కలెక్టరేట్ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం

కరీంనగర్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని డిమాండ్  చేస్తూ తాజా మాజీ సర్పంచులు సోమవారం కరీంనగర్  కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ర్యాలీగా వచ్చిన మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్  చేశారు. సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ప్రకటించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  ప్రజావాణికి వచ్చే సామాన్య ప్రజలను కూడా గేటు వద్ద తనిఖీ చేశాకే  అనుమతించారు. ఈ క్రమంలో ఇద్దరు, ముగ్గురు చొప్పున మాజీ సర్పంచులు రాగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌  ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా పెండింగ్‌  బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించేంత వరకు ఆందోళన చేస్తామని తెలిపారు.