ఖమ్మంలో క్రమంగా పెరుగుతున్న వినియోగం .. గంజాయికి చెక్ ​పెట్టలేరా?

  • ఇప్పటి వరకు పట్టుకున్నది చిన్న సప్లయర్స్​ నే..  
  • దందా నడిపిస్తున్న వారిని పట్టుకోవడంలో వైఫల్యం 
  • పీడీ యాక్ట్​ ఎందుకు పెట్టడం లేదని మంత్రి తుమ్మల ఫైర్​

గంజాయి సప్లయ్ ను అడ్డుకోవడంలో ఎక్సైజ్​ డిపార్ట్ మెంట్ సీరియస్​గా ఉండాలి. స్కూళ్లు, కాలేజీల్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా? గడిచిన ఏడాది కాలంలో మీరు ఏ యాక్షన్​ తీసుకున్నట్టు అనిపించడం లేదు. అంటే అసలు గంజాయే రావడం లేదా? సప్లై చేసే వాళ్లు, రిటైల్, హోల్ సేల్, అమ్మేవాళ్లు ఎవరు, కొనేవాళ్లు, ఇలా చైన్​ సిస్టమ్​ ప్రకారం గంజాయి నడుస్తుంది. దాని బాస్​ ను కొట్టేయాలి. కింగ్ పిన్​ లపై పీడీ యాక్టు పెట్టే అవకాశం ఉంది కదా? ఉట్టి కేసులు పెడితే గంజాయి ఆగుతదా? ఒడిశా నుంచి ఎలా వస్తుంది, గోదావరి ఎలా దాటుతుంది, భద్రాద్రి జిల్లా సూపరింటెండెంట్ తో మాట్లాడండి. 

గంజాయి, డ్రగ్స్​ తో భావితరాలకు నష్టం, ఇది అన్నిటికంటే సీరియస్ ఇష్యూ. రేపొచ్చే యువతరం సర్వనాశనం అవుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల స్టోరీలు చూస్తున్నాం. మన రాష్ట్రం కూడా అలాగే కావాలా? మీరు (ఎక్సైజ్​ డిపార్ట్ మెంట్), పోలీస్ జాగ్రత్తగా ఉండకపోతే వెరీ డేంజర్..” అని ఇటీవల ఖమ్మంలో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా ఎక్సైజ్​ సూపరింటెండెంట్ ను ఉద్దేశించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్​ గా చేసిన వ్యాఖ్యలు. ఖమ్మం జిల్లాలో గంజాయి పరిస్థితికి ఈ కామెంట్లు అద్దం పడుతున్నాయి. 

ఖమ్మం, వెలుగు :  ఖమ్మం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, క్రమంగా వినియోగం పెరుగుతుండడం కలవరపెడుతోంది. కాలేజీ, స్కూల్ స్టూడెంట్స్ కు కూడా అందుబాటులో ఉండడం, తరచుగా గంజాయి మత్తులో ఏదో ఒక ఘటన జరుగుతుండడం కామన్​ గా మారింది. ఇంజినీరింగ్, మెడిసిన్​ విద్యార్థులే కాదు, ఇంటర్, స్కూల్​ స్టూడెంట్స్​ కూడా గంజాయికి బానిసలుగా మారారు. అలాంటి వారిని గుర్తించడంతో పాటు, గంజాయి వినియోగానికి చెక్​ పెట్టేందుకు ఖమ్మం నగరంలో గంజాయి సేవిస్తున్న అడ్డాలుగా భావిస్తున్న వాటితో పాటు రోటరీ నగర్ ట్యాంక్, ఎస్బీఐటీ కాలేజీ పరిసరాలు, మమత మెడికల్​ కళాశాల పరిసరాలు, శాంతి నగర్ పాఠశాల పరిసరాలు, చర్చి కంపౌండ్, జహీర్పురా పార్క్ పరిసరాలు, ప్రకాశ్​నగర్, ఎన్టీఆర్ సర్కిల్, కొత్త బస్టాండ్, గట్టయ్య సెంటర్, సరిత క్లినిక్, సారథినగర్ దిగువ రైల్వే వంతెన, గొల్లగూడెం పరిసర ప్రాంతాల్లో గత వారం టాస్క్​ ఫోర్స్​ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 

ఇవే కాకుండా ఖమ్మం రూరల్, ముదిగొండ, సత్తుపల్లి, పెనుబల్లి, ఇతర మండలాల్లోని పలు గ్రామాల్లోనూ గంజాయి వినియోగానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతున్నాయి. జిల్లాలో నాలుగు ప్రధాన జాతీయ రహదారి పనులు జరుగుతుండగా, వీటిలో పనిచేసేందుకు బీహార్, చత్తీస్​ గఢ్, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్​ నుంచి వచ్చిన వందలాది మంది కూలీలు నెలల తరబడి ఇక్కడ ఉండడం కూడా స్థానికంగా గంజాయి వాడకం పెరిగేందుకు కారణమైంది. 

