సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా..ఒక్కొక్కరికి సగటున లక్షా 90 వేలు

  • సంస్థ లాభాల్లో 33 శాతం వాటా.. మొత్తం 796 కోట్లు 
  • తొలిసారి ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికీ రూ.5 వేలు
  • సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి 

హైద‌రాబాద్‌, వెలుగు : సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ద‌స‌రాకు ముందే లాభాల్లో వాటా ప్రకటించింది. గ‌తేడాది సింగ‌రేణికి వచ్చిన లాభాల్లో 33 శాతం వాటాను బోన‌స్‌ కింద కార్మికులకు ఇస్తున్నట్టు సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. దీని వల్ల ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 ల‌క్షలు అందుతాయని చెప్పారు.

అదే విధంగా సింగరేణి చరిత్రలో తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేలు చొప్పున ఇస్తున్నామని వెల్లడించారు.  శుక్రవారం సెక్రటేరియెట్​లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌‌‌‌నలో సింగ‌‌‌‌రేణి కార్మికులు అగ్రభాగాన నిలిచార‌‌‌‌ని, ఉద్యమాన్ని ప‌‌‌‌తాక స్థాయికి తీసుకెళ్లడంతో కార్మికుల పాత్ర మ‌‌‌‌రువ‌‌‌‌లేనిద‌‌‌‌ని సీఎం రేవంత్ కొనియాడారు. అనంత‌‌‌‌రం సింగ‌‌‌‌రేణి లాభాలు, విస్తర‌‌‌‌ణ‌‌‌‌, బోన‌‌‌‌స్‌‌‌‌కు సంబంధించిన వివ‌‌‌‌రాల‌‌‌‌ను డిప్యూటీ సీఎం భ‌‌‌‌ట్టి వివరించారు. 

‘‘2023–24 సంవ‌‌‌‌త్సరంలో సింగరేణికి రూ.4,701 కోట్ల ఆదాయం స‌‌‌‌మ‌‌‌‌కూరింది. ఇందులో సంస్థ విస్తర‌‌‌‌ణ‌‌‌‌, పెట్టుబ‌‌‌‌డుల‌‌‌‌కు రూ.2,289 కోట్లు కేటాయించాం. మిగిలిన‌‌‌‌ రూ.2,412 కోట్ల లాభాల్లో మూడో వంతు రూ.796 కోట్లను కార్మికుల‌‌‌‌కు బోన‌‌‌‌స్‌‌‌‌గా ప్రక‌‌‌‌టిస్తున్నాం. సింగ‌‌‌‌రేణిలో మొత్తం 41,387 మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. వీరికి సగటున రూ.1.90 ల‌‌‌‌క్షలు అందుతాయి. గ‌‌‌‌తేడాది సింగ‌‌‌‌రేణి కార్మికులకు లాభాల్లో వాటా కింద రూ.1.70 ల‌‌‌‌క్షలు అందాయి. 

ఈసారి అంతకుమించి అందిస్తుండడం సంతోషకరం. సింగ‌‌‌‌రేణి సంస్థ చ‌‌‌‌రిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికుల‌‌‌‌కూ వాటా ఇస్తున్నాం. 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేల చొప్పున అంద‌‌‌‌జేస్తున్నాం” అని భట్టి వెల్లడించారు. ద‌‌‌‌స‌‌‌‌రా పండ‌‌‌‌గ‌‌‌‌కు ముందే ఈ మొత్తాన్ని వారి ఖాతాల్లో వేస్తామని చెప్పారు. 

సంస్థ విస్తరణకు పెట్టుబడులు.. 

సింగ‌‌‌‌రేణి ఆర్జించిన లాభాల‌‌‌‌ను భ‌‌‌‌విష్యత్ అవ‌‌‌‌స‌‌‌‌రాల‌‌‌‌కు త‌‌‌‌గిన‌‌‌‌ట్టు పెట్టుబ‌‌‌‌డులు పెట్టాల‌‌‌‌ని నిర్ణయించామ‌‌‌‌ని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఇందులో భాగంగా సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని వెయ్యి మెగావాట్లకు విస్తరించ‌‌‌‌డం, రామ‌‌‌‌గుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం, జైపూర్‌‌‌‌లోని ప్రస్తుత థ‌‌‌‌ర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో మ‌‌‌‌రో 1x800 మెగావాట్ల సామ‌‌‌‌ర్థ్యం గల థ‌‌‌‌ర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం, రామ‌‌‌‌గుండంలో టీఎస్ జెన్ కో ఆధ్వర్యంలో మ‌‌‌‌రో 1x800 మెగావాట్ల థ‌‌‌‌ర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం, ఒడిశాలోని నైనీ బ్లాక్‌‌‌‌పైన (పిట్‌‌‌‌హెడ్‌‌‌‌) 2,400 మెగావాట్ల సామ‌‌‌‌ర్థ్యం క‌‌‌‌లిగిన సూప‌‌‌‌ర్ క్రిటిక‌‌‌‌ల్ థ‌‌‌‌ర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాల‌‌‌‌ని నిర్ణయించామని తెలిపారు. 

‘‘సంస్థ ప‌‌‌‌రిధిలోని వీకే ఓపెన్ కాస్ట్‌‌‌‌, గోలేటీ, నైనీ ఓసీల‌‌‌‌ను ప్రారంభిస్తాం. సింగ‌‌‌‌రేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లల కోసం కొత్త రెసిడెన్షియ‌‌‌‌ల్ పాఠ‌‌‌‌శాల‌‌‌‌లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌‌‌‌, ఏరియా ఆసుప‌‌‌‌త్రుల ఆధునికీక‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌తో పాటు హైద‌‌‌‌రాబాద్‌‌‌‌లో మ‌‌‌‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌‌‌‌త్రి ఏర్పాటుకు చ‌‌‌‌ర్యలు తీసుకుంటున్నాం” అని చెప్పారు. సమావేశంలో మంత్రులు, సింగ‌‌‌‌రేణి ప్రాంత ఎమ్మెల్యేలు గ‌‌‌‌డ్డం వినోద్‌‌‌‌, మ‌‌‌‌క్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌‌‌‌, ప్రేమ్‌‌‌‌సాగ‌‌‌‌ర్‌‌‌‌రావు, సింగ‌‌‌‌రేణి సీఎండీ బ‌‌‌‌లరాం పాల్గొన్నారు.