గ్రామాల్లో నిధుల గోల్​మాల్

  • అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులతో రీ–ఆడిట్ చేయాలని కలెక్టర్ ఆదేశం
  • నలుగురు ఆఫీసర్లతో గ్రామ పంచాయతీల్లో ఆడిట్ 
  • రోజు ఐదు చొప్పున.. 475 గ్రామాల్లో రికార్డుల పరిశీలన 
  • వెరిఫికేషన్​లో బయటపడుతున్న అక్రమాలు

సూర్యాపేట, వెలుగు : గ్రామ పంచాయతీల్లో ఉన్న అరకొర నిధులను పలుచోట్ల పాలకవర్గాలు, అధికారులు కమ్మక్కై దుర్వినియోగం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాల్లో నిధుల గోల్​మాల్​పై కలెక్టర్‌‌‌‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిధులను పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కలిసి దారిమళ్లించారు. కొన్నిచోట్ల కలిసి పంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

గ్రామ పంచాయతీల్లో అక్రమాలపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. సూర్యాపేట కలెక్టర్ గా తేజస్ నందలాల్ పవార్  బాధ్యతలు చేపట్టిన మొదట్లోనే అక్రమాలను సహించేది లేదని, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కానీ, చాలా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామాల్లో సోషల్ ఆడిట్ లు నిర్వహించినా అక్రమాలు మాత్రం వెలుగులోకి రాకుండా మేనేజ్ చేస్తున్నారు. వీటిపై కలెక్టర్​సమగ్ర విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పలు గ్రామ పంచాయతీల్లో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో వాటిపై నిగ్గుతేల్చేందుకు నలుగురు విచారణాధికారులను నియమించారు.

 

అంతా దారిమళ్లింపే..

గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కొందరు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పక్కదారి పట్టించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20కిపైగా గ్రామాల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు అధికారులు విచారణ చేపట్టారు. గ్రామ పంచాయతీల్లో నిధులను సక్రమంగా వినియోగించాల్సిన కార్యదర్శులు గతంలో అధికార పార్టీ మద్దతుదారుల అండదండలతో ఇష్టారీతిన ఖర్చులు చూపిస్తూ డబ్బులు నొక్కేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఆయా పంచాయతీల్లో దారిమళ్లించిన నిధులు రూ.లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో  మేళ్లచెర్వు, మునగాల, మట్టంపల్లి, అనంతగిరి, జాజిరెడ్డిగూడెం, చింతలపాలెం, హుజూర్ నగర్ మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో అక్రమాలు బయటపడడంతో ఆ పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. 

వెలుగులోకి వస్తున్న అక్రమాలు..

గ్రామ పంచాయతీ రికార్డులను అధికారులు వెరిఫికేషన్ చేస్తుండడంతో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. జీపీల్లో రికార్డులు అస్తవ్యస్తంగా ఉండడం, మనీ వాల్యూ రిజిస్టర్ అప్ డేట్ లేకపోవడం, క్యాష్ బుక్ లో లోపాలను ఆఫీసర్లు గుర్తించారు. అంతేకాకుండా వివిధ పనుల కోసం ప్రభుత్వం  విడుదల చేసిన ఫండ్స్ లో సైతం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. 

పనులు పూర్తి చేశాక ప్రభుత్వం విడుదల చేసిన ఫండ్స్ లో జీఎస్టీ, సినరేజ్ ట్యాక్స్, ఐటీలకు కొంత పర్సెంటేజ్ చెల్లించాలి, కానీ సర్పంచులు వాటిని పట్టించుకోకుండా పూర్తి బిల్లులను డ్రా చేసినట్లు తేలింది.

 దీంతో ఆఫీసర్లు సంబంధిత కార్యదర్శులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. రికార్డుల వెరిఫికేషన్ లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో జాజిరెడ్డిగూడెం మండలానికి చెందిన ఒక పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొత్తం వెరిఫికేషన్ పూర్తి అయితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. 

రికార్డుల వెరిఫికేషన్.. 

గ్రామ పంచాయతీల్లో అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గ్రామ పంచాయతీల్లో రికార్డులను రీ–ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. డీపీవో, డీఆర్డీఏ పీడీ, జిల్లా ఆడిట్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన ఒక ఎంపీవోను విచారణాధికారులుగా నియమించారు. రోజుకు ఐదు చొప్పున మొత్తం 475 గ్రామ పంచాయతీల్లో రికార్డులను తనిఖీలు చేపట్టనున్నారు. ఇప్పటికే 12 గ్రామ పంచాయతీల్లో రికార్డుల తనిఖీ పూర్తిచేశారు.