జోరుగా ధాన్యం కొనుగోళ్లు!

  • మూడ్రోజుల్లో అకౌంట్లలో వడ్ల డబ్బులు జమ 
  • బోనస్ అందుకున్న అన్నదాతల్లో సంతోషం  
  • ముందు ప్రైవేట్ లో ధాన్యం అమ్ముకున్న రైతుల బాధ 
  • అప్పుడు అకాల వర్షాలతో ప్రైవేట్ కు మొగ్గు

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 330 కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొంటున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు 45,625 మెట్రిక్​ టన్నుల ధాన్యం వచ్చింది. 4128 మంది రైతుల నుంచి 36,012 మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 18542 మెట్రిక్​ టన్నుల ధాన్యానికి సంబంధించిన రైతుల వివరాలను ఆన్​ లైన్​ లో నమోదు చేశారు. నిబంధనల ప్రకారం తేమ శాతం ఉంటే, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వెంటనే కొనుగోళ్లు చేస్తున్నారు. 

ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కాంటాలు వేస్తూ, లారీల ద్వారా గోడౌన్లు, మిల్లులకు తరలిస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు జరిగిన ధాన్యం కొనుగోలు విలువ రూ.66.93 కోట్లు కాగా, రైతులకు రూ.26.53 కోట్లు అకౌంట్లలో జమ చేశారు. ఇందులో 1562 మంది రైతులకు బోనస్ కింద ఇప్పటి వరకు రూ.5.72 కోట్లు బ్యాంకు అకౌంట్లలో జమ చేసినట్టు అధికారులు 
చెబుతున్నారు.

2.82 లక్షల ఎకరాల్లో వరి సాగు.. 

జిల్లాలో ఈ సీజన్​ లో 2.82 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇందులో 2.62 లక్షల ఎకరాల్లో సన్న రకాలు పండించారు. ఇంకో 20 వేల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు పండించారు. మొత్తం 6.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా, అందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనాలని లక్ష్యంగా టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 330 కొనుగోలు కేంద్రాలను ఓపెన్​ చేయగా, ఇందులో డీసీఎంఎస్​ ద్వారా 28, డీఆర్డీఏ ద్వారా 143, పీఏసీఎస్​ ల ద్వారా 159 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కంటే ముందే ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్న రైతులు మాత్రం బాధపడుతున్నారు. తాము బోనస్​ ను కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. అప్పట్లో తుపాను ప్రభావంతో అకాల వర్షాలు పడుతుండడం, తేమ వాతావరణం కారణంగా ధాన్యం ఎండే పరిస్థితి లేకపోవడంతో పచ్చి వడ్లనే ప్రైవేట్ కు అమ్ముకున్నారు. క్వింటా రూ.2000 నుంచి రూ.2200 వరకు ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేశారు. దీంతో అప్పుడు పచ్చి వడ్లను అమ్ముకున్న రైతులు ఇప్పుడు బాధపడుతున్నారు.  

రూ.1.40 లక్షల బోనస్​ వచ్చింది

కాంగ్రెస్​ ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్​ ఇవ్వడం సంతోషంగా ఉంది. గత వారం 280 క్వింటాళ్ల సన్నధాన్యం అమ్మాను. అదనపు ప్రయోజనం ప్రకారం రూ. 1,40,200 నాకు బ్యాంక్​ అకౌంట్లో జమ చేశారు. - ఎడవల్లి ఆదిలక్ష్మి, పాలేరు 

వాతావరణం కారణంగా ముందే అమ్ముకున్న.. 

ముందుగానే పంట చేతికి రావడంతో వాతావరణ పరిస్థితులకు భయపడి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నా. సొంత భూమి 5 ఎకరాలు, కౌలు చేసిన 1 ఎకరంలో పండిన మొత్తం ధాన్యం సుమారు 250 క్వింటాళ్లను రూ.2 వేల చొప్పున అమ్ముకున్న. దీని వల్ల బోనస్​ 1.25 లక్షలతో కలిపి రూ.1.82 లక్షల వరకు నష్టపోయాను.  - మొరంపుడి బాలకృష్ణ, సిద్దారం