సూత్రధారులను పట్టుకోలేకపోవడంపై విమర్శలు 

జిల్లాలో పోలీస్​ అధికారులు చెబుతున్న ప్రకారం ఈ ఏడాది ఎన్డీపీఎస్​ (నార్కోటిక్​ డ్రగ్స్​ అండ్ సైకోట్రోపిక్​ సబ్ స్టాన్సెస్​) కేసుల సంఖ్య గతేడాది 41 నుంచి ఈ ఏడాWWWWది 35కి తగ్గింది. ఈ కేసుల్లో 268 నిందితులను గుర్తించగా, 238 మందిని అరెస్ట్ చేశారు. గతేడాది జిల్లాలో 872 కిలోల గంజాయినిWW పట్టుకోగా, ఈ ఏడాది 384 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇక ఎక్సైజ్​ శాఖ అధికారులు గతేడాది 123 కేసుల్లో 86 మందిని అరెస్ట్ చేసి 1,654 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఈ ఏడాది నవంబర్​ వరకు 84 కేసుల్లో 90 మందిని అరెస్ట్ చేయగా 792 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే కేజీల చొప్పున గంజాయిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్తున్న వారిని పట్టుకుంటున్నారు తప్ప మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న సూత్రధారులను మాత్రం పట్టుకోలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

ఇటీవల జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలు...

  • జులై మూడో వారంలో ఖమ్మం రోటరీ నగర్​ లో గంజాయి మత్తులో అమ్మమ్మ రాంబాయమ్మను మనవడు ఉదయ్​ కుమార్​ కొట్టిచంపాడు. చెడు వ్యసనాలకు బానిసైన ఉదయ్​, తనకు తాగుడుకు పెన్షన్​ డబ్బులు ఇవ్వలేదని అర్థరాత్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తెల్లారి మత్తు దిగిన తర్వాత పక్కింటి వాళ్లకు అమ్మమ్మ గుండెపోటుతో చనిపోయిందని చెప్పాడు. కానీ ఉదయ్​ షర్ట్ పై రక్తం మరకలు, మృతదేహంపై గాయాలు ఉండడంతో స్థానికులు అతడిని పోలీసులకు పట్టించారు. 
  • అక్టోబర్ ​మొదటివారంలో పెనుబల్లి మండలంలోని పలు గ్రామాల్లో గంజాయి సేవిస్తున్న యువకులను పట్టుకొని పోలీస్​ స్టేషన్​ కు తరలించారు. బీసీ కాలనీ, రంగారావు బజార్, గంగాదేవిపాడు గ్రామాలతో పాటు పలుచోట్ల గంజాయి అడ్డాలుగా చేసుకొని అమ్మకాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. యువకులను తనిఖీ చేయగా ఒక బైక్​ లో 300 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో పోలీసులు వారి వెనుక ఉన్న చైన్​ లింక్​ ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. 
  • అక్టోబర్​ రెండో వారంలో సత్తుపల్లిలో 20 రోజులు నిఘాపెట్టి 11 మందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి దాదాపు 6 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఏఓబీ బోర్డర్​ నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చి సత్తుపల్లిలోని గ్రామాల్లో అమ్ముతున్నట్టు గుర్తించారు.  పోలీసుల విచారణలో వీరంతా 82 మందికి గంజాయి అమ్మారని తేలగా, అందులో 11 మంది మైనర్లు ఉన్నట్టు విచారణలో తేలింది.  
  • పెనుబల్లి మండల కేంద్రంలో బీసీ కాలనీకి పక్కనే ఉన్న ఉపయోగంలో లేని షాదిఖానా దగ్గరన, సెలవు రోజుల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో యువకులు గంజాయి తాగడానికి అడ్డాగా చేసుకున్నారు. పోలీసులు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేదు.  ఈ ఏడాదిలో మూడుసార్లు పెనుబల్లి మండలం గౌరారం టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సుల్లో గంజాయి తరలిస్తుండగా సత్తుపల్లి ఎక్స్సైజ్ అధికారులు పట్టుకొని కేసులు నమోదు చేశారు.
  • తల్లాడ మండలంలో పలుచోట్ల గంజాయి సేవిస్తున్నట్టు అనుమానంతో కొంతమంది యువతకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మల్లారం రోడ్డు, వెంకటేశ్వర టెంపుల్ ఏరియా, పాయపపూర్ స్టేజ్ ఇంకా కొన్ని ప్లేసుల్లో నిఘా ఏర్పాటు చేశారు.  
  • కారేపల్లికి చెందిన ఓ కూరగాయల వ్యాపారి కొడుకు ఆరు నెలల కింద ఖమ్మంలో గంజాయితో పట్టుబడ్డాడు. అతడిని విచారించి అరెస్టు చేసిన తర్వాత కారేపల్లికి చెందిన 10 మంది యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.  
  • వైరా మున్సిపాలిటీలోని బ్రాహ్మణపల్లి వార్డుకు చెందిన కొంతమంది యువకులు పొలాల్లో గంజాయి తాగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.   
  • భద్రాచలం, చత్తీస్​గఢ్​ నుంచి బస్సుల్లో గంజాయిని తరలిస్తున్న యువకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి నుంచి 50 కేజీల వరకు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.