బడుల్లో పారిశుధ్య నిర్వహణకు గ్రాంట్స్

  •  ఒక్కో స్కూల్​కు రూ.3 వేల నుంచి రూ.20 వేలు 
  •  స్టూడెంట్ల సంఖ్యను బట్టి నిధులు
  •  అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే బాధ్యతలు.. 
  •  ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు : సర్కారు బడుల్లో పారిశుధ్య నిర్వహణకు గ్రాంట్స్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. బీఆర్ఎస్ హయాంలో సర్కారు బడుల్లో తొలగించిన స్కావెంజర్ల స్థానంలో కొత్తగా వర్కర్లను తీసుకునేందుకు గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే స్కూళ్లలో రిపేర్లు చేపడ్తున్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే ఈ బాధ్యతలు అప్పగించింది. స్టూడెంట్ల సంఖ్యను బట్టి ఒక్కో స్కూల్​కు ప్రతినెలా రూ.3వేల నుంచి రూ.20వేల దాకా గ్రాంట్స్ ఇచ్చేందుకు నిర్ణయించింది.

 ఆ మొత్తంలో బడుల క్లీనింగ్, మరుగుదొడ్ల నిర్వహణ, మొక్కల సంరక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో నంబర్ 21 రిలీజ్ చేశారు. కాగా, స్కూళ్లలో పారిశుధ్య నిర్వహణకు చర్యలు తీసుకుంటామని మూడు రోజుల కింద టీచర్లకు సీఎం రేవంత్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పట్టించుకోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా 26వేలకు పైగా సర్కారు బడులున్నాయి. స్కూల్ ఆవరణలోని టాయ్ లెట్ల నిర్వహణ, మొక్కలకు నీళ్లు పోయడం వంటి పనులను గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖకు.. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది. అయితే, ఆయా శాఖలు సక్రమంగా ఆ పనులు నిర్వహించ లేదు. దీంతో టీచర్ల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్టూడెంట్ యూనియన్లు అప్పటి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశాయి. అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో బడుల్లో పారిశుధ్యం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. కొన్ని బడుల్లో టీచర్లు సొంతంగా డబ్బులు వేసుకొని వర్కర్లను నియమించుకున్నారు.

టీచర్ల వినతికి స్పందించిన సీఎం రేవంత్

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి టీచర్ల సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బడుల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యను యూనియన్ లీడర్లు సీఎం దృష్టికి తీసుకుపోయారు. ఈ క్రమంలోనే మూడు రోజుల కింద ఎల్​బీ స్టేడియంలో జరిగిన టీచర్ల ముఖాముఖి సమావేశంలో పారిశుధ్య నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగిస్తామని, నిధులు వాటికే ఇస్తామని ప్రకటించారు. 

దీనికి అనుగుణంగా సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. లోకల్ బాడీ, గవర్నమెంట్, మోడల్ స్కూళ్లలో టాయ్ లెట్ల శుభ్రత, మొక్కలకు నీళ్లు పోయడం, స్కూల్ ఆవరణను నీట్ గా ఉంచడం వంటి పనుల కోసం ప్రత్యేకంగా గ్రాంట్​ను రిలీజ్ చేసింది. జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ నుండి పది నెలలకు నిధులను విడుదల చేసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది.

30 మంది ఉంటే రూ.3వేలు

బడుల్లో పారిశుధ్య పనుల కోసం ఆయా స్కూళ్లలోని సంఖ్యకు అనుగుణంగా నిధులు రిలీజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 30 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లకు రూ.3వేలు గ్రాంట్ ఇస్తామని ప్రకటించింది. 31 నుంచి వంద మంది విద్యార్థులున్న స్కూళ్లకు రూ.6వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.8 వేలు, 251 నుంచి 500 మంది విద్యార్థులుంటే రూ.12వేలు, 501 నుంచి 750 మంది ఉంటే రూ.15వేలు, 750మంది కంటే అధికంగా ఉన్న స్కూళ్లకు రూ.20వేలు చొప్పున గ్రాంటుగా ఇవ్వనున్నది. పది నెలలకు ఈ గ్రాంట్ ఇవ్వనున్నది.

 ఈ నిధుల్లోంచే క్లీనింగ్ కు అవసరమైనవి కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, సర్కారు నిర్ణయాన్ని టీచర్ల సంఘాలు స్వాగతించాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఎస్​టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పర్వత్ రెడ్డి, సదానందం గౌడ్, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి, ఆర్​యూపీపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జగదీశ్, నర్సిములు, యూటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు చెప్పారు.