జీపీ సెక్రెటరీ అనూజ సంతకం ఫోర్జరీ .. నలుగురుపై కేసు నమోదు

  • 30 మందికి అక్రమంగా ఇంటి నంబర్ల కేటాయింపు

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అంతర్గాం గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి ఆన్​లైన్​లో లాగిన్​ అయి 30 ఇండ్లకు ఇంటి నంబర్లు కేటాయించారు. దీనిపై గ్రామ పంచాయతీ సెక్రటరీ అనూజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతర్గాం సెక్రెటరీగా అనూజ నాలుగేండ్లుగా పని చేస్తున్నారు. 2023 మే 15 నుంచి నవంబర్‌‌‌‌ 3 వరకు ఆమె మెటర్నిటీ లీవులో ఉంది. తర్వాత డ్యూటీలో జాయిన్‌‌ అయి 2024కు సంబంధించిన ఆన్​లైన్​డిమాండ్​ రిజిస్టర్​ చెక్​ చేయగా, అందులో 30 మందికి కొత్తగా ఇంటి నంబర్లు కేటాయించి రిజిస్ట్రేషన్​ చేసినట్లు గుర్తించారు. 

దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చెక్‌‌ చేయగా జీపీ కారోబార్‌‌‌‌ బానాల మహేశ్​ ఈ–-పంచాయతీ ఆన్​లైన్​ ఐడీ సాయంతో సంతకం ఫోర్జరీ చేసి పర్మిషన్లు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో మాజీ సర్పంచ్​ కుర్ర వెంకటమ్మ, ఆమె భర్త నూకరాజు, మాజీ ఉప సర్పంచ్​ పెరుమాళ్ల శశికుమార్​డబ్బులు తీసుకున్నట్లు తేలింది. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అంతర్గాం ఎస్ఐ బి.వెంకటస్వామి తెలిపారు.