్‌‌‌‌కి రిజైన్ చేశాడు.

తర్వాత కిరణ్​ తన ఉద్యోగానికి రిజైన్‌‌‌‌ చేసి బెంగళూరు నుంచి ఉడిపి వచ్చేశాడు. అయితే.. కిరణ్​ ఐదేండ్ల పాటు ఇంటికి దూరంగా బెంగళూరులో ఉండడంతో రోజూ తనే వంట చేసుకునేవాడు. దాంతో అన్ని రకాల వంటలు నేర్చుకున్నాడు. ఆ నాలెడ్జ్‌‌‌‌ ఇలా ఛానెల్‌‌‌‌లో వంటలు చేసేందుకు ఉపయోగపడింది. 

ఒక వీడియోకు మూడు రోజులు 

ఛానెల్‌‌‌‌లో దాదాపు షార్ట్ వీడియోలే పోస్ట్‌‌‌‌ చేస్తుంటారు. కానీ.. వీడియోలు ఫర్ఫెక్ట్‌‌‌‌గా తీయాలనే ఉద్దేశంతో ఒక్కో వీడియోకు దాదాపు మూడు రోజుల టైం తీసుకుంటారు. ఒక రోజు సరుకులు కొని, స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు. రెండో రోజు వంట చేస్తారు. మరో రోజు ఎడిటింగ్‌‌‌‌ చేస్తారు. ఇలా ఒక వీడియోకి మూడు రోజులు పడుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల వంటకాలు చేస్తుంటారు. అయితే.. వాళ్లు ఇష్టంగా చేసిన వంటే అయినా.. నచ్చకపోతే నిర్మొహమాటంగా ‘నచ్చలేదు’ అని వీడియో ఎండింగ్‌‌‌‌లో చెప్తారు. ఒక రకంగా ఇది వాళ్ల యుఎస్​పి అని చెప్పొచ్చు.